Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చీమ ప్రధాన పాత్రలో అమిత్, ఇందు ముఖ్య పాత్రధారులుగా శ్రీకాంత్ 'శ్రీ' అప్పలరాజు దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'చీమ ప్రేమ మధ్యలో భామ'. మాగమ్ ఓపస్ ఫిల్మ్స్ పతాకంపై లక్ష్మీ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా టైటిల్ సాంగ్‌ని తాజాగా విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీకాంత్ మాట్లాడుతూ, 'చీమేంటి? ప్రేమేంటి? మధ్యలో భామేంటి? కొత్తగా ఉందనిపించొచ్చు. కొత్తవాళ్ళతో కొత్త వాళ్ళు చేసే కొత్త ప్రయత్నమే ఈ చిత్రం. అందుకే కథలాగే టైటిల్ కూడా కొత్తగా ఉంది. తాజాగా విడుదలైన పాటకి మంచి స్పందన లభిస్తుంది' అని అన్నారు. 'రాజమౌళి రూపొందించిన 'ఈగ'ని స్ఫూర్తిగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఇందులో 2016లో మిస్టర్ ఇండియాగా నిలిచిన అమిత్ హీరోగా, 2018లో ఫెమినా మిస్‌గా నిలిచిన ఇందు హీరోయిన్గా నటిస్తుంది. చిన్నప్రాణి చీమ పాత్రని అపురూపంగా మలచిన తీరుకు అద్దం పట్టేలా మధుర గాయకులు ఎస్పీ బాలసుబ్రమణ్యం టైటిల్ సాంగ్‌ని అత్యద్భుతంగా ఆలపించారు. రవి వర్మ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ పాట పది కాలాలు అందరినీ అలరిస్తుందని నమ్ముతున్నాం' అని నిర్మాత లక్ష్మీ నారాయణ తెలిపారు. సుమన్, హరిత, పురంధర్, వెంకట్ నిమ్మగడ్డ, రమ్య చౌదరి, బొమ్మ శ్రీధర్, రవికిషోర్, కిషోర్ రెడ్డి, వెంకటేష్, నరేష్ పెరుగు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఆరిఫ్ లలాని, ఎడిటర్: హరి శంకర్.