Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నేను బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్‌కి పెద్ద అభిమానిని. ఆమెలాగా విభిన్న పాత్రలు పోషించి మంచి గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నా' అని అంటోంది ప్రీతి ఆస్రాని. సాయిరోనక్, ప్రీతి జంటగా సుజరు, సుశీల్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం 'ప్రెజర్ కుక్కర్'. ఈ నెల 21న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ ప్రీతి గురువారం మీడియాతో మాట్లాడుతూ, 'మా అక్కయ్య నటిగా రాణిస్తున్నారు. ఆమెని స్పూర్తిగా తీసుకుని ఇండిస్టీలోకి వచ్చాను. పలు లఘు చిత్రాలు, సీరియల్స్ చేశాను. 'మళ్ళీరావా'లో చిన్నప్పటి హీరోయిన్ పాత్ర పోషించా. దానికి మంచి గుర్తింపు లభించింది. ఈ క్రమంలో ఇందులో కథానాయికగా ఆఫర్ వచ్చింది. దర్శకులు సుజరు, సుశీల్ కథ చెప్పినప్పుడు నా పాత్ర బాగా నచ్చింది. నా పేరు అనిత. స్వతంత్ర భావాలు కలిగిన అమ్మాయిని. బీటెక్ చదువుకుంటూ, ఆర్టిస్టుగా, యాక్టివిస్ట్‌గా రాణిస్తుంటాను. మనసులో ఉన్న భావాలను నిర్మోహమాటంగా చెప్పడం నా నైజం. హీరో కిషోర్‌పై కెరీర్ పరంగా, ఫ్రెండ్స్ పరంగా, లవర్ పరంగా... ఇలా అనేక ప్రెజర్స్ ఉంటాయి. దీంతో తాను ప్రెజర్ కుక్కర్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతుంటాడు. మరి దాన్నుంచి ఎలా బయటపడ్డాడు?, కెరీర్, ప్రేమకి ఎలాంటి ముగింపు దొరికిందనేది సినిమా. ఆద్యంతం కామెడీ డ్రామాగా సాగుతుంది. ఫన్, ఎమోషన్స్ కూడా ఉంటాయి. న్యూ ఏజ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. యూత్‌తోపాటు ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ చిత్రమిది. చాలా సహజంగా ఉంటుంది. డైలాగులు కూడా మనం రెగ్యులర్‌గా మాట్లాడుకుంటున్నట్టుగానే ఉంటాయి.హీరోయిన్గా మొదటి సినిమాకే ప్రాధాన్యత కలిగిన పాత్ర లభించడం చాలా సంతోషంగా ఉంది. సినిమాలో నేను తెలంగాణ యాసలో మాట్లాడతాను. ఆ యాస కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. డబ్బింగ్ కూడా చెప్పా. దర్శకులు ఇద్దరైనా చాలా క్లారిటీగా సినిమాని తెరకెక్కించారు. నటిగా ఈ చిత్రం నాకు మంచి గుర్తింపు తెస్తుందని నమ్ముతున్నా. సమంత, మాధురీ దీక్షిత్ వంటి నటీమణులంటే ఇష్టం. వారిలా మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటున్నా' అని అన్నారు.