Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఐదు దశాబ్దాలుగా దాదాపు 2 వేలకు పైగా పాటలకు నృత్య దర్శకత్వం వహించి 'మదర్ ఆఫ్ డాన్స్'గా అశేష ప్రేక్షకాదరణ పొందిన సరోజ్‌ఖాన్ జీవితం త్వరలోనే వెండితెరపై రాబోతోంది. ఈ బయోపిక్‌కి ప్రముఖ నృత్య దర్శకుడు, దర్శకుడు రెమో డిసౌజా దర్శకత్వం వహించనున్నారు. ఈనెల 3వ తేదీన సరోజ్‌ఖాన్ మరణించిన సంగతి తెలిసిందే. తన తల్లిపై రెమో డిసౌజా తెరకెక్కించబోయే బయోపిక్ గురించి సరోజ్‌ఖాన్ తనయ సుకైనా నాగ్‌పాల్ అధికారికంగా ప్రకటించారు. 'ప్రేక్షకుల మనసులపై తన నృత్యంతో చెరగని ముద్ర వేసిన మా అమ్మ జీవితం వెండితెరపై రావడం చాలా ఆనందంగా ఉంది. అమ్మ చనిపోయిన తర్వాత చాలా మంది దర్శక, నిర్మాతలు బయోపిక్ చేస్తామంటూ సంప్రదించారు. వాళ్ళలో రెమో డిసౌజా కూడా ఉన్నారు. ఈ బయోపిక్‌ని తీసేందుకు రెమోకే అనుమతి ఇవ్వడానికి ఓ కారణం ఉంది. అదేంటంటే ఓసారి మీ బయోపిక్‌ని తీస్తే ఎవరికి అవకాశం ఇస్తావు అని అమ్మని అడిగితే, రెమో పేరు చెప్పి. ఎందుకో కూడా వివరణ ఇచ్చింది. ఓ డాన్స్ మాస్టర్‌గా రెమో నా ప్రయాణాన్ని అర్థం చేసుకోగలడు. తను కూడా చాలా కింద స్థాయి నుంచి పెద్ద దర్శకుడిగా ఎదిగాడని చెప్పింది. అందుకే అమ్మ బయోపిక్‌ని తీసే బాధ్యతను రెమోకి అప్పగించాం' అని తెలిపింది. రెమో డిసౌజా కేవలం నృత్య దర్శకుడే కాదు నటుడు కూడా. పలు చిత్రాల్లో ఆయన నటించిన తీరుకు మంచి ప్రశంసలు లభించాయి. అలాగే దర్శకుడిగా నృత్య ప్రధాన చిత్రాలను తెరకెక్కించడంలో దిట్ట. ఆయన దర్శకత్వంలో నృత్య ప్రధానంగా రూపొందిన 'ఎబిసిడి', 'ఎబిసిడి2', 'స్ట్రీట్ డాన్సర్ 3డి' వంటి తదితర చిత్రాలు విశేష ప్రేక్షకాదరణ పొందడంతోపాటు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. అలాగే నిర్మాతగానూ పలు చిత్రాలను ఆయన నిర్మించారు. సరోజ్ ఖాన్ బయోపిక్‌కి రెమో తప్పకుండా న్యాయం చేస్తారని పలువురు సినీ ప్రముఖులు సైతం అభిప్రాయం వ్యక్తం చేశారు.