Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'స్క్రిప్ట్ నచ్చితే కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి బయోపిక్‌లో నటించేందుకు నేను రెడీగా ఉన్నాను' అని కథానాయకుడు సూర్య చెప్పారు. ఆయన తాజాగా నటించిన చిత్రం 'ఎన్‌జికె'. సూర్య, సాయిపల్లవి, రకుల్ ప్రీత్‌సింగ్ నాయికా నాయికలుగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈనెల 31న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో కథానాయకుడు సూర్యతో మీడియా జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..
సందేశాలుండవు..
ఇది రాజకీయ నేపథ్య చిత్రమైనప్పటికీ ఇందులో సందేశాలుండవు. యూనివర్సల్ కాన్సెప్ట్ కాబట్టి అటు తమిళ ప్రేక్షకులకు, ఇటు తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుందని భావిస్తున్నాను.
రాజకీయ నేపథ్యంలో ఇప్పటికే ఎన్నో సినిమాలొచ్చినప్పటికీ వాటితో పోలిస్తే చాలా వైవిధ్యంగా ఉంటుంది. రెగ్యులర్ సినిమాటిక్ ఫార్మెట్లో ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. పైగా దర్శకుడు సెల్వరాఘవన్ చిత్రీకరణ శైలి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. డ్రమటిక్‌గా ఉండటానికి ఏమాత్రం ఇష్టపడరు. ఆయన స్టయిల్లో ఉండే చిత్రమిది. సాయిపల్లవి, రకుల్ ప్రీత్ సింగ్‌తో నటించడం కూడా చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్.
ఏ రాష్ట్ర రాజకీయాలను ప్రతిబింబించదు..
ఇది ఏ రాష్ట్ర రాజకీయాలను ప్రతిబించించదు. ప్రతి రాష్ట్రంలో రాజకీయాలు వేర్వేరుగా ఉంటాయి. అలాగే ఫలానా అంశాన్ని మాత్రమే తీసుకుని హైలైట్ చేయాలనో లేదా ఫలానా టాపిక్ మీదే ఫోకస్ చేయాలనే ఉద్దేశంతో ఈ సినిమా చేయలేదు. పొలిటికల్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడమే మా సినిమా లక్ష్యం. మామూలుగానే పాలిటిక్స్ గురించి అందరూ మాట్లాడుకుంటారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పాలిటిక్స్ అనేది హాట్ టాపిక్ అయ్యింది. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పాలిటిక్స్ మినిట్ టు మినిట్ చర్చనీయాంశమైంది.
సెల్వరాఘవన్ స్టయిల్ చాలా డిఫరెంట్..
నా కెరీర్లో చాలా మంది దర్శకులతో పని చేశాను. ఒక్కొక్కరిది ఒక్కో స్టయిల్. కొంతమంది కథని చాలా సాదా సీదాగా నెరేట్ చేస్తారు. కాని దాన్ని ప్రజెంట్ చేసేటప్పుడు సెట్లో వారి స్టయిల్ పూర్తిగా మారిపోతుంది. అలాగే కొంతమంది నెరేషన్‌లోనే సినిమా చూపించేస్తారు.
కాని సెట్లో వారి వర్కింట్ స్టయిల్ చాలా సాదాసీదాగా ఉంటుంది. వర్కింగ్ స్టయిల్స్ వేరైనప్పటికీ అంతిమంగా అవుట్‌పుట్ విషయంలో ఏ దర్శకుడూ రాజీపడరు. ఇందులో సెల్వరాఘవన్ పై వర్గానికి చెందినవారు. ఈ కథ విన్న తర్వాత ప్రతి రోజూ సెట్‌కి బ్లాంక్ మైండ్‌తో వెళ్ళేవాడిని. కథానుగుణంగా నా పాత్ర నుంచి దర్శకుడు ఏమైతే ఆశిస్తున్నారో దాన్ని మాత్రమే ప్రజెంట్ చేసేందుకు ప్రయత్నించాను. రెగ్యులర్ షూటింగ్‌తో పోలిస్తే మొదట్లో సెల్వ షూటింగ్ చాలా కష్టంగా అనిపించేది. ఎందుకంటే షూటింగ్‌కి సంబంధించి ప్రతి అంశాన్ని ఆయనే దగ్గర్నుండి మరీ పర్యవేక్షిస్తారు. నటీనటులుగా కేవలం ఆయన చెప్పింది మాత్రమే చేశాం. ఈయన దర్శకత్వంలో సినిమా చేయటానికి 19 ఏండ్లు వెయిట్ చేశాను.
నమ్మినందుకు థ్యాంక్స్..
ఈ సినిమా చూడకుండానే ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేసేందుకు ముందుకొచ్చిన నిర్మాత కె.కె.రాధామోహన్‌కి థ్యాంక్స్. కథ అందులోని కంటెంట్, నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు మాత్రమే కనుక్కొని ఆయన ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు అంగీకరించారంటే మా మీద ఆయనకు ఉన్న నమ్మకమే కారణం. ఇప్పటివరకు ఆయన తన బ్యానర్ నుంచి ఏ డబ్బింగ్ చిత్రాన్ని విడుదల చేయలేదని తెలిసింది. ఫస్ట్‌టైమ్ మా చిత్రాన్ని విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఆయన బ్యానర్లో తెలుగు స్ట్రయిట్ చిత్రాన్ని చేస్తారా అని చాలా మంది అడుగుతున్నారు. నిజాయితీ, మంచితనంతోపాటు సినిమా మేకింగ్ పట్ల ప్యాషన్‌తో ఉన్న ఇటువంటి నిర్మాతలతో ఏ కథానాయకుడైనా సినిమాలు చేయాలనుకుంటారు. భవిష్యత్‌లో అన్ని కుదిరితే ఆయన బ్యానర్లో తప్పకుండా తెలుగు స్ట్రయిట్ సినిమా చేస్తాను. సౌత్ కొరియాలోనూ ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం.
జగన్ పదేండ్ల కష్టానికి దక్కిన ప్రతిఫలం...
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అఖండ విజయంతో గెలవడం చాలా ఆనందంగా ఉంది. ఆయన సుదీర్ఘంగా సాగించిన పదేళ్ల పాదయాత్ర, అనుక్షణం ప్రజల కోసం తపించినందుకు మంచి ఫలితం దక్కిందని భావిస్తున్నా. మొదట్నుంచి జగన్ కుటుంబంతో మా ఫ్యామిలీకి మంచి సన్నిహిత సంబంధాలున్నాయి. జగన్ బయోపిక్ తీస్తున్నారనే వార్తలు నా వరకూ వచ్చాయి. స్క్రిప్ట్ నచ్చితే వై.ఎస్.జగన్‌గా నటించేందుకు సిద్ధంగా ఉన్నాను. ప్రస్తుతం 'కాప్పాన్', 'సూరారైపొట్రు' చిత్రాల్లో నటిస్తున్నాను.