Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'హీరోగా రాణించాలనే లక్ష్యంతో చేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలేశాను. షార్ట్ ఫిల్మ్‌తో కెరీర్‌ను ఆరంభించి హీరోగా సిల్వర్ స్క్రీన్‌పై మెరవటానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను. అయితే తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు పొంది, మరిన్ని అవకాశాలను సొంతం చేసుకోవడం ఆనందంగా ఉంది. నా సినీ ప్రయాణానికి మంచి మార్గం ఏర్పడేలా తొలి చిత్రం 'రాజావారు రాణిగారు'ని ఆదరించిన ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను' అని అంటున్నారు యువకథానాయకుడు కిరణ్ అబ్బవరం. 'ఎస్.ఆర్.కళ్యాణమండపం' చిత్రంతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కిరణ్ అబ్బవరం పుట్టినరోజు నేడు (బుధవారం).
ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని ఆయన మీడియాతో మాట్లాడుతూ, 'బీటెక్ తరువాత బెంగుళూరులో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేసే వాడిని. సినిమాల్లో నటించాలనే ఆసక్తితో ఉన్నాను. అయితే హీరోగా రాణించాలనే ఆలోచన లేదు. నా సీనియర్ చేసిన 'గచ్చిబౌలి' షార్ట్ ఫిల్మ్‌లో నటించే ఛాన్స్ వచ్చింది. ఇందులో పోషించిన ఆటో డ్రైవర్ క్యారెక్టర్ అందరినీ బాగా అలరించింది. ఆ క్యారెక్టర్‌కి వచ్చిన రెస్పాన్స్ చూసిన తర్వాత నేను హీరోగా నటించొచ్చు అనే నమ్మకం కలిగింది. ఆ తర్వాత 3 సంవత్సరాల పాటు బెంగుళూరు నుండి హైదరాబాద్ వచ్చి కొన్ని షార్ట్ఫిల్మ్స్లో యాక్ట్ చేశాను. ఇందులో భాగంగా 'రాజావారు రాణిగారు' సినిమాలో హీరోగా నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమా మంచి ఆదరణ పొందడంతో హీరోగా గుర్తింపు లభించింది. తరువాత 'ఎస్.ఆర్.కల్యాణమండపం' సినిమాలో నటించే అవకాశం వచ్చింది. మొదటి సినిమాకి రెండో సినిమాకి కథాపరంగా, పాత్ర పరంగా చాలా తేడా ఉంది. ఇప్పటివరకు జరిపిన చిత్రీకరణతో 'ఎస్.ఆర్.కళ్యాణమండపం' 40 శాతం పూర్తయ్యింది. 1976లో కట్టిన ఓ కళ్యాణ మండపం చుట్టూ తిరిగే కథ ఇది. ఈ కళ్యాణ మంపడాన్ని ఎందుకు కట్టాల్సి వచ్చింది?, దీని వెనుక ఉన్న కారణం ఏంటి అనే దానితోపాటు ఆద్యంతం ఆసక్తికరంగా సాగే కథ, కథనం ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తుంది. 'దిల్', 'భద్రా' తరహాలో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా దీన్ని నూతన దర్శకుడు శ్రీధర్ తెరకెక్కిస్తున్నారు. ప్రియాంక జవాల్కర్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాలో సాయికుమార్, తనికెళ్ళభరణి వంటి సీనియర్ ఆర్టిస్టులు నటిస్తున్నారు. ఎలైట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిర్మాతలు ప్రమోద్, రాజు సంయుక్తంగా దీన్ని నిర్మిస్తున్నారు. దీనికి 'ఆర్.ఎక్స్ 100' సంగీత దర్శకుడు చేతన్ భరద్వాజ్ మ్యూజిక్ అందిస్తున్నారు.
ఈ సినిమా తర్వాత బాలాజీ అనే నూతన దర్శకుడితో 'సెబాస్టియన్' అనే సినిమాలో నటించబోతున్నాను. ఇందులో హీరోకి ఉన్న నైట్ బ్లైండ్నెస్ వల్ల ఏం జరిగిందనేది ఆద్యంతం వినోదాత్మకంగా చూపించబోతున్నాం. ఈ సినిమాకి జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. దీన్ని కూడా ఎలైట్ ఎంటర్టైన్మెంట్ బ్యానరే నిర్మిస్తోంది. కడప నుంచి వచ్చి ఎటువంటి సినిమా వాళ్ల బ్యాక్‌డ్రాప్ లేకుండా సినిమాల్లో రాణించాలనే నా తపనని నిర్మాతలు ప్రమోద్, రాజు బాగా అర్థం చేసుకున్నారు. వారు ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. ఇక నా పుట్టినరోజు సందర్భంగా డైరెక్టర్ పూరి జగన్నాధ్‌గారు 'ఎస్.ఆర్.కల్యాణమండపం' సినిమా పోస్టర్‌ను విడుదల చెయ్యడం, అలాగే 'సెబాస్టియన్' సిినిమాను డైరెక్టర్ హరీష్ శంకర్‌గారు అనౌన్స్ చేయడం సంతోషంగా ఉంది. ఈ చిత్రాలతో పాటు మరో రెండు పెద్ద సినిమాలను కూడా అంగీకరించాను. చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి సినిమాల చుట్టూ తిరుగుతున్నాడని దిగులు పడిన మా ఫ్యామిలీ ఇప్పుడు నేను హీరోగా తొలి బర్త్‌డే చేసుకోవడాన్ని గర్వంగా ఫీలవుతున్నారు' అని తెలిపారు.