Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బిత్తిరి సత్తి, ప్రియ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'తుపాకి రాముడు'. రసమయి ఫిలింస్ పతాకంపై టి.ప్రభాకర్ దర్శకత్వంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఈచిత్రాన్ని నిర్మించారు. ఈనెల 25న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక ఆద్యంతం వైభవంగా జరిగింది. తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, ఆరోగ్యశాఖా మంత్రి ఈటెల రాజేందర్ ముఖ్య అతిథులుగా పాల్గొని బిగ్ సీడీని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, 'రసమయి బాలకిషన్ ఓ సాహసమే చేశాడు. తెలంగాణ కళలు, సంప్రదాయం, బతుకమ్మ పండుగ గురించి ఉన్న ఓ సందేశాత్మకమైన చిత్రమిది. ట్రైలర్ చూడగానే నచ్చింది. రవి అలియాస్ బిత్తిరిసత్తి ఈ సినిమాతో తుపాకి రాముడుగా మారిపోతాడేమోననిపిస్తుంది' అని అన్నారు. 'మా రసమయి బాలకిషన్ మంచి సృజనాత్మకత ఉన్న మిత్రుడు. ఈ సినిమాను దిల్‌రాజు విడుదల చేస్తున్నందుకు థ్యాంక్స్. ఈ సినిమా పెద్ద సక్సెస్ అయ్యి అందరికీ మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను' అని మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు.
మరో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ,'కళలుపై ఉండే మక్కువతో రసమయిగారు ఈ సినిమా చేశారు. ఇదే యూనిట్‌తో మరో మంచి కథ తయారు చేసి సినిమా తీయాలి. దీని కోసం నేను ఎవరికైనా చెప్పి సినిమాను తీసే ఏర్పాటు చేస్తాను' అని తలసాని తెలిపారు.
ఎమ్మెల్యే, నిర్మాత రసమయి బాలకిషన్ మాట్లాడుతూ, 'నేను ఈ సినిమా తీసే క్రమంలో ఎమ్మెల్యేగా బిజీగా ఉంటావు కదా?, మరి సినిమా తీయగలవా అని ప్రశ్నించారు. మా నియోజకవర్గానికి చెందిన ప్రజలు ఎంతగానో సహకారం అందించారు. సినిమాను చేయడం కంటే దాన్ని రిలీజ్ చేయడం ఎంతో కష్టం అని దిల్‌రాజుని కలిశాకే తెలిసింది. ఈ సినిమాను ప్రజల గుండెల్లో నుండి వచ్చిన బ్రేకింగ్ స్టార్ బిత్తిరిసత్తిని హీరోగా పెట్టి చేశాను. ఈ సినిమా నాది కాదు. మనందరిది. దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను' అని అన్నారు. దిల్‌రాజు మాట్లాడుతూ, 'మంచి ప్రయత్నం చేశారు. ఈనెల 25న ఈ సినిమా విడుదలవుతుంది. ఈ సినిమా విడుదల కోసం రెండు నెలలుగా నన్నెంతగానో ఇబ్బంది పెట్టారు. ఈ రోజుల్లో అందరూ సినిమాని తీసేస్తున్నారు. కానీ ప్రేక్షకుల ద్వారా డబ్బులు వచ్చేలా సినిమా తీస్తేనే అందరికీ మంచింది. కానీ ఇది చాలా మందికి అర్థం కాలేదు' అని చెప్పారు.
'నన్ను నమ్మి ఇంత ఖర్చు పెట్టి సినిమా చేసిన రసమయికి థ్యాంక్స్. సీనియర్ హీరోలతో సినిమాలు చేసిన ప్రభాకర్‌గారు నాతో సినిమా చేశారు. మా సినిమా కోసం మేం సింగపూర్ పోలేదు. సింగరేణికి వెళ్లాం. సింగరేణిలో అద్భుతమైన కళాకారులున్నారు. ఎప్పుడు నవ్వించే సత్తి ఈ సినిమాతో ఏడిపిస్తాడు. సినిమాకి వచ్చే ప్రతి ప్రేక్షకుడు నవ్వుకుంటాడు అలాగే ఏడుస్తాడు కూడా' అని బిత్తిరిసత్తి అన్నారు.