Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో అగ్ర హీరోలకు దీటుగా రాణిస్తున్న దీపికా పదుకొనె తాజాగా ఓ యువ హీరో సరసన మెరవబోతోంది. ఇప్పటికే మస్తానీగా, రాణి పద్మావతిగా ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసిన దీపికా త్వరలో రాధగా కనిపించనుంది. ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో తెరకెక్కబోయే 'రాధాకృష్ణ' చిత్రంలో దీపికా 'రాధ'గా నటించేందుకు గ్రీన్ సిగల్ ఇచ్చినట్టు సమాచారం. కృష్ణగా యువ హీరో కార్తిక్ అర్యన్ నటించనుండటం విశేషం. ఈ విషయంపై హీరో కార్తిక్ అర్యన్ మాట్లాడుతూ, 'ఇందులో హీరోయిన్ ఎవరనే విషయాన్ని దర్శకుడు ఇంతియాజ్ చెబితేనే బాగుంటుంది. కానీ ఆయనతో మరోసారి కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. కచ్చితంగా ఇది మంచి చిత్రమవుతుంది' అని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ గురించి దర్శకుడు ఇంతియాజ్ అలీ చెబుతూ, 'రాధ, కృష్ణల ప్రేమ కథకి నేనెప్పుడూ ఆకర్షితుడనై ఉంటాను. భారతీయ జానపథ కథల్లో అదొక గొప్ప కథ. ఎపిక్ తరహాలో అది అద్భుతంగా, భారీగా ఉంటుంది.
రాధాకృష్ణల కథని ప్రపంచానికి చెప్పాలనేది నా డ్రీమ్' అని తెలిపారు. దీపికా నటించిన 'ఛపాక్' ఇటీవల విడుదలై విమర్శకుల ప్రశంసలందుకుంది. తాజాగా ఆమె '83'లో నటిస్తోంది. దీంతోపాటు రామాయణం ఆధారంగా రూపొందే 'రామాయణ్'లో సీతగా నటించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. మొత్తమ్మీద అటు రాధగా, ఇటు సీతగా దీపికా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోందని వేరే చెప్పక్కర్లేదు.