Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'రజనీకాంత్ సర్ 'దర్బార్' మోషన్ పోస్టర్ని అభిమానులతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీపై ఎప్పటికీ ప్రేమ, గౌరవం అలానే ఉంటాయి. ఏఆర్ మురుగదాస్ సర్, చిత్ర బృందానికి శుభాకాంక్షలు' అని మహేష్‌బాబు అన్నారు. రజనీకాంత్, నయనతార కాంబినేషన్లో ఏ.ఆర్.మురుగదాస్ తెరకెక్కిస్తున్న చిత్రం 'దర్బార్'. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ చిత్ర మోషన్ పోస్టర్ని నాలుగు భాషల్లో గురువారం రిలీజ్ చేశారు. తెలుగు మోషన్ పోస్టర్ని మహేష్‌బాబు గురువారం ట్విట్టర్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, హిందీలో ఈ చిత్ర మోషన్ పోస్టర్ని ఏకకాలంలో విడుదల చేశారు. తమిళంలో కమల్ హాసన్, మలయాళంలో మోహన్‌లాల్, హిందీలో సల్మాన్ ఖాన్ పోస్టర్లని రిలీజ్ చేసి రజనీకి, చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. యాక్షన్ సీక్వెన్స్‌తో సాగే మోషన్ పోస్టర్ ఆద్యంతం ఆకట్టుకోవడంతోపాటు రజనీ ఫ్యాన్స్‌ని విపరీతంగా అలరిస్తుంది. ఇందులో ఆయన ఆదిత్య అరుణాచలం అనే పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. అన్ని రకాల కమర్షియల్ అంశాలు మేళవింపుగా రూపొందుతున్న ఈ చిత్రంలో నివేదా థామస్, సునీల్ శెట్టి, యోగిబాబు, సిమ్రన్, తంబి రామయ్య, శ్రీమన్, ప్రతీక్ బబ్బర్, జతిన్ సర్న, నవాబ్ షా, దలిప్ తాహిల్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తుండగా, అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా, టి.సంతానం ఆర్ట్ డైరెక్టర్‌గా, సంతోష్ శివన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు.