Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహిళా ప్రాధాన్యత కలిగిన చిత్రాల్లో నటిస్తూ జ్యోతిక తానేమిటో నిరూపించుకునే ప్రయత్నంలో ప్రేక్షకుల మెప్పు పొందారు. ఆమె నటించిన '36వయధినిలె' చిత్రం ఘన విజయం సాధించింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం 'రాక్షసి' సినిమాలో మెయిన్ లీడ్‌గా నటిస్తున్నారు. ఈ లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి గౌతంరాజ్ అనే నూతన దర్శకుడు డైరెక్షన్ చేస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్ర ఫస్ట్‌లుక్, ట్రైలర్ విడుదలైంది. ఈ సందర్భంగా సినిమా గురించి, జ్యోతిక పాత్ర గురించి దర్శకుడు గౌతంరాజ్ మాట్లాడుతూ, 'ప్రతి ఒక్కరి జీవితంలోనూ టీచరే తొలి హీరోగా ఉంటారు. చిన్నారుల మనసుల్లో ఉన్నతమైన ఆశయాలను నాటే ఆ ఉపాధ్యాయులే ఈ సమాజంలో కీలకమనేది నా అభిప్రాయం. ఎందుకంటే సమాజంలోని లోపాలని కూడా ప్రశ్నించేది ఉపాధ్యాయులే. అలాంటి ఓ రాక్షస ఉపాధ్యాయురాలే జ్యోతిక పోషించిన సీతా రాణి పాత్ర. రౌడీల చేతిలో ఉన్న ఓ పాఠశాలను రక్షించి, అక్కడ అందరూ కోరుకునే స్థాయిలో ప్రైవేట్ స్కూల్స్‌కి దీటుగా ప్రభుత్వ పాఠశాలని, అక్కడి పిల్లల్ని ఎలా తీర్చిదిద్దారనేది ఈ చిత్ర కథ. ప్రభుత్వ పాఠశాలల్ని పట్టిపీడుస్తున్న సమస్యలు తొలగిపోవాలంటే ఇలాంటి రాక్షసి రావాల్సిందే. ఇదొక మంచి సందేశాత్మక చిత్రమవుతుంది. ఈ నెలాఖరులో లేదా జులై ప్రారంభంలో సినిమాని విడుదల చేస్తాం' అని అన్నారు. ఈ సినిమాతోపాటు 'జాక్‌పాట్', 'ఉయరన్దా మనిథన్', 'ఖైథీ' చిత్రాల్లోనూ జ్యోతిక నటిస్తున్నారు.