Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సందీప్ కిషన్ హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం 'నిను వీడని నీడను నేనే'. అన్యా సింగ్ కథానాయికగా నటిస్తుంది. కార్తీక్ రాజు దర్శకత్వంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధినేత అనిల్ సుంకర సమర్పణలో వెంకటాద్రి టాకీస్, వి స్టూడియోస్, విస్తా డ్రీమ్ మర్చంట్స్ పతాకాలపై దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్రహ్మణ్యన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందించిన 'నిను వీడని నీడను నేనే' టైటిల్ సాంగ్ లిరికల్ వీడియోని ఇటీవల విడుదల చేశారు. దానికి విశేష స్పందన లభిస్తుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ, 'ఓ అమ్మాయితో జీవితమంతా 'నిను వీడని తోడుగా నీడై నేను ఉంటాన'ని అబ్బాయి చెబుతున్నాడంటే కచ్చితంగా ఆ అబ్బాయిది ప్రేమే. ఆ ప్రేమ భావాలకు ప్రముఖ స్టయిలిస్ట్ నీరజ కోన చక్కటి అక్షర రూపం ఇవ్వగా, శ్రోతలు మళ్ళీ మళ్ళీ వినేలా సుమధుర బాణీ స్వరపరిచారు తమన్. వినసొంపైన బాణీకి, చక్కటి సాహిత్యానికి యాజిన్ నిజార్ గానం తోడవడంతో 'నిను వీడని నీడను నేనే' టైటిల్ సాంగ్ లిరికల్ వీడియోకి అద్భుత స్పందన లభిస్తోంది. ప్రస్తుతం ఇది చార్ట్‌బస్టర్‌గా నిలుస్తోంది. సాంగ్‌లో వచ్చిన కొన్ని సన్నివేశాలు హీరో హీరోయిన్ల మధ్య క్యూట్, రొమాంటిక్ లవ్‌ను తెలియజేస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలో మిగతా పాటల్ని విడుదల చేసి, జూలై 12న సినిమా రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నాం' అని తెలిపింది. పోసాని, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, పూర్ణిమ భగ్యరాజ్, ప్రగతి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ప్రమోద్ వర్మ, ఎడిటింగ్: చోటా కె. ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్: విదేష్.