Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హరనాథ్ పొలిచెర్ల హీరోగా నటిస్తూ డ్రీమ్ టీమ్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'కెప్టెన్ రాణా ప్రతాప్'. ష్రాన్, షకీల్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం సోమవారం జరిగింది. అతిథిగా విచ్చేసిన సుమన్ చిత్ర ట్రైలర్‌ని, తమ్మారెడ్డి భరద్వాజ పాటల సీడీలను విడుదల చేశారు. తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ, 'హరనాథ్ అమెరికాలో మంచి డాక్టర్. ఎంతో మంది ప్రాణాలను కాపాడారు. ఇప్పుడు ఈ సినిమాలో సైనికుడిగా దేశాన్ని కాపాడేందుకు సిద్ధమయ్యారు. ఆయన మల్టీటాలెంటెడ్. గతంలో 'హోప్', 'చంద్రహాస్' సినిమాలు తీసి అవార్డులందుకున్నారు. ఇప్పుడు ఓ దేశభక్తి చిత్రంతో, మంచి సందేశంతో వస్తున్నారు. సైనికుడి రియల్ లైఫ్‌ని బేస్ చేసుకుని తీసిన ఈ సినిమా అందరిని ఆకట్టుకోవాలని కోరుకుంటున్నా' అని అన్నారు. 'ఇందులో నేను మేజర్ పాత్ర పోషించా. శక్తివంతమైన పాత్ర నాది. సినిమాలో యాక్షన్‌తోపాటు దేశభక్తి సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నా' అని సుమన్ చెప్పారు. హరనాథ్ పొలిచెర్ల చెబుతూ, 'రెండేండ్లగా ఈ కథని సిద్ధం చేశాను. కథకి తగ్గ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు కుదిరారు. సైనికుడు కూడా సాధారణ వ్యక్తే. అతనికి భార్య, పిల్లలు, ఫ్యామిలీ ఉంటుంది. వాటిన్నింటిని వదులుకుని దేశం కోసం పోరాడతాడనే నేపథ్యంలో ఓ సైనికుడి కథని తెరకెక్కించాం. ఈ నెల 21న సినిమాని విడుదల చేయబోతున్నాం. ఆదరించాలని కోరుకుంటున్నా' అని చెప్పారు. 'సైనికుడు అభినందన్ జీవితాన్ని పోలి ఈ కథ ఉంటుంది. నేను ఇందులో ఓ మంచి పాట రాశాను' అని రచయిత జొన్నవిత్తుల తెలిపారు.