Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాని, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన 'జెర్సీ' ఈ ఏడాది సమ్మర్లో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. విశేష ఆదరణతోపాటు విమర్శకుల ప్రశంసలందుకుంది. తాజాగా ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయబోతున్నారు. అల్లు అరవింద్, దిల్‌రాజు, మాతృక నిర్మాత సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని హిందీలో రూపొందించబోతున్నారు. మాతృక దర్శకుడు గౌతమ్ తిన్ననూరినే హిందీ వెర్షన్‌కి కూడా దర్శకత్వం వహిస్తుండటం విశేషం. 'నాని హీరోగా గౌతమ్ రూపొందించిన 'జెర్సీ' తెలుగులో మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది. ఇందులో నాని నటన అద్బుతమని చెప్పొచ్చు. దీని హిందీ రీమేక్‌కి రంగం సిద్ధమైంది. బాలీవుడ్లో 'గజని' వంటి చిత్రంతో రూ.200కోట్ల కలెక్షన్లు రాబట్టిన నిర్మాతగా పేరొందని అల్లు అరవింద్ సమర్పణలో, తెలుగులో వరుస హిట్లతో దూసుకుపోతున్న దిల్‌రాజు, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మించడం మరో విశేషం. త్వరలో సినిమా షూటింగ్‌ని ప్రారంభించి వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు' అని చిత్ర బృందం తెలిపింది. ఇదిలా ఉంటే ఇందులో నాని పాత్రలో షాహిద్ కపూర్ నటిస్తారని తెలుస్తోంది.