Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఇదొక బ్యాడ్ బారు కథ. ఇటీవల వచ్చిన సినిమాలన్ని చాలా సాఫ్ట్‌గా ఉన్నాయి. మాస్ సినిమాలు రాలేదు. మాస్ సినిమా కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ మా సినిమా మంచి కిక్ ఇస్తుంది. సొంత సినిమా చేస్తున్నప్పుడే కాదు బయట సంస్థల్లో పని చేసినప్పుడు కూడా నాలోని దర్శకుడు నిర్మాతని ఎప్పుడూ డామినేట్ చేయలేదు. అందుకే నాకు నిర్మాతల దర్శకుడనే ఇమేజ్ వచ్చింది. అదే నాకు పెద్ద ప్లస్ పాయింట్ అయ్యింది కూడా' అని అంటున్నారు దర్శక, నిర్మాత పూరీ జగన్నాథ్.
ట్రెండ్‌కి అనుగుణంగా కథల్ని, అందులోని కథానాయకుల పాత్రల్ని సిల్వర్‌స్క్రీన్‌పై అత్యద్భుతంగా ప్రజెంట్ చేయగల సమర్థుడు పూరీ జగన్నాథ్. అంతేకాదు అత్యంత వేగంగా సినిమాల్ని తీయగల సత్తా ఉన్న దర్శకుడు కూడా. పైగా నిర్మాతల దర్శకుడు అనే మంచి బ్రాండ్ ఇమేజ్ ఉంది. అయితే గత కొంతకాలంగా దర్శకుడిగా సరైన విజయాల్ని అందుకోలేదు. జయాపజయాలతో నిమిత్తం లేకుండా తనదైన శైలిలో వినూత్న కథలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్న పూరీ తాజాగా 'ఇస్మార్ట్ శంకర్' చిత్రానికి దర్శకత్వం వహించారు. రామ్, నభానటేశ్, నిధి అగర్వాల్ నాయకానాయికలుగా రూపొందిన ఈ చిత్రం ఈనెల 18న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని పూరీజగన్నాథ్ సోమవారం మీడియాతో సంభాషించారు. ఆ విశేషాల సమాహారం ఆయన మాటల్లోనే..
ఇదొక బ్యాడ్ బారు కథ..
ఓసారి రామ్ నన్ను కలిసి ఇప్పటి వరకు గుడ్ బారు కథలు చేశా. మంచి బ్యాడ్ బారు కథ కావాలని అడిగాడు. మా ఇద్దరి డిస్కర్షన్లో వచ్చిన పాయింటే ఈ కథ. ఇద్దరం అనుకుని ఈ కథని ట్రాక్ ఎక్కించాం. మొత్తమ్మీద ఇదొక బ్యాడ్ బారు కథ. ఆ బ్యాడ్ బారు ఏం చేశాడు అనేది మాటల్లో కంటే వెండితెరపై చూస్తేనే థ్రిల్లింగ్‌గా ఉంటుంది. నా రెగ్యులర్ కథలతో పోలిస్తే చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. 'టెంపర్' తర్వాత నాకు సరైన హిట్ లేదు. మంచి సక్సెస్ కోసం ఇలాంటి కథని ప్రిపేర్ చేశా.
తెలంగాణా యాస పెట్టడానికి కారణమదే..
ఈ కథ అనుకున్నప్పుడే హీరోతో తెలంగాణ యాసలో మాట్లాడించాలని ఫిక్స్ అయ్యా. లోకల్ హైదరాబాద్ కుర్రాడిగా పక్కా తెలంగాణ యాసతో రామ్ అద్భుతంగా నటించాడు. షూటింగ్ స్టార్ట్ అయిన తొలిరోజే రామ్ తెలంగాణ యాసలో బాగా మాట్లాడాడు.అంతేకాదు సినిమా అయిపోయాక కూడా తను అందరితో ఇదే యాసలో మాట్లాడేస్తున్నాడు (నవ్వుతూ). అంతగా అతనికి అలవాటైపోయింది. తెలంగాణ యాసతో సినిమా తీస్తే ఆంధ్ర ప్రేక్షకులకు అర్థమవుతుందా అని చాలా మంది అడుగుతున్నారు. ఎందుకు అర్థమవ్వదండి.. ఇప్పటివరకు తీసినవన్ని ఇక్కడివే. చదువుకునే రోజుల్లో మేమంతా తెలంగాణ పాటలు, జానపదాలు, గద్దర్ పాటల్ని విన్నవాళ్ళమే కదా (నవ్వుతూ). పైగా ఈ సినిమాలో తెలంగాణ స్లాంగ్ కోసం మేం పెద్దగా కష్టపడలేదు. ఎందుకంటే మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తెలంగాణా యాసలోనే మాట్లాడతారు. ఓల్డ్‌సిటీ పక్కా తెలంగాణా స్లాంగ్ కోసం మా కో డైరెక్టర్ శ్రీధర్ బాగా హెల్ఫ్ చేశారు.
రామ్‌ని చూసి కొత్తవాళ్ళు నేర్చుకోవాలి..
రామ్‌తో ఇంత వరకు సినిమా చేయలేదు. ఫస్ట్‌టైమ్ మా కాంబినేషన్లో సినిమా చేశాం. నేను అనుకున్న క్యారెక్టర్‌కి రామ్ నూటికి నూరుపాళ్ళు న్యాయం చేశాడు. రామ్ యాక్టింగ్ స్టయిల్ చూసి నేనే ఆశ్చర్యపోయా. అంత ఎనర్జీ ఉన్న నటుడ్ని ఇంత వరకు చూడలేదు. వర్క్ పట్ల అతని డెడికేషన్ చూస్తే సూపర్ అనిపించింది. కొత్తగా వచ్చే యాక్టర్లు రామ్‌ని చూసి చాలా నేర్చుకోవాలి. రామ్ ఎనర్జీ లెవెల్‌తో ఈ సినిమాని మరో లెవెల్‌కి తీసుకెళ్ళాడు. ఓ చిరుతపులిలా సినిమాలో కనిపిస్తాడు. అంతేకాదు ఇప్పటివరకు చాలా సాఫ్ట్‌గా చూసిన ఆయన అభిమానులు ఈ సినిమాలోని సరికొత్త రామ్‌ని చూసి థ్రిల్ అవుతారు. ఇక ప్రేక్షకులకు పండగే పండగ.
ప్రశాంతంగా ఫారెన్ వెళ్ళిపోయాడు..
ఈ సినిమా చూసిన తర్వాత రామ్ బయటికొచ్చి నాకొక పెద్ద హగ్ ఇచ్చాడు. చాలా సంతృప్తిగా ఉందని చెప్పాడు. అంతేకాదు ఓ మంచి సినిమాని ప్రేక్షకులకు అందిస్తున్నామనే సంతోషంతో ఎంతో ప్రశాంతంగా ఫారెన్ వెళ్ళిపోయాడు. సినిమా చూసిన తర్వాత ఓ కథానాయకుడు ఇంతగా ఎమోషన్ అవ్వడం ఫస్ట్‌టైమ్ చూశా. రామ్ కాన్ఫిడెన్స్ చూసిన తర్వాత మా యూనిట్ అందరికీ సినిమా సక్సెస్‌పై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఈ కథపై నాకు చాలా నమ్మకం ఉంది. అందుకే సీక్వెల్ తీయాలని డిసైడై వెంటనే సీక్వెల్ టైటిల్‌ని కూడా రిజిస్టర్ చేయించా. ఈ సినిమా తర్వాత పక్కా కథతో సీక్వెల్‌ని డిజైన్ చేస్తా.
పోటా పోటీగా ఉంటారు..
ఈ సినిమాలో రామ్ క్యారెక్టర్‌తోపాటు నభా నటేశ్, నిధి అగర్వాల్‌ల పాత్రలు పోటా పోటీగా ఉంటాయి. దూకుడు మనస్తత్వంతో నభా, డీసెంట్ క్యారెక్టర్లో నిధి చాలా చక్కగా ఒదిగిపోయారు. వీరికి పోటీ పడుతూ మణిశర్మగారి మ్యూజిక్ ఉంటుంది. ఈ సినిమాకి కథతోపాటు వీళ్ళంతా మంచి స్ట్రాంగ్ పిల్లర్స్. అభినయంతోనే కాదు అందంతోనూ నభా, నిధి ఇద్దరూ ప్రేక్షకుల్ని ఫిదా చేస్తారు.
ఇన్స్పైర్ అవ్వడంలో తప్పేంటి..?
ట్రైలర్లో రామ్ డిప్పకి చిప్ పెట్టాం. ఇదొక ఇంగ్లీష్ సినిమాలో ఉందని కొంతమంది కామెంట్ చేశారు. ఇదే కాదు నేను చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక అంశాన్ని ఏదో ఒక సినిమా చూసే ఇన్స్పైర్ అవుతాను. అలా ఇన్స్పైర్ అవ్వడంలో తప్పు లేదని నా స్ట్రాంగ్ ఫీలింగ్ (నవ్వుతూ). ప్రతి సినిమాకి ఏదో ఒక కామెంట్ వినిపిస్తూనే ఉంటుంది. ఇవేవీ నేను పట్టించుకోను. అలాగే ఫలానా సినిమాలో హీరో క్యారెక్టర్ని అలా చూపించారు. ఇలా చూపించడం వల్ల సమాజానికి అది జరుగుతుంది, ఇది జరుగుతుందనే కామెంట్లు చేస్తుంటారు. ఇవన్ని మా దర్శకుల క్రియేటీవ్ ఫ్రీడమ్‌ని డిస్ట్రబ్ చేస్తాయి. ఈ మధ్య సోషల్ మీడియాలో వీటి హడావుడి చాలా ఎక్కువైంది. మేం ఏం చేసినా ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడమే మా లక్ష్యం.
అందుకే నిర్మాతల దర్శకుణ్ణి అయ్యా..
సొంత సినిమాలకు చేస్తున్నప్పుడే కాదు బయట సంస్థలకు సినిమాలు చేస్తున్నప్పుడు కూడా నాలోని దర్శకుడు నిర్మాతని ఎప్పుడూ డామినేట్ చేయలేదు. చేయడు కూడా. ఎందుకంటే ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తున్నప్పటికీ ఏదో ఒక టైమ్‌లో అనుకున్నవి సమకూరక పోవచ్చు. అంత మాత్రానా అదే కావాలని కూర్చోవడం నాకిష్టం ఉండదు. అందుకే ఆ టైమ్‌లో నిర్మాతని ఏ మాత్రం ఇబ్బంది పెట్టకుండా ఉన్న వనరులతోనే సినిమా తీసేస్తా. ఇదే నాకు పెద్ద ప్లస్ పాయింట్ అయ్యింది. అంతేకాదు పూరీ నిర్మాత దర్శకుడు అనే బ్రాండ్ ఇమేజ్‌ని ఆపాదించింది. ఈ ఇమేజ్ రావడాన్ని చాలా సంతోషంగా ఫీలవుతున్నా. ఇక ఈ సినిమా విషయానికొస్తే నిర్మాణం మొత్తం ఛార్మినే చూసుకుంది. నాతోపాటు యూనిట్లో ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా ఛార్మి చాలా బాగా మేనేజ్ చేసింది. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం ఛార్మినే అని కచ్చితంగా చెప్పగలను.
మంచి కథ కోసం వెయిటింగ్..
'పైసా వసూల్' తర్వాత బాలకృష్ణతో సినిమా చేయాలనుకున్నాం. అయితే సరైన కథ ఇంకా సెట్ అవ్వలేదు. అదిరిపోయే కథ సెట్ అయితే డెఫినెట్‌గా బాలకృష్ణతో సినిమా ఉంటుంది. పైగా ఆయనతో సినిమా చేయడమంటే నాకెంతో ఇష్టం. ప్రస్తుతం ఆకాష్‌పూరీ నటిస్తున్న 'రొమాంటిక్' చిత్రాన్ని నిర్మిస్తున్నాను. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే యాభై శాతం షూటింగ్ పూర్తయ్యింది. అందరినీ అలరించే సినిమా అవుతుందనే నమ్మకంతో ఉన్నా.
మంచి సినిమాలొస్తున్నాయి..
ఈ మధ్యకాలంలో 'మజిలీ', 'జెర్సీ', 'ఓ బేబీ', 'దొరసాని' వంటి తదితర మంచి సినిమాలు రావడం చాలా ఆనందంగా ఉంది. మూసధోరణిలో వెళ్ళకుండా కొత్తదనంతో వస్తున్న సినిమాలను చూస్తుంటే ముచ్చటేస్తుంది. కొత్తవాళ్ళు అయినప్పటికీ తమ శక్తిమేరకు అద్భుతమైన సినిమాలు చేయాలనే మోటోతో రావడం అభినందించదగ్గ విషయం. అయితే ఇవన్ని చాలా సాఫ్ట్ కేటగిరికి చెందిన చిత్రాలు. ఈ ఏడాది ఇప్పటివరకు పక్కా మాస్ ఎంటర్టైనర్స్ రాలేదు. పెద్ద స్టార్లు నటించిన సినిమాలు కూడా మాస్ కేటగిరిలో లేకపోవడం కొంత కొరత. అయితే ఆ కొరతని మా సినిమా బ్యాలెన్స్ చేస్తుంది (నవ్వుతూ).