Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రామ్‌చరణ్ పుట్టిన రోజు సందర్భంగా 'రౌద్రం రుధిరం రణం' చిత్ర బృందం శుక్రవారం 'భీమ్ ఫర్ రామరాజు' పేరుతో ఓ స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చింది. 'ఆడు కనబడితే నిప్పు కణం నిలబడినట్లు ఉంటది.. కలబడితే యేగు సుక్క ఎగబడినట్లు ఉంటది. ఎదురుబడితే సావుకైనా చెమట ధార కడతది. బాణమైనా, బంధూకైనా ఆనికి బాంచన్ ఐతది. ఇంటి పేరు అల్లూరి.. సాకింది గోదారి. నా అన్న మన్నెం దొర అల్లూరి సీతారామరాజు..' అంటూ ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్ పోషించిన పాత్రను పరిచయం చేస్తూ గంభీరమైన కంఠంతో ఎన్టీఆర్ చెప్పిన వాయిస్ ఓవర్ ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంది. యువ అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్ పాత్ర శైలి ఆద్యంతం అలరించింది. అంతేకాదు ఈ సినిమాపై అంచనాలను భారీ స్థాయికి తీసుకెళ్ళింది. అందరిలోనూ మరింత ఆసక్తి రేకెత్తించింది.
ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం 'రౌద్రం రుధిరం రణం'. ఉగాది పండుగ నేపథ్యాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం విడుదల చేసిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ సైతం అందరినీ విశేషంగా అలరించింది. దాదాపు 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈచిత్రాన్ని డి.వి.వి.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రామ్‌చరణ్ పుట్టిన రోజు కానుకగా ఎన్టీఆర్ ఓ సర్ప్రైజ్ ఇస్తానని గురువారం సోషల్ మీడియా వేదికగా తెలిపిన విషయం విదితమే. 'భీమ్ ఫర్ రామరాజు' పేరుతో సర్ప్రైజ్ విడుదలైన తర్వాత, 'నేను నీకు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నా రామ్‌చరణ్. హ్యాపీ బర్త్‌డే బ్రదర్. మన బంధం ఎప్పటికీ ఇలాగే ఉండాలి' అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. అలాగే రాజమౌళి సైతం, 'ఎవరైనా నా రామరాజు(రామ్‌చరణ్)ను వర్ణించాలంటే అందుకు సరైన వ్యక్తి నా భీమ్(తారక్). అతనికే సాధ్యం' అంటూ ట్వీట్ పెట్టారు. ఇదిలా ఉంటే, 'అదిరింది రాజమౌళి.. మీ అమ్ముల పొదిలో నుంచి వదిలిన రామబాణం ఈ సీతారామరాజు. అమోఘం.. దుమ్ములేపారు. మాలో ఉత్సాహాన్ని నింపారు. రామ్‌చరణ్‌కి జీవితాంతం గుర్తుండిపోయే బర్త్‌డే సర్ప్రైజ్ ఇచ్చారు తారక్' అంటూ చిరంజీవి ట్వీట్ ద్వారా ఆనందాన్ని వ్యక్తం చేశారు.
అలాగే రామ్‌చరణ్ పుట్టిన రోజుని పురస్కరించుకుని తెలుగు చిత్ర సీమకి చెందిన పలువురు ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.