Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డా||రాజేంద్రప్రసాద్, విశ్వంత్, వెన్నెల కిషోర్, హర్షిత కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'తోలుబొమ్మలాట'. విశ్వనాథ్ మాగంటి దర్శకత్వంలో సుమ దుర్గా క్రియేషన్స్ పతాకంపై దుర్గా ప్రసాద్ మాగంటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజేంద్రప్రసాద్ పుట్టిన రోజుని పురస్కరించుకుని ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ని శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత దుర్గా ప్రసాద్ మాగంటి మాట్లాడుతూ, 'జీవితమంటేనే ఒక తోలుబొమ్మలాట. ఎవరి ఆటను వాళ్లు ఆడి తీరాల్సిందే. కాకపోతే కొన్నిసార్లు ఆ ఆటలో చిక్కుముడులుంటాయి. వాటిని ఎంత అందంగా విప్పగలిగాం? మనవారిని వాటి నుంచి ఎంత గొప్పగా విడిపించగలిగాం అనేది ఆసక్తికర, అద్భుతమైన కథతో విశ్వనాథ్ మాగంటి ఈ సినిమాని రూపొందిస్తున్నారు. అనుకున్నదానికన్నా బాగా తెరకెక్కించారు. ఇదొక విభిన్న కుటుంబ కథా చిత్రం. కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్, మంచి విలువలు ఇలా అన్నీ మేళవింపుగా ఉంటాయి. మంచి సినిమా చేశామన్న ఆనందం ఉంది. సకుటుంబంగా చూసేలా ఉంటుంది. హైదరాబాద్, రామోజీ ఫిల్మ్ సిటీ, అమలాపురం దగ్గరలోని కేశనపల్లి గ్రామం పరిసరాల్లోని అందమైన లొకేషన్లలో చిత్రీకరించాం. చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి' అని అన్నారు. 'ఇందులో ప్రధాన పాత్ర పేరు సోమరాజు. ఆ పాత్రలో రాజేంద్రప్రసాద్‌గారు నటించారు. నటించారనడం కన్నా జీవించారనడం కరెక్ట్. సోమరాజుకు గోలీ సోడాలంటే ఇష్టం. కాబట్టి అందరూ ఆయన్ని సోడాల్రాజు అని పిలుస్తుంటారు. ఆయన కుటుంబంలో కొన్ని సమస్యలు వస్తాయి. తండ్రిగా వాటిని ఓ కొలిక్కి ఎలా తెచ్చారు? తన అనుభవంతో ఎలా పరిష్కరించారన్నది ఆసక్తికరం' అని చిత్ర దర్శకుడు తెలిపారు.