Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీరామ్, కారుణ్య కత్రేన్ జంటగా తిరుపతి ఎస్.ఆర్ దర్శకత్వంలో లైవ్ ఇన్ సి క్రియేషన్స్, గంగోత్రి ఆర్ట్ క్రియేషన్స్ పతాకాలపై శ్రీపతి గంగదాస్ నిర్మిస్తున్న చిత్రం 'ఉత్తర'. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ శనివారం జరిగింది. అతిథులుగా విచ్చేసిన దర్శక, నిర్మాతలు తమ్మారెడ్డి భరద్వాజ, రాజ్‌కందుకూరి ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ, 'ట్రైలర్లో మ్యూజిక్ బాగా నచ్చింది. సురేష్ బొబ్బిలి సంగీతమంటే ఇష్టం. బ్యాక్ డ్రాప్ ఆత్మని సంగీతంతో పలికించే మ్యూజిక్ దర్శకులలో ఆయన ఒకరు. అలాగే దర్శకుడు నాకు కథ చెప్పినప్పుడు ఇలాంటి క్రైం బ్యాక్ డ్రాప్ కథలు చాలా వచ్చాయి, ఇందులో ఏం కొత్తదనం ఉంటుంది అనుకున్నాను. కానీ ట్రైలర్ చూస్తే ఆ లుక్, ఫీల్ చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. తెలంగాణ యాస తెరపై గమ్మత్తు చేస్తుంది. ఈ సినిమా తర్వాత దర్శకుడు తిరుపతికి మంచి విజయంతోపాటు గౌరవం వస్తుందని నమ్ముతున్నా' అని అన్నారు.
'సినిమాలో పాత్రలు చాలా సహజంగా ఉంటాయి. సినిమా చూసిన తర్వాత ఆ ఫీల్ మనల్ని వెంటాడుతుంది. ప్రతి సన్నివేశంతో ప్రేక్షకులు రిలేట్ అవుతారు. కారుణ్య, శ్రీరామ్ పాత్రలకు మంచి పేరొస్తుంది. స్క్రిప్ట్ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. ఏదో ఒక లైన్‌ని డెవలెప్ చేసి రాసుకున్న కథ కాదు. కథా, కథనాలలోనే ప్రేక్షకులను కట్టివేసే అంశాలున్న కథ. రొమాంటిక్ క్రైమ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందించాం. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి' అని చిత్ర దర్శకుడు తెలిపారు. రాజ్ కందుకూరి మాట్లాడుతూ, 'సినిమా బ్యాక్ డ్రాప్ కొత్త ఫీల్ కలిగిస్తుంది. స్టార్స్‌తో సంబంధం లేకుండా కంటెంట్ బాగున్న సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ చిత్రానికి సపోర్ట్ చేస్తున్న వ్యక్తులను చూస్తే మరింత నమ్మకం కలుగుతుంది. ప్రతిభగల ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు ఇండిస్టీలో స్థానం ఉంటుంది' అని చెప్పారు. 'సినిమా ఇండిస్టీలో కొత్తవాళ్ళను ప్రోత్సహించడానికి వచ్చిన నిర్మాత రాజ్ కందుకూరికి, తమ్మారెడ్డి భరద్వాజకి ధన్యవాదాలు. సినిమా ఇంత బాగా రావడానికి కారణమైన ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు థ్యాంక్స్. ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని నమ్ముతున్నా' అని నిర్మాత శ్రీపతి గంగదాస్ చెప్పారు. ఈ కార్యక్రమంలో మామిడి హరికృష్ణ, హీరో శ్రీరామ్, కారుణ్య, కత్తి మహేష్ తదితరులు పాల్గొని చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.