Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఎస్వీ రంగారావు నా ఆరాధ్య నటుడు. ఆయనంటే అపారమైన అభిమానం. ఆయనపై వచ్చిన 'మహానటుడు' పుస్తకం ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నా' అని చిరంజీవి అన్నారు. సంజరు కిషోర్ రూపొందించిన ఎస్వీ రంగారావు ఫొటో బయోగ్రఫి 'మహానటుడు' పుస్తక ఆవిష్కరణ వేడుక ఇటీవల హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హోటల్లో వైభవంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. మహానటుడు పుస్తకాన్ని ఆవిష్కరించారు. తొలిప్రతిని ప్రముఖ వ్యాపారవేత్త పెండ్యాల హరనాథ్ బాబు ఒక లక్షా వెయ్యి నూటపదహార్లు చెల్లించి అందుకున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, 'నా కెరీర్ ప్రారంభం నుంచి నా అభిమాన నటులెవరంటే ఎస్వీఆర్, సావిత్రి, కన్నాంబ పేర్లు చెబుతా. ఎస్వీఆర్ నటన చూసి ఎంతో నేర్చుకోవచ్చు. నటనలో ఆయనో ఎన్సైక్లో పీడియా. 1969-71మధ్యకాలంలో మా నాన్నగారు బాపట్లలో ఉద్యోగం చేస్తూ నటనపై ఇష్టంతో నాటకాలు వేస్తుండేవారు. ఆ సమయంలో ఏకాంబరేశ్వరరావు అనే నిర్మాత కె.రాఘవగారితో 'జగత్ కిలాడీలు', 'జగత్ జంత్రీలు' అనే రెండు చిత్రాల్ని తీశారు. నాన్నగారికి నటనపై ఉన్న అభిలాషను గ్రహించి ఈ రెండు చిత్రాల్లోనూ చిన్నపాత్రల్లో అవకాశం ఇచ్చారు. అలా ఎస్వీరంగారావు కాంబినేషన్లో నాన్న నటించారు. ఇంటికొచ్చి సెట్స్‌లో ఏం జరిగింది?, రంగారావుగారు ఎలా మాట్లాడతారు?, ఎలా నటిస్తారు? లాంటి విషయాలు చేసి చూపిస్తుండేవారు. ఆయన నటన సహజసిద్ధంగా ఉంటుంది. చరణ్ సినిమాల్లోకి వస్తానన్నప్పుడు కూడా రంగారావు సినిమాలు చూపించేవాడిని. అలా నేను, మా అబ్బాయి రంగారావు నుంచి స్పూర్తి పొందాం.
ఓ సందర్భంలో ఎస్వీఆర్ మరో దేశంలో పుట్టుంటే ప్రపంచం కీర్తించే మహానుభావుడు అయ్యుండేవారు అని గుమ్మడి గారు చెప్పారు. కానీ అలాంటి గొప్ప నటుడు తెలుగువాడవడం మన అదృష్టం అని నేనంటాను. నాకు నటనలో అంతలా స్పూర్తినిచ్చిన వ్యక్తిని ఒక్కసారి కూడా చూడలేకపోయానే, ఫొటో కూడా తీయించుకోలేదే అనే లోటు బాధపెడుతుంటుంది. ఇక సంజరు కిషోర్ పుస్తకం వెనుక కళపై ఉన్న తపన. రంగారావుపై ఉన్న అభిమానం కనిపిస్తున్నాయి. ఫొటోస్ అన్నీ చూస్తుంటే విజువల్ జర్నీలా ఉంది. భావితరాలకు అందివ్వడానికి ఇలాంటి పుస్తకాలు ఉపయోగపడతాయి' అని అన్నారు.
ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, తమ్మారెడ్డి భరద్వాజ, అలి, రావి కొండలరావు, రోజా రమణి, రేలంగి నరసింహరావు, కె.వి.రంగనాథ్, బొలినేని క్రిష్ణయ్య, వడ్డిరాజు రవిచంద్ర, ఎస్వీరంగారావు మేనల్లుడు వెంకట్ తదితరులు పాల్గొని ఎస్వీఆర్‌ని గుర్తు చేసుకున్నారు.