Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిరంజీవి నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నయనతార, తమన్నా కథానాయికలుగా నటిస్తుండగా, అమితాబ్ బచ్చన్, విజరు సేతుపతి, సుదీప్, జగపతిబాబు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా బుధవారం ఈ చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు. ఇందులో భారీ పోరాట ఘట్టాలను, సెట్లో షూటింగ్ కసరత్తులను ప్రధానంగా చూపిస్తూ, ప్రధాన పాత్రధారులను, టెక్నీషియన్లను పరిచయం చేశారు.
ఈ సందర్భంగా చిత్ర బృందం స్పందిస్తూ, 'కొత్త పుంతలు తొక్కుతున్న తెలుగు సినిమాలకు తగ్గట్టుగా భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో సినిమాని రూపొందిస్తున్నాం. బ్రిటీష్ పాలనకు ఎదురొడ్డి నిలిచిన తొలి స్వాతంత్య్ర సమర యోధుడు, చరిత్ర మరుగున పడిపోయిన వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథని ఆధారంగా చేసుకుని ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాం. పెరుగుతున్న తెలుగు సినిమా స్పాన్‌ని దృష్టిలో పెట్టుకుని తెలుగుతోపాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ ఏడాది ద్వితీయార్థంలో విడుదల చేయనున్నాం. ఇక తాజాగా విడుదల చేసిన మేకింగ్ వీడియో సినిమాపై అంచనాలను పెంచుతుంది. రామ్ లక్ష్మణ్, గ్రెగ్ పావెల్, లీ విట్టాకర్ సారథ్యంలో యాక్షన్ పార్ట్‌ని ఎంత గొప్పగా చిత్రీకరించారో మేకింగ్ వీడియో ఎలివేట్ చేస్తుంది. తెలుగు తెరపై ఇప్పటి వరకు రాని విధంగా అద్భుతమైన యాక్షన్ పార్ట్‌తో సినిమాని రూపొందిస్తున్నాం. చిరంజీవి పుట్టిన రోజు(ఈ నెల 22)ని పురస్కరించుకుని ఈ నెల 20న చిత్ర టీజర్‌ని విడుదల చేయనున్నాం. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది సంగీతాన్ని సమకూరుస్తున్నారు. మేకింగ్ వీడియోలో బ్యాక్గ్రౌండ్స్కోర్ అద్భుతంగా ఉంది. సినిమా కోసం మెగా అభిమానులు, సాధారణ సినీ ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. వారి అంచనాలను అందుకునేలా సినిమా ఉంటుంది' అని తెలిపింది. రవికిషన్, నిహారిక ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, ఆర్ట్: రాజీవన్, వీఎఫ్ఎక్స్: కమల్ కణ్ణన్.