Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'కౌసల్య కృష్ణమూర్తి' చిత్ర టీజర్ లాంచ్ సందర్భంగా చిరంజీవి
'మన తెలుగు సినిమాల్లో తెలుగు అమ్మాయిలు కొరవడిన నేపథ్యంలో ఐశ్వర్యా రాజేష్ 'కౌసల్య కృష్ణమూర్తి'లో ప్రధాన పాత్ర పోషించడం శుభ పరిణామం. ఈ సినిమాని ఎప్పుడెప్పుడు చూద్దామా అని వెయిట్ చేస్తున్నా' అని చిరంజీవి అన్నారు. ఐశ్వర్యా రాజేష్, రాజేంద్రప్రసాద్, కార్తీక్ రాజు, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రధారులుగా భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఎస్. రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మిస్తున్న చిత్రం 'కౌసల్య కృష్ణమూర్తి'. ఈ చిత్ర టీజర్‌ని మంగళవారం చిరంజీవి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'క్రీడా నేపథ్యంలోని చిత్రాలకు ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు. ఆయా సినిమాలు జాతీయ స్థాయిలో ఘన విజయం సాధించాయి. మన దేశంలో క్రికెట్ అనేది ఒకరకంగా నేషనల్ గేమ్‌లాంటిది. దాని బ్యాక్‌డ్రాప్‌లో వస్తోన్న సినిమా ఇది. ఇందులో హీరోయిన్గా చేసిన ఐశ్యర్యా రాజేష్, సాధారణ రైతు బిడ్డగా పుట్టి ఒక మహిళా క్రికెటర్‌గా అంతర్జాతీయ స్థాయికి ఎదిగే పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. క్రికెటర్ పాత్రకి న్యాయం చేయడానికి నాలుగైదు నెలల పాటు శిక్షణ తీసుకుని షూటింగ్లో పాల్గొందంటే ఆమెకున్న డెడికేషన్, శ్రద్ధాసక్తులు, పడిన కష్టం అంతా ఇంతా కాదు. ఐశ్వర్యా రాజేష్ ఎవరో కాదు, మా కొలీగ్ రాజేష్ కూతురు. ఆమెను మనస్ఫూర్తిగా అభినందిస్తూ స్వాగతం పలుకుతున్నాను. ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి, ఎలాంటి ప్రోత్సాహం లేని వాతావరణం నుండి వచ్చి, తనకు తానుగా వచ్చిన అవకాశాలను సద్వినియోగ పరుచుకుంటూ అంతర్జాతీయ స్థాయికి వెళ్లి, ఎన్నో కీర్తి ప్రతిష్టలు సంపాదించి, దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసే విధంగా క్లైమాక్స్ ఉంటుందని చెప్పారు. ఈ సినిమాని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఉంది. మంచి విజయవంతమైన సినిమాలకు పెట్టింది పేరైన క్రియేటివ్ కమర్షియల్స్‌కి ఇది మరో విజయం అవుతుంది. భీమనేని శ్రీనివాసరావుకి ఇదొక మైలుస్టోన్ చిత్రంగా నిలుస్తుందని మనస్ఫూర్తిగా భావిస్తున్నా. యూనిట్ శుభాకాంక్షలు' అని అన్నారు.
'స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఇంతకు ముందు చాలా సినిమాలు వచ్చినా స్క్రీన్‌ప్లే పరంగా, సబ్జెక్ట్ పరంగా కానీ ఇది విభిన్నమైనది. తమిళంలో పెద్ద హిట్ అయిన ఈ సినిమా తెలుగులో కూడా ఘన విజయం సాధిస్తుందని నమ్ముతున్నా' అని దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు చెప్పారు.
నిర్మాత కె.ఎస్. రామారావు మాట్లాడుతూ, '40 సంవత్సరాలుగా మెగాస్టార్‌కి, మా సంస్థకి ఉన్న అనుబంధం గురించి అందరికీ తెల్సిందే. ఆయన ఈ చిత్ర టీజర్ విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఆయనకు ధన్యవాదాలు. ఈ సినిమా ఎనర్జిటిక్‌గా ఉంటూనే మంచి ఎమోషనల్‌గా ఉండే ఒక రైతు కుటుంబానికి సంబంధించిన కథ. ప్యార్లల్గా ఒక క్రికెటర్, రైతు కథ. ఈ ఏడాది రాబోయే గొప్ప సినిమాల్లో ఖచ్చితంగా మా సినిమా నిలుస్తుంది' అని అన్నారు.