Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వైవిధ్యమైన సినిమాలకు, విలక్షణ పాత్రలకు పక్కా కేరాఫ్ విద్యాబాలన్ అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇటీవల 'మిషన్ మంగళ్' వంటి బ్లాక్‌బస్టర్‌తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విద్యాబాలన్ తాజాగా గణిత మేధావి శకుంతలదేవి బయోపిక్‌లో నటిస్తోంది. ఈ బయోపిక్‌కి సంబంధించి ఫస్ట్‌లుక్‌ను సోమవారం బాలీవుడ్ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులతో షేర్ చేసుకున్నారు. హ్యుమన్ కంప్యూటర్‌గా ప్రసిద్దిగాంచిన శకుంతలాదేవి జీవితానికి సంబంధించి ఎన్నో ఆసక్తికర విశేషాలు ఈ సినిమాలో ఉన్నాయని తరణ్ తన ట్వీట్లో పేర్కొన్నారు. కంప్యూటర్, క్యాలుక్లేటర్ ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉండగా హ్యుమన్ కంప్యూటర్‌గా విద్యా ప్రధమ స్థానంలో ఉన్న ఫస్ట్‌లుక్ పోస్టర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. అనూ మీనన్ దర్శకత్వంలో ఈ చిత్ర షూటింగ్ సోమవారం లండన్‌లో ప్రారంభమైంది. ఈచిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.