Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'దర్శకుడిగా త్రివిక్రమ్ నాకు స్ఫూర్తి. కథ రాయడం, తెరపై దాన్ని అందంగా చెప్పడం ఆయన్నుంచే నేర్చుకున్నా' అని అంటున్నారు దర్శకుడు అరుణ్ పవార్. 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్' తర్వాత సప్తగిరి హీరోగా అరుణ్ పవార్ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'వజ్ర కవచధర గోవింద'. ఈ నెల 14న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు అరుణ్ పవార్ సోమవారం మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
వీఎఫ్ఎక్స్ టు డైరెక్షన్
మాది నెల్లూరు. ఇంటర్ పూర్తి చేసి వీఎఫ్ఎక్స్ నేర్చుకున్నా. పదేండ్లపాటు వీఎఫ్ఎక్స్ విభాగంలో పనిచేశా. త్రివిక్రమ్ దగ్గర 'అతడు' నుంచి వర్క్ చేస్తున్నా. చివరగా 'అ..ఆ'కు చేశా. ఈ క్రమంలో దర్శకత్వంపై అవగాహన పెంచుకున్నా. ఎవరి దగ్గర అసిస్టెంట్‌గా వర్క్ చేయలేదు. అవగాహన లేకుండా ఓ సినిమా చేశా. తప్పు జరిగింది. ఆ తర్వాత సప్తగిరి హీరోగా 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్' రూపొందించాను. ఇది మంచి ఆదరణ పొందింది. వెంటనే సప్తగిరితో మరో సినిమా చేద్దామనుకున్నాం. కథ విషయంలో ఆలస్యమైంది. ఈ లోపు తనకి మరో ఆఫర్ రావడంతో అది చేశాడు. బాబీ రూపొందిస్తున్న 'వెంకీమామ'కి స్క్రిప్ట్ వర్క్‌లో నేను పాల్గొన్నాను. ఆ టైమ్‌లోనే నా దగ్గరున్న ఓ కథని బాబీకి చెప్పా. ఆయన నిర్మించేందుకు సిద్దమయ్యారు. కానీ దానికి చాలా టైమ్ పట్టేలా ఉంది. ఈ టైమ్‌లోనే సప్తగిరి 'వజ్రకవచధర గోవింద' కథతో నా దగ్గరికి రావడంతో ఈ సినిమా ట్రాక్ ఎక్కింది.
వజ్రం చుట్టూ తిరిగే కథ..
ఇది వినోదభరితంగా సాగే ఎమోషనల్ చిత్రం. వజ్రం చుట్టూ కథ తిరుగుతుంది. హీరో పేరు గోవిందం. ఈ రెండు కలిసేలాగా 'వజ్రకవచధర గోవింద' అనే పేరు పెట్టాం. పైగా ఇది దేవుడికి సంబంధించిన నామం. అందుకే టైటిల్ పొడవుగా ఉన్నా ఇన్నోవేటివ్‌గా ఉంటుందని పెట్టాం. హీరో ఊరులో మోసానికి గురవుతాడు. దీంతో ఊరు నుంచి బయటకు వచ్చి ఊరి బాగు కోసం దొంగతనాలు చేస్తుంటాడు. ఈ క్రమంలో చోటు చేసుకునే ఆసక్తికర సన్నివేశాల సమాహారమే ఈ సినిమా. కామెడీతోపాటు హీరో ప్లాష్‌బ్యాక్ ఎమోషనల్‌గా ఉంటుంది. సందేశం కూడా ఉంటుంది. మనం చేసే పనే కాదు, వెళ్ళే మార్గం కూడా కరెక్ట్‌గా ఉండాలని చెప్పే చిత్రమిది. సప్తగిరితో పని చేయడం నాకు కంఫర్ట్‌గా అనిపించింది. అందుకే ఈ సినిమా చేశాం. ఇదే కాదు మున్ముందు కూడా చేస్తా. ఈ చిత్రంతో సప్తగిరి కామెడీ హీరోగా మంచి గుర్తింపు పొందుతాడని ఆశిస్తున్నా.
సక్సెస్ వస్తే పెద్ద హీరోతో..
ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ అవుతుందని నమ్ముతున్నా. సక్సెస్ వస్తేనే పేరొస్తుంది. పెద్ద హీరోలతో సినిమాలు చేయడానికి స్కోప్ ఉంది. నెక్ట్స్ బాబీ నిర్మాణంలో సినిమా ఉంటుంది. సాయిధరమ్ తేజ్‌ని హీరో అనుకుంటున్నాం. ఇంకా ఫైనల్ కాలేదు. దర్శకుడిగా నాకు స్ఫూర్తి త్రివిక్రమ్. ఆయన వల్లే దర్శకత్వం నేర్చుకున్నా. నా మొదటి సినిమా 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్' చూసి 'నీలో మంచి కంటెంట్ ఉంది. పెద్ద దర్శకుడవుతావ'న్నారు. చాలా సలహాలిచ్చారు. వీఎఫ్ఎక్స్ అనేది నాకు హాబీ. దర్శకత్వం నా గోల్. వీఎఫ్ఎక్స్ చేయడం కంటే దర్శకత్వమే సవాల్. అందులోనే ఆనందం ఉంది.