Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఆడపిల్ల పుడితే భారంగా భావించి అమ్ముకుంటున్న ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. అలా అమ్మకానికి గురై అభాగ్యురాలైన ఓ యువతి ఎలా బతికింది? ఆమె ఏం సాధించింది అనే కథాంశంతో 'స్వేచ్ఛ' చిత్రాన్ని రూపొందిస్తున్నాం' అని దర్శకుడు కె.పి.ఎస్. చౌహన్ అన్నారు. ప్రముఖ గాయని మంగ్లీ టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం 'స్వేచ్ఛ'. కె.పి.ఎస్.చౌహన్ దర్శకత్వంలో సరస్వతి డెవలపర్స్, లచ్చురాం ప్రొడక్షన్స్ పతాకాలపై ఆంగోత్ రాజునాయక్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం గురించి నిర్మాత ఆంగోల్ రాజునాయక్ చెబుతూ, 'తండా స్థాయి నుండి ప్రపంచ స్థాయి వరకు గాయనిగా ఎదిగిన మంగ్లీ ఈ చిత్రంలో అద్భుతమైన పాత్రను పోషించింది. ఆమె పాత్ర నేటి అమ్మాయిలకు ఎంతో ప్రేరణగా నిలుస్తుంది. సెంటిమెంట్, వినోదం మేళవింపుతో రూపొందిన ఈ చిత్రం అందర్ని అలరిస్తుందనే నమ్మకం ఉంది. పాపికొండలతోపాటు అందమైన లోకేషన్లలో చిత్రీకరణ చేశాం. అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 28న విడుదల చేయనున్నాం' అని అన్నారు. 'ఒక మంచి పాత్రలో నటించడంతోపాటు సంగీతం అందించడం ఆనందంగా ఉంద'ని సంగీత దర్శకుడు భోలో షావలి తెలిపారు. దర్శకుడు కె.పి.ఎస్.చౌహన్ మాట్లాడుతూ, 'పర్యావరణ పరిరక్షణకు చెట్లు ఎంత ముఖ్యమో, ఈ సృష్టికి ఆడపిల్ల అంతే ముఖ్యమని తెలిపే చిత్రమిది. ఆడపిల్లని పురిటిలోనే చంపకుండా వారిని చదివించి, ప్రయోజకులను చేస్తే ఏ రంగంలోనైనా తీసిపోరనే అద్భుతమైన సందేశాన్నిచ్చే చిత్రమవుతుంది. మంగ్లీ నటన ఈ చిత్రానికి హైలైట్ అవుతుంది. హాస్య నటుడు చమ్మక్ చంద్ర ఈ చిత్రంలో ఓ ముఖ్యపాత్రలో నటించారు. 'బంజారే బంజారే..' పాటను మంగ్లీ ఎంతో అద్భుతంగా ఆలపించింది' అని చెప్పారు.