Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్స్కి కేరాఫ్ దర్శకుడు హరీష్ శంకర్.
ఆయన రూపొందించిన 'షాక్', 'మిరపకారు', 'గబ్బర్‌సింగ్', 'డీజే' వంటి తదితర చిత్రాలు విశేష ప్రేక్షకాదరణతో మంచి విజయాల్ని సాధించాయి. ప్రస్తుతం ఆయన దర్శకత్వం వహించిన చిత్రం 'వాల్మీకి'. వరుణ్‌తేజ్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 20న విడుదల కానుంది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని హరీష్ శంకర్ మీడియాతో సంభాషించారు.
ఆ విశేషాల సమాహారం ఆయన మాటల్లోనే..
అనుకున్నదొక్కటి.. జరిగింది మరొకటి..
వరుణ్‌కి 'దాగుడు మూతలు' స్క్రిప్ట్ చెప్పడానికి వెళ్ళాను. లవ్ స్టోరీ కైండ్ స్క్రిప్ట్ నాతో ఎందుకు చేయాలనుకుంటున్నారని వరుణ్ తన క్వశ్చన్ చేశారు. 'తొలిప్రేమ', 'ఫిదా' లాంటి సినిమాలు చేశారు. అలాగే ఈ కైండ్ నాకు కూడా కొత్తగా ఉంటుందని చెప్పాను. ఇది విని, మీతో నేను మీ టైప్ సినిమానే చేద్దామనుకుంటున్నా. అప్పుడు నాకు కూడా కొత్తగా ఉంటుందని చెప్పారు. ఆ టైమ్‌లోనే కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన 'పేట' సినిమా ఫస్ట్‌లుక్ రిలీజైంది. ఆయన సినిమాలు బాగుంటాయి కదా అని 'జిగర్తాండ' సినిమా చూశాను. బాగా నచ్చడంతో రీమేక్ చేద్దామని నేను, వరుణ్ ఫిక్స్ అయ్యాం. మొత్తమ్మీద నేను అనుకున్నది ఒకటైతే, జరిగింది మరొకటి. ఈ కథని అనుకున్న రీతిలో నేను స్క్రీన్ మీద ప్రజెంట్ చేయటానికి కారణం నిర్మాతలలు రామ్ ఆచంట, గోపి ఆచంట. 'నమో వెంకటేశ' సినిమా చేయకముందు నుంచే వాళ్ళు నాకు పరిచయం. చాలా ప్యాషనేట్ ప్రొడూసర్లు. నా సినిమాతోనే వాళ్ళ 14 రీల్స్ ప్లస్ బ్యానర్ స్టార్ట్ కావడం చాలా ఆనందంగా ఉంది.
సహజమే అయినప్పటికీ..
'దబంగ్' సినిమాని 'గబ్బర్‌సింగ్'గా రీమేక్ చేసినప్పుడు చేసినన్ని మార్పులు ఈ సినిమాకి చేయలేదు. ఎందుకంటే బేసిగ్గా 'జిగర్తాండ' మంచి కంటెంట్ ఉన్న స్క్రిప్ట్. దీని స్క్రీన్ప్లేగాని, ఇందులో ఉన్న కంటెంట్ నాకు చాలా ఇష్టం. నా అన్ని సినిమాల కంటే ఎక్కువ నిడివితో వస్తున్న సినిమా ఇది. ఎందుకంటే అంత మంచి కంటెంట్ ఈ సినిమాలో ఉంది. అయితే మన నేటివిటీకి సంబంధించి మాత్రమే చిన్న చిన్న మార్పులు చేశాను. అలాగే అక్కడ బాబీ సింహ చేసిన క్యారెక్టర్‌ను వరుణ్ క్యారక్టరైజేషన్కి సరిపోయేటట్లు కొన్ని మార్పులు చేశాను.
అందుకే ఈ టైటిల్ ఫిక్స్ అయ్యాం..
ఒక మనిషికి సంబంధించి అత్యున్నతమైన మార్పుకి వాల్మీకి మహర్షి గొప్ప నిదర్శనం. ఆయనే అందరికీ స్ఫూర్తి. ఈ సినిమాలో వరుణ్ క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ హైలైట్‌గా ఉంటుంది. ఈ సినిమా కథే అది కావడంతో 'వాల్మీకి' టైటిల్‌నే ఫిక్స్ చేశాం. వరుణ్ హీరో అవ్వక ముందు నాగబాబుగారు కొన్ని ఫొటోలు పంపించారు. ఆ ఫొటోల్లో వరుణ్ ఇంచుమించు ఇలానే కనిపిస్తాడు. ఆ ఫొటోస్ నా మనసులో ఉండటంతో వరుణ్‌కి ఈ లుక్ బాగుంటుందని దాదాపు ఆరు నెలల గడ్డం పెంచి ఈ ప్రాపర్ లుక్‌లోకి తీసుకురావడం జరిగింది. వరుణ్ ఫ్యాన్స్‌కి, మెగా ఫ్యాన్స్‌కి నేను చెప్పేది ఏంటంటే.. సెప్టెంబర్ 20న 'వాల్మీకి' సినిమాలో వరుణ్ నట విశ్వరూపం చూస్తారు. ముఖ్యంగా ఇంటర్వెల్, క్లయిమాక్స్‌లో నేను ఊహించినదాని కంటే అత్యద్భుతంగా వరుణ్ చేశారు. మరో 5 సంవత్సరాల తర్వాత కూడా నేను, వరుణ్ ఎప్పుడు 'వాల్మీకి' గురించి మాట్లాడుకున్న మాకు గర్వంగా అనిపించే విధంగా సినిమా ఉంటుంది.
చూస్తేనే థ్రిల్లింగ్‌గా ఉంటుంది..
ఇక పూజా హెగ్డే క్యారెక్టర్ కూడా ఈ సినిమాకి చాలా కీలకం. సెకండాఫ్‌లో వచ్చే చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఆ ఒక్క క్యారెక్టర్ ఆడియెన్స్‌కి సస్పెన్స్ ఇచ్చేలా ప్లాన్ చేశాం. అందుకే పూజా క్యారెక్టర్ గురించి ఎక్కువగా రివీల్ చేయడం లేదు. సినిమాలో చూస్తేనే థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఈ సినిమాలో పూజా క్యారెక్టరైజేషన్గాని, 'ఎల్లువొచ్చి గోదారమ్మ....' సాంగ్గానీ ఈ కథ డిమాండ్ మేరకే పెట్టాం.అలాగే సినిమా ఒక ఇన్స్పైరింగ్ డైరెక్టర్‌గా కనిపించే క్యారెక్టర్ కోసం అధర్వని ఎంపిక చేసుకున్నాం. మేం అనుకున్న దాని కంటే బెస్ట్ అవుట్‌ఫుట్ వచ్చింది. అలాగే, మిక్కి జే మేయర్ అనగానే క్లాసిక్, మెలోడి పాటలకు కేరాఫ్ అని వినిపిస్తుంది. నేను మిక్కీతో 'సుబ్రమణ్యం ఫర్ సేల్' చిత్రానికి వర్క్ చేశా. అయితే అతనితో ప్రాపర్‌గా వర్క్ చేయలేక పోయా. ఆయనతో ఎక్కువ టైమ్ స్పైండ్ చేయగలిగితే ఇంకా బాగా చేయగలుగుతాడనిపించింది. అందుకే ఈ సినిమాకి ఆయన్ని సెలెక్ట్ చేసుకున్నాం. .
నచ్చింది ఏదైనా సరే రీమేక్ చేస్తా..
నేను 2012 తర్వాత మళ్ళీ ఇప్పుడే రీమేక్ చేస్తున్నా. నా దృష్టిలో అన్ని సినిమాలు రీమేక్ సినిమాలే. ఒక సినిమాకి ఒక పుస్తకం, ఒక నవల, ఒక వ్యక్తి ఇన్స్పిరేషన్ అయినప్పుడు ఒక సినిమాకి మరో సినిమా ఎందుకు ఇన్స్పిరేషన్ కాకూడదు అనేది నా భావన. ఒక సినిమా ప్రేమికుడిగా నాకు నచ్చిన ఏ సినిమానైనా రీమేక్ చేస్తాను. 'జవాన్' ప్రొడ్యూసర్ కృష్ణ, మహేష్ కోనేరు ఇలా ఇంకా ఇద్దరు ముగ్గురు స్నేహితులతో కలిసి సినిమాల్ని నిర్మిస్తున్నాను. 'వాల్మీకి' రిలీజైన తర్వాత నా నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి చెబుతా.