Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆమని ప్రధాన పాత్రధారిణిగా శివ ఏటూరి దర్శకత్వంలో లక్ష్మీ సమర్పణలో లక్ష్మమ్మ ప్రొడక్షన్స్ పతాకంపై ఎత్తరి మారయ్య, ఎత్తరి చిన మారయ్య, ఎత్తరి గురవయ్యలు సంయుక్తంగా 'అమ్మదీవెన' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ని శనివారం జీవితా రాజశేఖర్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 'ఆమని మంచి నటి. రాజశేఖర్‌తో 'అమ్మకొడుకు' చిత్రంలో నటించినప్పట్నుంచి మంచి పరిచయం ఉంది. పెళ్లి తరువాత మంచి చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది. ఈ మధ్య కాలంలో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు తగ్గాయి. మళ్లీ కొత్త దర్శకులు సమంత, తాప్సి వంటి వారితో మంచి సినిమాలు తీశారు. స్త్రీ శక్తిని ఎవ్వరూ ఆపలేరు. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా' అని అన్నారు.
'ఒక మంచి సినిమాతో రీఎంట్రీగా ప్రేక్షకుల ముందుకు రావడం సంతోషంగా ఉంది. ఇందులో మరో మంచి పాత్ర పోషించా. నాకు ఎంతో ఇష్టమైన జీవిత రాజశేఖర్ మా సినిమాకు సపోర్ట్ చేయడం ఆనందంగా ఉంది. మగదిక్కు లేని కుటుంబంలో ఓ స్త్రీ ఐదుగురు పిల్లల్ని ఎలా చదివించింది?, వారికి మంచి భవిషత్తు ఎలా ఇచ్చిందనేది ఈ చిత్ర కథ. మంచి కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలి. అందుకు అందరి సపోర్ట్ కావాలి' అని ఆమని చెప్పారు. దర్శకుడు శివ ఏటూరి మాట్లాడుతూ, 'ట్రైలర్‌లాగే సినిమా కూడా అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చేలా ఉంటుంది. తల్లిదండ్రులుగా ఆమని, పోసాని చాలా బాగా చేశారు. వెంకట్ అజ్మీర సంగీతం, మనోహర్ కెమెరా వర్క్, శ్రీను డైలాగ్స్, జానకిరామ్ ఎడిటింగ్ ఇలా అందరూ తమ బెస్ట్ ఇచ్చారు. నిర్మాత మారయ్య ఒక మంచి సినిమా చేయాలనే సంకల్పంతో ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. త్వరలోనే విడుదల తేదిని ప్రకటిస్తాం' అని అన్నారు. 'ఆమని కెరీర్లో ఈ సినిమా ఒక మైలురాయిగా మిగులుతుంది. సినిమా చాలా బాగా వచ్చింది' అని నిర్మాత మారయ్య చెప్పారు.