Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'వినోదంతోపాటు ఆర్గానిక్ వ్యవసాయం గురించి తెలిపే చిత్రమిది. వినోదానికి సందేశాన్ని జోడించిన చిత్రం కూడా. కచ్చితంగా ఓ మంచి సినిమా చూశామని ఆడియెన్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు' అని అంటోంది రష్మిక మందన్నా.
నితిన్, రష్మిక మందన్నా జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'భీష్మ'. ఈ నెల 21న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా రష్మిక మందన్నా ఆదివారం మీడియాతో ముచ్చటించింది. ఆ విశేషాల సమాహారం ఆమె మాటల్లోనే ..
క్లాస్ పీకడాలుండవ్..
ఇదొక వ్యక్తి జీవిత ప్రయాణాన్ని తెలియజేస్తుంది. అలాగే అంతర్లీనంగా ఆర్గానిక్ వ్యవసాయం గురించి చర్చిస్తుంది. రైతులు ఎన్ని కష్టాలు పడుతున్నారో మనకు తెలుసు. అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నవాళ్లనూ, పిల్లల స్కూళ్లు ఫీజు చెల్లించడానికి కూడా నానా కష్టాలు పడుతున్న వాళ్లనూ మనం చూస్తున్నాం. వాటిని ఈ కథలో డైరెక్టర్ చెప్పినప్పటికీ ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుంది. ఆర్గానిక్ వ్యవసాయం అనేది ఓ వ్యక్తి జీవిత ప్రయాణంలో ఉందనే విషయాన్ని దర్శకుడు వెంకీ స్క్రీన్‌ప్లేలో చెప్పిన విధానం ఆకట్టుకుంటుంది. ఇందులో ఎక్కడా లెక్చర్స్, క్లాస్ పీకడాలుండవు. అందరికి ఆమోదయోగ్యంగానే ఉంటాయి. యదార్థ సంఘటనలను ఇందులో మేళవించాం. డబ్బింగ్ చెప్పేటప్పుడు కచ్చితంగా ఇదొక క్యూట్ ఫిల్మ్ అవుతుందనిపించింది.
చైత్ర పాత్రకి మంచి పేరొస్తుంది..
ఇందులో నేను పోషించిన చైత్ర పాత్ర చాలా బాగుంటుంది. 'భీష్మ' అనే ఆర్గానిక్స్ కంపెనీలో పనిచేస్తుంటా. నా పాత్ర నుంచి అది లభిస్తుంది, ఇది లభిస్తుందని మాత్రం చెప్పలేను. కాకపోతే బాగా నవ్వించగలనని మాత్రం చెప్పగలను. సినిమా విడుదలయ్యాక రష్మిక బాగా నటిస్తుంది. బాగా డాన్సులు చేస్తుంది. బాగా పాడుతుందని అందరు అనుకుంటారు. పాత్రకి మంచి పేరొస్తుంది. అయితే నా సినిమాని నేను జడ్జ్ చేయలేను. ఈ సినిమాని పూర్తిగా చూడలేదు కానీ డబ్బింగ్ చెప్పేటప్పుడు మాత్రం నా పోర్షన్ చూశాను. సినిమా కోసం చాలా ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేస్తున్నా.
మా కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది
'అ ఆ'లో నితిన్, సమంతను చూసినప్పుడు చిత్ర రంగంలోకి వెళితే ఇలాంటి సినిమా చేయాలనుకునే దాన్ని. వాళ్లిద్దరూ అంత చక్కగా కనిపించారు. అలాంటిది ఇప్పుడు నితిన్‌తోనే కలిసి సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది. సినిమాలో మా కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. మొదటిరోజు సెట్స్‌కి వెళ్లినప్పుడు తను చాలా సినిమాలు చేశారు కదా, తనతో పనిచేయడం సౌకర్యంగా ఉంటుందా? లేదా అనుకున్నా. కానీ తను ఒక కాలేజ్ బారులా కనిపించారు. ఎప్పుడూ సరదాగా ఉంటారు. దీంతో సౌకర్యంగా ఫీలయ్యా. కాలేజ్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారో మేం అలా మారిపోయాం. అయితే మాటల మధ్యలో ఒకసారి తాను పవన్ కల్యాణ్ గారికి వీరాభిమానినని చెప్పారు. ఇప్పుడు తను హీరో అయినా కూడా ఇంకా ఆయన ఫ్యాన్‌గానే ఉండటం ముచ్చటగా అనిపించింది. మొత్తానికి నితిన్ ఒక ఫ్యాన్ బారు.
రెండు రోజుల ముందే తెలిసింది..
ప్రేమికుల రోజు ఫుల్ వర్క్ ఉంటుందని ఉదయాన్నే జిమ్‌కి వెళ్లొచ్చా. కానీ పనులు క్యాన్సిల్ అయ్యాయి. దీంతో ఈ ప్రేమికుల రోజు ఎప్పుడూ లేనంత బోరింగ్‌గా సాగింది. టీవీలో మంచి రొమాంటిక్ లవ్ స్టోరీ చూద్దామనుకున్నా. కానీ టీవీ ఆన్ చేసి ఓ సినిమా చూసిన పది నిమిషాలకు నీరసం వచ్చేసింది. అప్పుడే ఒకరు కథ చెప్పడానికి రావడంతో ఆ స్టోరీ వినే పనిలో మునిగిపోయా. సాయంత్రం స్నేహితురాలితో కలిసి సరదాగా బయటకు వెళ్లొచ్చా. నితిన్ లవ్ స్టోరీ గురించి ఆయన నిశ్చితార్థానికి రెండు రోజులు ముందే తెలిసింది. మా చిత్ర ట్యాగ్‌లైన్ 'సింగిల్ ఫరెవర్' అన్నట్టు నితిన్ ఎంగేజ్ అయిపోయారు. ఇక వెంకీ, నేను మాత్రమే మిగిలిపోయామనుకుని సరదాగా నవ్వుకునే వాళ్ళం.
ఆ సినిమాలో కొత్త రష్మికని చూస్తారు..
కెరీర్ పరంగా నాకు వచ్చిన స్క్రిప్ట్స్‌లో నచ్చినవి చేసుకుంటూ పోతున్నా. ఇందులో లక్ ఫ్యాక్టర్ ఎంత అనేది తెలియదు. నా ప్రయత్నాలు, నా కష్టం వల్లే ఈస్థాయికి వచ్చానని మాత్రం కచ్చితంగా చెప్పగలను. కష్టపడందే సక్సెస్ రాదు. అయితే ఇప్పుడు పాత్రల విషయంలో మరింత కొత్తదనం కోసం చూస్తున్నా. ప్రయోగాత్మక పాత్రలు చేయాలనుంది. అలాగే తర్వాత ఏమవుతుందనే ఉత్కంఠ కలిగించే సబ్జెక్టులు ఎంచుకుంటున్నా. 'భీష్మ' పూర్తి హాస్యభరితంగా సాగుతూ ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్విస్తుంది.
ప్రస్తుతం అల్లు అర్జున్ సినిమాలో నటిస్తున్నాను. అందులో పూర్తిగా ఓ కొత్త రష్మికని చూస్తారు.