Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నా ప్రతి సినిమా విషయంలో పవన్ ప్రస్తావన వస్తుందనేది నిజమే. అలాగని ఆయన్ని నేను వాడుకోవడం లేదు. ఆయనపై నాకున్న ప్రేమని తెలియజేస్తున్నా. ఈ చిత్రంలో ఆయన నటించిన 'ఖుషి'లోని క్లిప్ పెట్టాం' అని అంటున్నారు నితిన్. 'లై', 'ఛల్ మోహన్‌రంగా', 'శ్రీనివాసకళ్యాణం' వంటి వరుస పరాజయాల తర్వాత నితిన్ హీరోగా నటిస్తున్న చిత్రం 'భీష్మ'. వెంకీ కుడుముల దర్శకత్వంలో రష్మిక మందన్నా కథానాయికగా నటించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం నితిన్‌తో మీడియా జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు తెలుసుకుందాం.
ఈ సినిమా చేయడానికి కారణం?
నేను 'శ్రీనివాస కళ్యాణం' సినిమా చేస్తున్న టైమ్‌లో వెంకీ కుడుముల ఈ కథని చెప్పారు. అప్పుడు లైన్‌గా చెప్పారు. నాకు బాగా నచ్చింది. ఎలాగైనా చేయాలనిపించింది. కానీ నా సినిమాలు పరాజయం చెందడంతో ఈ సారి చేసే సినిమా పక్కా స్క్రిప్ట్‌తో వెళ్ళాలని నిర్ణయించుకున్నా. అదే విషయం దర్శకుడికి చెప్పా. బౌండెట్ స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాతనే సెట్స్‌పైకి వెళ్ళాం.
సినిమా కథ, కథనాల గురించి చెప్పండి ?
ఇది మంచి రొమాంటిక్ కామెడీ చిత్రం. ఫస్ ప్రధానంగా సాగుతుంది. అందులో భాగంగా అంతర్లీనంగా ఒక చిన్న లేయర్‌గా ఆర్గానిక్ వ్యవసాయం గురించి చెబుతుంది. ఆర్గానిక్ వ్యవసాయం గురించి ముందు నుంచి చెబితే ఆడియెన్స్ మిస్ గైడ్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే రివీల్ చేయలేదు. ఇందులో నా పాత్ర చాలా ఫన్‌గా ఉంటుంది. ఇందులో మీమ్స్ చేస్తుంటాను. గత చిత్రాలకు కాస్త భిన్నంగా నా పాత్ర ఉంటుంది. త్రివిక్రమ్‌గారు చెప్పినట్టు సెకండాఫ్‌లో ఓ ఫైట్ ఆకట్టుకుంటుంది. అది 'అతడు' సినిమాలోని ఫైట్‌ని తలపిస్తుంది. రష్మికతో పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. తను చాలా మంచి అమ్మాయి.
వరుసగా ప్రేమ కథలే చేయడానికి ప్రత్యేక రీజన్ ఏదైనా ఉందా?
'జయం' నుంచి ఇప్పటి వరకు లవ్ స్టోరీసే ఎక్కువగా చేశా. ఇప్పుడవి నాకే బోరింగ్‌గా అనిపిస్తుంది. ఇకపై మార్చాలని నిర్ణయించుకున్నా. ఇటీవల భిన్నమైన కాన్సెప్ట్ చిత్రాలు వస్తున్నాయి. నేను కూడా అలాంటి సినిమాలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం చంద్రశేఖర్ ఏలేటీగారితో చేసే సినిమా పూర్తి భిన్నంగా ఉంటుంది. అలాగే కృష్ణ చైతన్య చిత్రం కూడా కొత్తగా ఉంటుంది. 'భీష్మ' చిత్రం 'దిల్' తర్వాత అలాంటి వినోదం ఉన్న చిత్రమవుతుంది.
పరాజయాలను ఎనాలసిస్ చేసుకుంటారా?
ఫ్లాప్ అయితే కచ్చితంగా ఆ బాధ ఉంటుంది. అయినా మనకు ప్రతి స్క్రిప్ట్ నచ్చే చేస్తాం. ఫలితం మన చేతుల్లో ఉండదు. 'ఇష్క్' సినిమా టైమ్‌లో చాలా కేర్ తీసుకుని, జాగ్రత్తగా చేశాను. వరుసగా బ్యాక్ టూ బ్యాక్ రెండు హిట్లు వచ్చాయి. ఆ తర్వాత ఎక్కడో తప్పు జరుగుతూ వస్తుంది. తెలియకుండానే నాలో సాఫ్ట్‌నెస్ పెరిగింది. దీంతో దృష్టి పెట్టలేకపోయాను. కానీ 'లై' సినిమా బాగా ఆడుతుందనుకున్నా. అలాగే 'శ్రీనివాస కళ్యాణం' బాగా నచ్చి చేశా. అదే సందర్భంలో ఇలాంటి కథని చూస్తారా? అనే డౌట్ కూడా ఉండింది. ఫలితం చూశాక అదే నిజమైంది. ఇకపై మాత్రం చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
ప్రస్తుతం చేస్తున్న సినిమాల గురించి?
ప్రస్తుతం 'రంగ్‌దే', చంద్రశేఖర్ ఏలేటితో ఓ సినిమా, కృష్ణ చైతన్యతో 'పవర్ పేట', అలాగే బాలీవుడ్ చిత్రం 'అంథాధున్' రీమేక్ చేస్తున్నా. దీనికి మేర్లపాక గాంధీ దర్శకుడు. వెంకీ అట్లూరితో చేస్తున్న 'రంగ్‌దే' లవ్ స్టోరీ, ఎమోషన్స్ మేళవింపుతో కాస్త కొత్తగా ఉంటుంది. చంద్రశేఖర్ ఏలేటి సినిమా రెగ్యులర్‌కి పూర్తి భిన్నమైనది. అదొక ప్రయోగం లాంటి సినిమా అని చెప్పొచ్చు. దీనికి 'చెక్' అనే టైటిల్ అనుకుంటున్నాం. ఇక 'పవర్‌పేట' 1960 నుంచి 1990 వరకు జరిగే కథ. ఇందులో భిన్న కోణాల్లో నా పాత్ర ఉంటుంది. మంచి కథ వస్తే కచ్చితంగా మల్టీస్టారర్ చిత్రాలు చేసేందుకు సిద్ధంగానే ఉన్నాను. అలాగే వెబ్ సిరీస్ కూడా చేస్తా.
ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు చేయడం ఎలా అనిపిస్తుంది?
ఇందులో 'రంగ్ దే', చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో చేసే 'చెక్', కృష్ణ చైతన్యల 'పవర్ పేట' షూటింగ్ జరుగుతున్నాయి. మూడు సినిమాలు ఒకేసారి షూటింగ్ జరగడం పెద్ద టార్చర్. ఏ ఒక్క రోజున ఖాళీ ఉన్నా, మా సినిమా చేయి, మా సినిమా చేయి అని వెంటబడుతున్నారు. ఒకేసారి మూడు పాత్రలు చేయడం కాస్త కన్ఫ్యూజన్గానే ఉంది. ఇంకెప్పుడు మూడు సినిమాలు చేయను. ప్రస్తుతం చేస్తున్న మూడు సినిమాలు అయిపోయాక 'అంధాధున్' రీమేక్ స్టార్ట్ చేస్తాం. దీన్ని కథ పరంగా మన నెటివిటీకి తగ్గట్టుగా చాలా మార్చాం. కొన్ని క్లాసిక్ చిత్రాలను రీమేక్ చేయడం రిస్క్‌తో కూడినది. దీంతో 'అంథాధున్'ని ఓ సవాల్‌గా తీసుకుని చేస్తున్నాం.
మీ పెళ్ళి పనులు ఎంత వరకు వచ్చాయి?
ఏప్రిల్ 15న దుబారులో నిశ్చితార్థం. 16న పెళ్ళి జరుగుతుంది. 22న హైదరాబాద్‌లో విందు ఉంటుంది. డెస్టినేషన్ పెళ్ళి అనేది షాలిని(తను చేసుకోబోయే అమ్మాయి పేరు), వాళ్ళ తల్లిదండ్రులు నిర్ణయించారు. దుబారులో చేసుకోవాలనేది మా అందరి నిర్ణయం. పెళ్ళికి సంబంధించిన 'శ్రీనివాస కళ్యాణం' సినిమా చేశా. నా పెళ్ళికి అదొక రిహార్సల్లాగా అనిపించింది. అంతేకాదు ఇటీవల ఇంట్లో ఓ కార్యక్రమం జరిగింది. అది చేసేటప్పుడు పెళ్ళి అంటే ఇంత ఉంటుందా? అనిపించింది. దానికంటే మూడు సినిమాలు చేసుకోవడం బెటర్ అనిపించింది(నవ్వుతూ).
మీ ప్రేమ వ్యవహారం చాలా సీక్రెట్‌గా మెయింటేన్ చేశారు. అది ఎలా సాధ్యమైంది?
కావాలనే బయటకు రాకుండా జాగ్రత్త పడ్డాం. నిజానికి 2012లో ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా షాలిని పరిచయం అయ్యారు. ఆ తర్వాత తెలియకుండానే ప్రేమలో పడ్దాం. ప్రేమ విషయం మొదట నేనే చెప్పా. పక్కన ఓ మొక్కకి ఫ్లవర్ ఉంటే తెంచి ప్రేమని ఎక్స్‌ప్రెస్ చేశాను. తను ఓకే చెప్పింది. మూడు, నాలుగేండ్ల క్రితమే పెళ్ళి చేసుకోవాల్సింది. నేను మెంటల్‌గా ప్రిపేర్ కావడం వంటి పలు కారణాలతో డిలే అయ్యింది. ఇప్పుడు నేను పెళ్ళి చేసుకుంటున్నానంటే నా తోటి హీరోలో కొందరు హ్యాపీగా ఫీలవుతుంటే, మరికొందరు తిట్టుకుంటున్నారు(నవ్వుతూ).