Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రియమణి ప్రధాన పాత్రధారిణిగా ప్రకాష్ పులిజాల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'సిరివెన్నెల'. శాంతి టెలిఫిల్మ్స్ పతాకంపై కమల్ బోరా, ఏఎన్‌బాషా, రామసీత సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సాయి తేజస్విని, కాలకేయ ప్రభాకర్, సీనియర్ నటుడు అజయ్ రత్నం, రాకెట్ రాఘవ తదితరులు కీలక పాత్రధారులు. ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం ఇటీవల వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా అతిథిగా విచ్చేసిన దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ, 'రాజేంద్రప్రసాద్ మమల్ని నవ్విస్తే, ఆయన మనవరాలు భయపెడుతుంది. మన సక్సెస్ కన్నా మన పిల్లల సక్సెస్ చూస్తేనే చాలా ఆనందంగా ఉంటుంది. సంగీత దర్శకుడు భాషా నా సినిమాల్లో చాలా వరకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ లేకపోతే సినిమానే లేదు. ప్రియమణి సతీ సావిత్రిలాగా అటు మోడ్రన్, ఇటు ట్రెడిషనల్ పాత్రలకైనా సూట్ అవుతుంది. సినిమా పెద్ద విజయం సాధించాలి' అని అన్నారు. 'నేను ఈ సినిమాలో ఇంత బాగా కనిపించడానికి కారణం ప్రకాష్‌గారు. ఈ సినిమాతో నా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయినట్లే. టీజర్, ట్రైలర్ చాలా బాగున్నాయి. ఇంత మంచి అవకాశం ఇచ్చిన భాషాకి, ఓం ప్రకాష్‌కి థ్యాంక్స్' అని ప్రియమణి చెప్పారు. చిత్ర దర్శకుడు ఓం ప్రకాష్ మాట్లాడుతూ, 'నేను తీసిన 'అనగనగా ఓ దుర్గా' సినిమా నచ్చి నిర్మాత భాషాగారు ఏదైన కథ ఉంటే చెప్పమన్నారు. ఈ కథ చెప్తే వారికి బాగా నచ్చింది. నా రెండో చిత్రమే నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రియమణితో చేయడం దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నాను. 'సిరివెన్నెల' పాత్రలో సాయి అద్భుతంగా నటించింది. సినిమా చాలా బాగా వచ్చింది' అని తెలిపారు. 'మంచి కాన్సెప్ట్‌తో, అద్భుతమైన నటీనటులు, సాంకేతిక నిపుణులతో చేసిన ఈ సినిమా విజయం సాధించి డబ్బుతోపాటు పేరు తీసుకొస్తుందనే నమ్మకంతో ఉన్నాం' అని నిర్మాతలు చెప్పారు.