Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రీతి సింగ్ ప్రధాన పాత్రధారిణిగా ఆర్కాన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రంజిత్ కోడిప్యాక సమర్పణలో సత్యనారాయణ ఏకారి స్వీయ దర్శత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'స్టూవర్ట్‌పురం'. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్, ట్రైలర్‌ని ప్రముఖ దర్శకుడు సుకుమార్ శుక్రవారం విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. దర్శకుడు సత్యనారాయణ కొత్త ఐడియాతో ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాకు ఆయన కేవలం దర్శకత్వం మాత్రమే కాదు, ఎడిటింగ్, కెమెరా ఇలా ఆల్ రౌండర్‌గా పనిచేసి చాలా తక్కువ సమయంలో పూర్తి చేశారు. తప్పకుండా సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందన్న నమ్మకం ఉంది. టీమ్‌కి అభినందనలు' అని అన్నారు.
'మా సినిమా ట్రైలర్‌ని విడుదల చేసి మమ్మల్ని ప్రోత్సహించిన సుకుమార్‌కి ధన్యవాదాలు. గతంలో మా బ్యానర్లో నిర్మించిన 'నందికొండ వాగుల్లోనా', 'మోని' చిత్రాల దర్శకుడు సత్యనారాయణ ఏకారి ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు. సెన్సార్ పూర్తి చేసుకుని 'యు/ఏ' సర్టిఫికేట్ పొందింది. ఫస్ట్ కాపీ రెడీగా ఉంది. ఈ నెల 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని సమర్పకులు రంజిత్ కోడిప్యాక తెలిపారు. చిత్ర దర్శకుడు సత్యనారాయణ ఏకారి మాట్లాడుతూ, 'సుకుమార్ ట్రైలర్ చూసి బాగా నచ్చిందని ప్రోత్సహించారు. ఆయన చెప్పిన సలహాలను కూడా పాటిస్తాం. నర రూప రాక్షసుల్లాంటి స్టూవర్ట్‌పురం గ్యాంగ్, హీరోయిన్ ఇంట్లోకి చొరబడతారు. వాళ్ళని కథానాయిక ఎలా ఎదుర్కొందనే పాయింట్‌తో సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కించాం. రీరికార్డింగ్‌కి మంచి స్కోప్ ఉన్న ఈ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నవనీత్ చారి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అందించారు. మాకిది మంచి గుర్తింపు తెచ్చే చిత్రమవుతుంది' అని చెప్పారు. హీరోయిన్ ప్రీతి సింగ్ చెబుతూ, 'సినిమాలో చాలా శక్తివంతమైన పాత్రలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్' అని చెప్పారు. మల్లికా, రవిరాజ్, భాను ప్రసాద్, హర్ష నల్లబెల్లి, శివప్రసాద్, సాయిరామ్ దాసరి ఇతర పాత్రలు పోషిస్తున్నారు.