Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హాస్యనటుడు గౌతంరాజు తనయుడు కృష్ణ హీరోగా పరిచయం అవుతూ 'కృష్ణారావు సూపర్ మార్కెట్' చిత్రంలో నటిస్తున్నారు. ఎలెక్సా కథానాయికగా నటిస్తుంది. శ్రీనాథ్ పులకరం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బీజీఆర్ ఫిల్మ్ అండ్ టీవీ స్టూడియోస్ నిర్మించింది. నేడు(శుక్రవారం) సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. ఈ సందర్భంగా అతిథిగా విచ్చేసి ట్రైలర్‌ని విడుదల చేసిన బ్రహ్మానందం మాట్లాడుతూ, 'హాస్య కుటుంబం నుంచి వచ్చిన వారు హాస్యానికే పరిమితం అనుకుంటారు. కానీ అది నిజం కాదని నిరూపించడానికి హీరోగా కృష్ణ మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నా' అని అన్నారు.
'ట్రైలర్ బాగుంది. సినిమా తప్పకుండా చాలా పెద్ద హిట్ అవుతుంది' అని దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపారు. 'సినిమా కోసం నాన్నగారితో సహా ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడ్డారు. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో సాగే చిత్రమిది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. సినిమా తప్పకుండా మంచి విజయం సాధిస్తుంది' అని హీరో కృష్ణ తెలిపారు.
గౌతంరాజు మాట్లాడుతూ, 'నా మీద అభిమానంతో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సినిమా చాలా బాగా వచ్చింది. మా అబ్బాయి అని కాదు కృష్ణ చాలా బాగా నటించాడు. ఇంతమంచి సినిమా తీసిన దర్శకుడు శ్రీనాధ్ పులకరంకి థ్యాంక్స్. తప్పకుండా ప్రతి ఒక్కరూ సినిమా చూసి మా అబ్బాయిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను' అని చెప్పారు.
'కథ చెప్పినట్టు సినిమా తీస్తే తప్పకుండా సూపర్ హిట్ అవుతుంద'ని సినిమా ప్రారంభంలో చెప్పా, సెకండాఫ్‌లో కథ మంచి టర్న్ తీసుకుంటుంది. ఈ సినిమాలో నాక్కూడా ఆశ్చర్యం కలిగించే అంశాలు చాలా ఉన్నాయి. దర్శకుడిని అభినందిస్తున్నా. హీరోయిన్ చాలా బాగా చేసింది. ప్రేక్షకులు సినిమాని ఆదరించాలని కోరుతున్నా' అని తనికెళ్ళ భరణి అన్నారు.