Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏ దేశ భవిష్యత్తు అయిన ఆ దేశంలో పనిచేసే వారిపై ముఖ్యంగా యువతపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ దేశ యువతని అభివద్ధి వైపు మలచడం ఆయా దేశాల బాధ్యత.1999 సంవత్సరంలో ప్రపంచ యువజన వ్యవహారాల మంత్రుల సమావేశం ఆగస్టు 12ను అంతర్జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించాలని సిఫార్సు చేయడంతో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం ఆ సిఫార్సును ఆమోదించింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఒక థీమ్‌తో అంతర్జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం 2020 యువజన దినోత్సవాన్ని గ్లోబల్ యాక్షన్ కోసం ఎంగేజ్మెంట్ అనే థీమ్‌తో జరుపుకుంటున్నాం. యువత కోసం గ్లోబల్ యాక్షన్ ఎంగేజ్మెంట్ అన్నది స్థానిక, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉండాలన్నది థీమ్ ఉద్దేశం. ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యువతను (15-24ఏండ్ల వయస్సు గలవారు) చూస్తే మొత్తం 1.2బిలియన్ మంది ఉన్నారు. మొతం ప్రపంచ జనాభాలో 17శాతం వీరే ఉన్నారు. 2030 నాటికి ఈ సంఖ్య 1.3బిలియన్కు పెరుగుతుంది. ఈ సంఖ్య ప్రపంచంలో అంతట ఒకే విధంగా లేదు. వీరిలో 87శాతం యువత అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఉన్నారు. సబ్ సహారా, దక్షిణాసియాలో ఈ సంఖ్య పెరుగుతూ ఉంటే, మిగిలిన ప్రపంచ దేశాలలో ఈ సంఖ్య తగ్గుతుంది. వీరిలో ప్రపంచవ్యాప్తంగా 70.9మిలియన్ల యువకులు నిరుద్యోగులుగా ఉన్నారని ఒక అంచనా. 2008 ఆర్థిక మాంద్యంతో ప్రారంభమైన నిరుద్యోగ పర్వం, కొవిడ్-2019తో 2020 నాటికి తీవ్ర స్థాయికి చేరుకుంది. యూరోప్‌లో సుమారు 90మిలియన్ల యువత ఉన్నారు. అత్యధిక యువత ఐర్లాండ్, సైప్రస్, స్లోవేకియా, పోలాండ్‌లో ఉన్నారు. వీరిలో నిరుద్యోగ రేటు 15.71శాతం ఉంది. ఉత్తర అమెరికాలో 42మిలియన్ల యువత ఉన్నారు. ఈ సంఖ్య జనాభాలో 14శాతంగా ఉంది. ఇక్కడ నిరుద్యోగ రేటు 2019 ఆగస్టులో 8.6శాతం నుంచి ఈ కరోనా కాలంలో జూన్ 2020 నాటికి 20.7శాతానికి పెరిగింది. ఆసియా ప్రాంతంలో 718మిలియన్ల యువత ఉన్నారు. పాలస్తీనా, జార్జియా, బ్రునే, ఇరాన్, భారత్, శ్రీలంకలో నిరుద్యోగ రేటు చాలా ఎక్కువగా ఉంది. ఆఫ్రికాలో 226 మిలియన్ల యువకులు, అనగా ప్రపంచంలో 20శాతం యువకులు ఇక్కడే ఉన్నారు. 2030 నాటికి వారి శాతం 42కి పెరుగుతుంది. ఇక్కడ యువకుల్లో నిరుద్యోగిత రేటు 25శాతంగా ఉంది. సౌత్ అమెరికాలో 154 మిలియన్ల యువత ఉంది. ఈ సంఖ్య బ్రెజిల్, మెక్సికో, అర్జెంటీనాలో అత్యధికంగా ఉన్నారు. ఇక్కడ నిరుద్యోగం రేటు18శాతం కన్న ఎక్కువే.
కరోనా వైరస్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా 25మిలియన్ల యువత ఉద్యోగాలు కోల్పోవచ్చనీ, దీనివల్ల 860 బిలియన్స్ నుంచి 3.4 ట్రిలియన్స్ డాలర్ల ఆదాయం నష్టపోనున్నట్లు, కోవిడ్-19 వల్ల ప్రపంచ వ్యాప్తంగా 35 మిలియన్ల ప్రజలు పేదరికంలోనికి నెట్టి వేయబడుతున్నట్టు అంతర్జాతీయ కార్మిక సంస్థ పేర్కొంది.
ప్రపంచ యువతలో ఐదో వంతు సుమారు 20శాతం యువత భారతదేశంలో ఉంది.130 కోట్ల జనాభాలో దాదాపు సగం మంది 25ఏండ్ల లోపు వారే. ప్రతి సంవత్సరం దేశంలో 3.5లక్షల ఇంజనీరింగ్ పట్టభద్రులు, 25లక్షల గ్రాడ్యుయేట్ పట్టభద్రులు బయటికి వస్తున్నారు. ఆర్థిక అసమానతలు, లింగవివక్షత, సాంకేతిక అడ్డంకులు, లోపభూయిష్టమైన విద్యావిధానం వల్ల ప్రతి సంవత్సరం నిరుద్యోగ రేటు పెరుగుతూనే ఉంది. ఈ సంఖ్య 2017లో 22.7శాతం ఉండగా, 2018లో 22.85 శాతానికి 2019లో 23.34శాతానికి పెరిగింది. ఈ కరోనా కాలంలో నిరుద్యోగ రేటు ఇంకా పెరిగి ఉండొచ్చు. కోవిడ్-19 వల్ల సుమారు 27 మిలియన్ యువత ఉద్యోగాలు కోల్పోతారని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ తెలిపింది. దీనివల్ల భారత్‌కు ఉన్న జనాభా డివిడెండ్ వల్ల ఎటువంటి లాభం లేకుండా పోతుంది. నిరుద్యోగులు పెరగటం వల్ల ఆర్థిక, సామాజిక సమస్యలు ఏర్పడతాయి. సామాజిక అశాంతి పెరిగి, నేరాల రేటు, మాదక ద్రవ్యాల వినియోగం కూడా పెరిగి మానసిక రుగ్మతలకు దారి తీయవచ్చు. ప్రపంచ యువతలో నిరుద్యోగం పెరగటానికి ప్రధానంగా కారణం మన ప్రభుత్వాల విధానాల లోపమే. వ్యవస్థాపకతను ప్రోత్సహించడం, ఇంటర్నల్ షిప్లో నాణ్యతను పెంచడం, కళాశాలలతో పారిశ్రామిక యాజమాన్యా లకు చురుకైన భాగస్వామ్యాన్ని కలిగించడం, కెరీర్ గైడెన్స్ అందించడం, పని అనుభవానికి అవకాశం ఇవ్వడం, అప్రెంటిష్ని ఆధునీకరించడం, వెనుకబడిన యువతకు సరైనటువంటి అవకాశాలు కల్పించడం మొదలైన చర్యల వల్ల నిరుద్యోగ రేటును తగించవచ్చు. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల సంపద యువత. అట్టి యువతకు సమాజానికి పనికివచ్చే విద్యను అందిస్తూ వారి శక్తిని దేశాభివద్ధికి ఉపయోగిస్తేనే, వర్థమాన దేశాలన్ని రాబోయే కాలాల్లో అభివృద్ధిలో ముందు వరుసలో ఉంటాయి.
సెల్:9494019270
జుర్రు నారాయణ