Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మోహన్ కృష్ణ, హరిణి రెడ్డి హీరోహీరోయిన్లుగా, సి.హెచ్.రవి కిషోర్ దర్శకత్వంలో 'గ్యాంగ్ లీడర్' చిత్రం రూపొందుతుంది. మాణిక్యం మూవీస్, ఎస్.ఎమ్.కె ఫిలిమ్స్ పతాకాలపై సింగులూరి మోహన్ రావు నిర్మిస్తున్నారు. 'మళ్ళీ మొదలవుతుంది రచ్చ' అనేది చిత్ర ట్యాగ్‌లైన్. మనీషా ఆర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ సమర్పిస్తున్నారు. ఇటీవల హీరో మోహన్‌కృష్ణ పుట్టిన రోజుని పురస్కరించుకుని ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సిహెచ్.రవి కిషోర్ బాబు మాట్లాడుతూ, 'సినిమా 30శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. చిరంజీవి గారి సూపర్ హిట్ సినిమా టైటిల్ పెట్టడంతో ఎక్కడా రాజీపడకుండా తెరకెక్కిస్తున్నాం. ఇప్పటివరకు తీసిన సినిమా అవుట్‌ఫుట్ చాలా బాగా వచ్చింది. ఆరు పాటలు అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే విధంగా ఉన్నాయి. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు సినిమాని తీసుకొస్తాం' అని అన్నారు. 'శరవేగంగా చిత్రీకరణ జరుగుతుంది. చిరంజీవి సినిమా టైటిల్ పెట్టుకోవడం మరింత బాధ్యత పెంచింది. మెగాస్టార్ అభిమానులకు తగ్గట్టుగా సినిమాని రూపొందిస్తున్నాం' చిత్ర నిర్మాత సింగులూరి మోహన్ రావు చెప్పారు. హీరో మోహన్ కృష్ణ మాట్లాడుతూ, 'నా పుట్టిన రోజు సందర్భంగా గ్యాంగ్ లీడర్ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ అవడం ఆనందంగా ఉంది. నా అభిమాన హీరో చిరంజీవిగారి బర్త్‌డే సందర్భంగా ఆగస్ట్ 22న మా సినిమాని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం' అని చెప్పారు. '1991లో చిరంజీవి నటించిన 'గ్యాంగ్‌లీడర్' సినిమాకి ఎంత పేరొచ్చిందో, ఈ ఏడాది విడుదల కాబోతున్న, చిరంజీవి అభిమాని మోహన్ కృష్ణ నటించిన ఈ సినిమాకీ అంతే పేరొస్తుందని ఆశిస్తున్నాం. సినిమా కోసం హీరో చాలా కష్టపడ్డాడు. ఆదరించాలని కోరుకుంటున్నా' అని సమర్పకులు కిశోర్ రాఠీ తెలిపారు. సుమన్, తనికెళ్ళ భరణి, మహేష్, చిత్రం శ్రీను, రావూరి రమేష్, జబర్దస్త్ అప్పారావు, బాబీ, ఎల్బీ శ్రీరామ్, వరహాల బాబు, బాలాజీ, గీతా సింగ్, లడ్డు, సీత, జయలక్ష్మి ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మురళి, ఎడిటర్: నందమూరి హరి.