Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇటీవల న్యూస్ పేపర్లలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పేరును నోబెల్ శాంతి పురస్కారానికి నార్వే పార్లమెంటు సభ్యుడు క్రిస్టియన్ టైబ్రింగ్ ప్రతిపాదించి నట్లు చదివిన వెంటనే ఒక్కసారిగా ఆశ్చర్యం వేసింది. 2017లో తన మొదటి బడ్జెట్ ప్రసంగంలో రక్షణ శాఖకు 10శాతం నిధుల పెంపుతో(54 బిలియన్ డాలర్లు) పాటు అదనంగా 30 బిలియన్ డాలర్లు కావాలని అమెరికన్ కాంగ్రెస్‌ను అభ్యర్థించడంతో తాను సైన్యంపైనే ఆధారపడి పాలించనునట్టు ట్రంప్ చెప్పకనే చెప్పాడు. బారక్ ఒబామా కాలంలో అమెరికా చేసుకున్న 12 దేశాల ఆసియా కేంద్రీకత వాణిజ్య ఒప్పందం ట్రాన్స్-ఫసిపిక్ నుంచి ఈయన కాలంలో అమెరికా వైదొలగింది. 2017లో ఆరు ముస్లిం మెజారిటీ దేశాల పౌరులను 90రోజులు అమెరికాకు రాకుండా నిషేధించాడు. ఒబామా చర్చలవల్ల కుదిరిన 195దేశాల అంతర్జాతీయ మైలురాయి వంటి ఫ్యారిస్ వాతావరణ ఒప్పందం నుంచి వైదొలుగుతానని 2017లో ప్రకటించాడు.
ఇరాన్ న్యూక్లియర్ డీల్ అని పిలువబడే జాయింట్ కాంప్రహెన్సి ప్లాన్ ఆఫ్ యాక్షన్ 2015 నుంచి అమెరికా ఏకపక్షంగా ఉపసంహరించు కోవాలని 2018లో ట్రంప్ తీసుకున్న నిర్ణయం మధ్య ప్రాచ్యం అంతటా గందరగోళాన్ని సష్టించింది. జనరల్ ఖాసేమ్ సోలైమానిని హత్య చేయడం ద్వారా ఇరాన్లో ఉద్రిక్తతలు పెరిగాయి. యూఎస్, మెక్సికో సరిహద్దు గోడ నిర్మాణ నిధుల కోసం ట్రంప్ చేసిన డిమాండ్ ఫలితంగా నెలరోజులపాటు ప్రభుత్వం స్తంభించిపోయింది. దీనితో జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించాడు. ఆ సందర్భంగానే నిధుల కోసం వీటో అధికారాన్ని ఉపయోగించాడు. తన రాజకీయ ప్రత్యర్థి జో బిడెన్‌పై దర్యాప్తు ప్రారంభించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడిపై ఒత్తిడి చేసి అతను ఒప్పుకోకపోయేసరికి రష్యన్ అనుకూల వేర్పాటువాదులపై కొనసాగిస్తున్న యుద్ధం కోసం కాంగ్రెస్ ఆమోదం పొందిన 400 బిలియన్ డాలర్ల సహయాన్ని నిలిపివేయాలని ఆదేశించాడు. దీనిపై ప్రతినిధులసభ 2019 సెప్టెంబర్‌లో నేరవిచారణ చేసింది. డిసెంబర్లో ట్రంప్ అభిశంశనను కూడా ఎదుర్కొన్నాడు.
శాంతి ఒప్పందంలోని నిబంధనలను తాలిబాన్లు అంగీకరిస్తే 14నెలల్లో ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా దళాలను ఉపసంహరించుకుంటామని, బదులుగా అమెరికా, మిత్రదేశాలపై ఉగ్రవాదులు ఆఫ్ఘన్ గడ్డ నుంచి దాడులు జరపకుండా చూడాలని ప్రజలచేత ఎన్నికైన ఆఫ్ఘన్ ప్రభుత్వాన్ని కాదని ఉగ్రవాద తాలిబాన్స్తో ఒప్పందం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.
2019 మే నెలలో రెండు వందల బిలియన్ డాలర్ల విలువైన చైనా వస్తువులపై సుంకాలు పెంచారు. దీనితో చైనా కూడా సుంకాలను పెంచింది. ఈ సంఘటన రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధానికి దారితీసింది. చైనాలోని అన్ని అమెరికా ప్రయివేట్ కంపినీలను చైనాను వదలి బయటకు రావాలని ఆదేశించాడు. కుర్దిష్ నియంత్రణలో ఉన్న ప్రాంతం నుంచి అమెరికా దళాలను ఉపసంహరించుకోవడంతో టర్కీ సిరియాపై దాడి చేసింది. కోవిడ్-19 ఘోరంగా వ్యాప్తి చెంది 63లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఒక లక్షా 90వేల మంది చనిపోయారు. 1945 నుంచి యుద్ధంలో మరణించిన అమెరికా సైనికులకంటే ఈ సంఖ్య ఎక్కువ. వైరస్ పట్ల ట్రంప్ యొక్క అనాలోచిత విధానం, విజ్ఞాన శాస్త్రాన్ని తిరస్కరించే ధోరణి ప్రపంచాన్ని ఆశ్చర్యపరచింది. 2020లో డబ్ల్యూహెచ్ఓకు నిధులు నిలిపివేసి, డబ్ల్యూహెచ్ఓ నుంచి అమెరికా బయటకు వెళ్తున్నట్టు ట్రంప్ ప్రకటించాడు.
ట్రంప్ కాలంలో జార్జి ఫ్లాయిడ్ మరణం(మే 25న) ఆయన జాత్యహంకారానికి ప్రతీక. దీనికి వ్యతిరేకంగా నిరసనలు ఊపందుకోవడంతో ట్రంప్ అధ్యక్ష భవనం కింద బంకర్లలోకి వెళ్లిపోవలసి వచ్చింది. జూన్ 1న ట్రంప్ 1870 నాటి తిరుగుబాటు వ్యతిరేక చట్టం ద్వారా మిలటరీని మోహరిస్తాం అని బెదిరించడంతో నిరసనలు ప్రపంచ వ్యాప్తం అయ్యాయి. ''2018 వెరైటీ ఆఫ్ యాన్యువల్ డెమొక్రటిక్ రిపోర్ట్'' ట్రంప్ పరిపాలన ప్రారంభించినప్పటి నుండి ప్రజాస్వామ్యానికి ఎదురు దెబ్బలు తగులుతున్నాయని పేర్కొంది.
2020 జనవరిలో ఫ్యూరీ సెర్చ్ సెంటర్ 32 దేశాల సర్వే ఫలితాలు విడుదల చేసింది. దీని ప్రకారం 64శాతం మంది ప్రపంచ వ్యవహారాల్లో ట్రంప్ సరైన నాయకత్వం చేయగలడనే నమ్మకంలేదని చెప్పారు. అతనిపై 29శాతం మంది మాత్రమే విశ్వాసం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ నియంత్రణలో ట్రంప్ వైఖరి ప్రపంచ నాయకత్వంలో శూన్యాన్ని సష్టించింది. అక్రమ సరిహద్దు క్రాసింగ్‌లపై ట్రంప్ పాలన యొక్క జీరోటాలరెన్స్ విధానం కనీసం 5,500 కుటుంబాలనుంచి వారి పిల్లలను వేరు చేయడానికి దారితీసింది. ఈ విషయం మానవ హక్కుల ఉల్లంఘనగా, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంగించి నట్టుగా ఐక్యరాజ్య సమితి ఆరోపించింది. ట్రంప్ కాలంలో అమెరికా నాటోకి మధ్య విభేదాలు, అమెరికా యూరోపియన్ యూనియన్‌కు మధ్య విభేదాలు, అమెరికా రష్యాకు మధ్య విభేదాలు, అమెరికా చైనాకు మధ్య విభేదాలు, అమెరికా ఇరాన్‌కు మధ్య విభేదాలు బహిరంగ రహస్యాలే..! చివరికి మిత్రదేశమైన భారత దేశాన్ని కూడా హైడ్రాక్సీక్లోరోఫిన్ ఇవ్వకపోతే ప్రతీకారం తీర్చుకుంటానని బెదిరించాడు. ఇటువంటి వివాదాస్పద వ్యక్తికీ, యుద్ధ పిపాసికీ, జాత్యాహంకారికీ నోబెల్ శాంతి బహుబతి ఇచ్చి ప్రపంచ శాంతి దూతగా సత్కరించడమా..!?
- జుర్రు నారాయణ
సెల్:9494019270