Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అరవిందస్వామి, అమలాపాల్ జంటగా సీనియర్ నటి మీనా కుమార్తె బేబీ నైనిక ముఖ్య పాత్రలో సిద్ధికీ దర్శకత్వంలో తమిళంలో రూపొంది ఘన విజయం సాధించిన చిత్రం 'భాస్కర్ ఓరు రాస్కెల్'. ఈ చిత్రాన్ని కార్తికేయ మూవీస్ పతాకంపై నిర్మాత పఠాన్ చాన్ బాషా తెలుగులో 'భాస్కర్ ఒక రాస్కెల్' పేరుతో అందిస్తున్నారు. ఈ చిత్రం టీజర్ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం జరిగింది. అతిథులుగా విచ్చేసిన దర్శకుడు వి.సముద్ర, నిర్మాత కె.ఎల్ దామోదరప్రసాద్ సంయుక్తంగా టీజర్‌ని విడుదల చేశారు.
ఈ సందర్బంగా వి.సముద్ర మాట్లాడుతూ, 'ఈ సినిమా మలయాళం, తమిళంలో సూపర్ హిట్ అయ్యింది. తమిళ చిత్రాన్ని తెలుగులో అనువాదం చేస్తున్నారు. ఇక్కడ కూడా సక్సెస్ సాధిస్తుందని నమ్ముతున్నా. ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసిన సిద్ధికీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం. యాక్షన్, సెంటిమెంట్ మేళవించిన చక్కటి కుటుంబ కథా చిత్రమిది' అని అన్నారు. 'ఇటీవల కంటెంట్ ఉన్న సినిమాలనే ఆడియెన్స్ ఆదరిస్తున్నారు. ఆ కోవలో కుటుంబ కథా నేపథ్యంలో తీసిన ఈ సినిమా తప్పకుండా తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందని నమ్ముతున్నా. కొత్తగా సినిమాలు నిర్మించే నిర్మాతల కోసం మా ప్రొడ్యూసర్ కౌన్సిల్ తరఫున క్లాసులు ఏర్పాటు చేశాం. కొంత మంది ఇది విని మేం సినిమాలు తీయమని వెళ్లిపోయారు. ఈ క్లాసుల వల్ల ప్రొడక్షన్‌పై అవగాహన వస్తుంది' అని నిర్మాత దామోదరప్రసాద్ తెలిపారు. చిత్ర నిర్మాత పఠాన్ చాన్ బాషా మాట్లాడుతూ, 'తోడు లేని ఇద్దరు వ్యక్తులు ఎలా కలిశారు. వాళ్ళు కలిసేందుకు ఇద్దరు పిల్లలు ఎలాంటి ప్రయత్నం చేసారన్న కథాంశంతో ఆద్యంతం ఆసక్తికరంగా, హాస్యప్రధానంగా ఈ చిత్రం రూపొందింది. ఊహించని ఓ ట్విస్ట్ ప్రేక్షకులను అలరిస్తుంది. అరవిందస్వామి, అమలాపాల్ తమ పాత్రలలో అద్భుతమైన నటన కనబరిచారు. ఈ నెలాఖరులో సినిమాని విడుదలకు ప్లాన్ చేస్తున్నాం' అని చెప్పారు.