Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీకాంత్, సాయి తేజస్విని, సి.హెచ్.సుమన్‌బాబు, కారుణ్య, సంజనా శెట్టి, కమల్ కామరాజు, భానుశ్రీ, ఉత్తేజ్ ప్రధాన పాత్రధారులుగా సి.హెచ్ సుమన్‌బాబు స్వీయ దర్శకత్వంలో శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ పతాకంపై బేబి ఢమరి సమర్పణలో నిర్మిస్తున్న చిత్రం 'ఎర్రచీర'. 'రాజమండ్రి రైలెక్కి చెక్కేస్తారు' అనే పాట విడుదల కార్యక్రమం బుధవారం జరిగింది. అతిథిగా విచ్చేసిన దర్శకుడు బాబీ పాటని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'ఐటమ్ సాంగ్ బాగుంది. సుమన్‌బాబు దర్శకుడిగా, నిర్మాతగా రెండు బాధ్యతలు నిర్వర్తించడం గొప్ప విషయం. సినిమా విజయం సాధించి అందరికీ మంచి పేరు తీసుకురావాలి' అని అన్నారు. 'బాబీగారు ఈ పాట విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఆయనకు థ్యాంక్స్. మా మ్యూజిక్ కంపెనీ ఢమరి మ్యూజిక్ ద్వారా పాటలను మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నాం. ఇందులో శ్రీకాంత్ అఘోర పాత్రలో కనిపిస్తారు. ఇప్పటివరకూ శ్రీకాంత్‌ని ఇలాంటి పాత్రలో చూడలేదు. ఆయన పాత్రకు ప్రత్యేకమైన గుర్తింపు దక్కుతుంది. మదర్ సెంటిమెంట్‌తో సాగే ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి డిసెంబర్ 27న రిలీజ్ చేస్తాం' అని దర్శక, నిర్మాత సుమన్‌బాబు తెలిపారు. సంగీత దర్శకుడు ప్రమోద్ మాట్లాడుతూ, 'సినిమాలో ఐదు పాటలున్నాయి. 'రైలెక్కి రాజమండ్రి చెక్కేస్తారు' పాటను రాజమండ్రికి చెందిన కడియం రవి రాయగా, గీతా మాధురి ఆలపించారు. పాటలన్నింటికి మంచి ట్యూన్స్ కుదిరాయి' అని అన్నారు. 'ఇందులో ఓ మంచి రోల్ పోషించా. అవకాశం ఇచ్చిన దర్శకులకు థ్యాంక్స్' అని సంజనా శెట్టి తెలిపారు. నటుడు వెంకట గోవిందరావు మాట్లాడుతూ, 'సుమన్ మంచి స్నేహితులు. కమిట్మెంట్, డెడికేషన్ ఉన్న వ్యక్తి. చాలా ప్యాషన్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సినిమా బాగా వస్తోంది. తప్పకుండా మంచి విజయం సాధిస్తుంది' అని చెప్పారు.