Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏ.ఎస్.రవికుమార్ చౌదరి...
కమర్షియల్ చిత్రాల్లో సైతం సందేశం చెప్పగల దిట్ట. ఘనవిజయం సాధించిన 'యజ్ఞం' చిత్రంతో దర్శకుడిగా తనకంటూ ఓ మార్క్ సొంతం చేసుకున్నారు. తాజాగా సాయిధరమ్ తేజ్‌తో రూపొందించిన 'పిల్లా నువ్వు లేని జీవితం'తో మరోసారి సూపర్‌హిట్‌ని ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం గోపీచంద్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న రవికుమార్ చౌదరి పుట్టినరోజు నేడు (బుధవారం). ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని మీడియాతో ఆయన ముచ్చటించారు. ఆయన మాటల్లోనే
ఆ విశేషాల సమాహారం
'నవచిత్రం' ప్రేక్షకులకు ప్రత్యేకం..
మనసుని తట్టే ఎమోషన్స్..
'యజ్ఞం' తర్వాత అంటే పదేళ్ల తర్వాత భవ్య క్రియేషన్స్‌లో గోపిచంద్‌తో సినిమా చేసే అవకాశం వచ్చింది. ఇప్పటికే సినిమా ఫస్ట్ హాఫ్ పార్ట్‌ను పూర్తి చేసేశాం. ఇంకా టైటిల్ పెట్టలేదు. ఫస్ట్ హాప్ టాకీపార్ట్ ఎడిటింగ్‌తో సహా పూర్త యింది. చాలా హ్యపీగా ఉంది. గోపిచంద్ సరసన రెజీనా హీరోయిన్గా నటిస్తుంది. 'యజ్ఞం'తో పోల్చితే పెద్ద సక్సెస్ అవుతుంది. 80 శాతం ఎంటర్‌టైనింగ్‌తో ఉంటుంది. మనసుని తట్టే ఎమోషన్స్‌తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్. గోపిచంద్ సినిమాలో హయ్యస్ట్ కాస్టింగ్ మూవీ ఇది. నలభై మంది కాస్టింగ్ ఉన్నారు. సినిమాని శరవేగంగా చిత్రీకరించి డిసెంబర్ 25న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం.
దర్శకుడ్ని గౌరవించే హీరో..
దర్శకుడ్ని గౌరవించే హీరో గోపీచంద్. 'యజ్ఞం' తర్వాత గోపిచంద్ మార్కెట్ పెరిగింది. అయితే హీరోగా తన కమిట్ మెంట్లో తపన ఎక్కడా తగ్గలేదు. చాలా ప్లెజెంట్‌గా, కూల్‌గా, సినిమాకి సంబం ధించిన విషయాల్లో ఇన్వాల్వ్ అవుతాడు. సినిమా విషయానికి వస్తే హీరో స్ప్రింగ్‌లా, చలాకీగా ఉంటాడు. కథాపరంగా అతనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. చాలా యూత్‌ఫుల్‌గా, లుక్ పరంగా స్టయిలిష్‌గా కనిపిస్తాడు.
కథ కంటే కథనం ముఖ్యం..
'యజ్ఞం' తర్వాత నేను చేసిన 'ఆటాడిస్తా', 'ఏం పిల్లో ఏం పిల్లడో' చిత్రాలకు ప్రేక్షకాదరణ లభించలేదు. టీవిలో మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ చిత్రాలు ఇచ్చిన ఫలితాలతో ఇలా కాదు డిఫరెంట్‌గా చేయాలను కున్నాను. కథ కంటే కథనం ముఖ్యమని తెలుసుకున్నాను. ఇదే సూత్రంతో ఆ తర్వాత సాయిధరమ్ తేజ్‌తో చేసిన 'పిల్లా నువ్వు లేని జీవితం' చిత్రంతో విజయాన్ని అందుకున్నాను. 'పిల్లా నువ్వులేని జీవితం' నాకు మనసుకి నచ్చిన సక్సెస్. సక్సెస్‌లు వస్తుంటాయి, కానీ మనసుకి నచ్చిన సక్సెస్ వేరు కదా.!!
డైరెక్టర్‌గానే ఉంటా..
సుకుమార్ నాకు మంచి స్నేహితుడు కావడంతో 'జగడం' సినిమాలో నటించాను.అలాగే మద్దినేని రమేష్ అడగడంతో 'బ్రోకర్' మూవీలో కూడా చేశాను. అంతే తప్ప యాక్టింగ్ కంటిన్యూ చేయను. ట్రైన్లో ఇంజన్‌తోపాటు బోగీలు కూడా ఉంటాయి. నాకు ట్రైన్లో ఇంజన్‌లా ఉండటమే ఇష్టం. అందుకే డైరెక్టర్‌గానే ఉండాలని ఫిక్స్ అయ్యాను.
సక్సెస్ చాలా ముఖ్యం..
సినిమా అంటే కళాత్మకమే కాదు, వ్యాపారం కూడా. ఒక నిర్మాత తన సినిమాని ప్రాఫిట్లో రిలీజ్ చేయాలనుకుంటే దర్శకుడుగా నాకు సక్సెస్ ఉండాలి. అలాగే ఒక హీరోతో నేను సినిమా చేయాలన్నా, నాతో ఒక హీరో సినిమా చేయాలన్నా సక్సెస్ అనేది ప్రధానం. మంచి కాంబినేషన్ ఉంటే వ్యాపారమే కాదు, సినిమాకి వచ్చే ఆడియెన్ కూడా ఆ కోణంలోనే ఆలోచిస్తాడు.
నెక్ట్స్ ప్రాజెక్ట్..
కళ్యాణ్‌రామ్ బ్యానర్లో సాయిధరమ్ తేజ్ హీరోగా సినిమా చేస్తున్నాం. జనవరిలో సినిమా షూటింగ్ మొదలు పెట్టి జూన్‌లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. దీంతోపాటు మరో రెండు ప్రాజెక్టులున్నాయి.
బర్త్‌డే నిర్ణయాలు..
ఇప్పటివరకు నేను చేసే ప్రతి సినిమాకు కనీసం రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నాను. ఇకపై అలా కాకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాల్ని చేయాలనుకుంటున్నాను. అలాగే సినిమాల్లో నేను చేసిన తప్పులు ఇకపై పునరావృతం కాకుండా చూసుకుంటాను.