Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాకు ఏదయినా తెలిసివుందంటే అది ప్రజల గురించే మీలాగా నేను కూడా ప్రజల మనిషినే. వెనిజులా రాజధాని కారకాస్‌లో ఒక పేదరిక ప్రాంతంలో పుట్టిపెరిగాను. అసమానత, సామాజిక బహిష్కరణల నేపథ్యంలో వెనిజులా అనేక ఉద్యమాలకు కేంద్రమైన పరిస్థితుల్లో సతమతమైన నేపథ్యం నాది. నేను వ్యాపారవేత్తను కాను. మనసా వాచాతో కల్మషంలేని హదయంతో పనిచేస్తూ, వెనిజులాకు నాయకత్వం వహిస్తూ, సమ్మిళిత అభివృద్ధి, సామాజిక సమానత్వం కోసం గతంలో బాటలు వేసిన అధ్యక్షుడు హ్యూగో చావెజ్ తరహాలోనే అంకితమయ్యాను. బొలివరీనియన్ల వారసత్వాన్ని 1998 నుంచీ పుణికి పుచ్చుకుని ఉన్నాను.
ఇప్పుడు చారిత్రక సమయంలో ఉన్నాం. మనం యుద్ధం - శాంతి అనే అంశాల మీద దేశ భవిష్యత్తు ఉంది. వాషింగ్టన్లో కొంతమంది అప్పుడు వియత్నాంలో చేసిన మాదిరిగానే చేయాలని కొందరు అనుకుంటున్నారు. వాళ్ళు వెనిజులాలో జోక్యం చేసుకుని దాడి చేసి దానికి ప్రజాస్వామ్య పరిరక్షణ, స్వేచ్ఛ పేరుతో అది చేయాలనుకుంటున్నారు. ఇరాక్‌లో సామూహిక హననానికి ఎన్నుకున్న కారణాలనే వెనిజులా కూడా తప్పుడుగా సృష్టిస్తున్నారు. ఇది ఒక కపట నాటకం. దీనికి దక్షిణ-ఉత్తర అమెరికా ఖండాలు బలికావద్దు.
1999 నుంచి వెనిజులా ప్రజల ఉద్యమాల ద్వారా సాధించుకున్న భాగస్వామ్య, విప్లవం ద్వారా ఏర్పడిన రాజ్యాంగం అమల్లో ఉంది. గత 20ఏండ్లలో ఎన్నికల ద్వారా ఏర్పడ్డ వ్యవస్థ ఉంది. మా వైఖరి, సిద్ధాంతాలు ఇతరులకు నచ్చక పోయి ఉండొచ్చు. కానీ మిలియన్ల మంది ప్రజలు సమర్థిస్తున్నారు.
నేను అమెరికా సంయుక్త రాష్ట్రాల ప్రజలకు ఏమి చెప్పదలచుకున్నానంటే వైట్‌హౌస్‌లోని కొన్ని వర్గాలు ఎన్నుకున్న ప్రమాదకర ధోరణులు, తీవ్ర ఆలోచనలు మన అమెరికా ఖండాలకే ప్రమాదం. ఉరుగ్వే, మెక్సికో దేశాలు చొరవ తీసుకుని వెనిజులా అంశంపై శాంతి చర్చలు జరపాలనే నిర్ణయానికి వస్తే ఆ చొరవకు గండికొట్టే విధంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రవర్తిస్తున్నారు. కూర్చుని చర్చించుకుని పరిష్కరించుకోవడం వెనిజులా శాంతి పాతానికే బాటలు వేస్తాయని, అవి మంచికే అని భావిస్తున్నాం. సత్యం బయటపడుతుందని చర్చలంటే భయపడే వారికి, ఈ సందర్భంగా జాన్ ఎఫ్ కెన్నడీ అన్న మాటలు ''భయం నుంచి విముక్తి కోసం మనం ఎప్పుడూ చర్చలు చేయొద్దు - కానీ చర్చలు చేయడానికి మాత్రం భయం వద్దు.'' వీరికి సరిపోతాయి.
బోలివరీయన్ల వెనిజులాలో రాజకీయ అసహనం, ఆకలికేకలు అని వస్తున్న వార్తల వెనుక ఇక్కడి గనుల సంపద, చమురు వనరుల్ని దోచుకోడానికి అమెరికా దాని మిత్రదేశాలు పన్నుతున్న కుట్రలే అవి. సంక్షోభం, మిలిటరీ దుర్మార్గమని చేసే దుష్ప్రచారం దీనివెనుక ఉంది.
ఆర్థిక ఆంక్షల పేర చేసిన కుట్రలు వెనిజులాలో ప్రజలు ఇబ్బందులకు గురికావడానికి ప్రధాన కారణం. కొంతమంది నేరపూరిత చర్యల కారణంగా తీవ్ర సంక్షోభానికి గురైనా కూడా వెనిజులా ప్రభుత్వం చేపట్టిన సామాజిక సంక్షేమ పథకాల ద్వారా ప్రజలు లబ్ది పొందుతున్నారు. అవి అలాగే కొనసాగుతాయి. అందుకే అమెరికా ఖండాల మానవాభివృద్ధి సూచీలో ఉన్నతంగా, అతి తక్కువ అసమానత ఉన్న దేశంగా వెనిజులా రికార్డ్ సృష్టించింది.
అమెరికా దేశ ప్రజలు ఈ అంశాలను గుర్తెరగాలి. అమెరికా ఏ విధంగా బహుళ కుట్రల ద్వారా వెనిజులా మీదకు దాడి చేయాలనీ చూడటం ఐరాస నియమావళికి విరుద్ధం. వేరే దేశం మీద దాడి చేస్తామని భయపెట్టడం, బలాన్ని ఉపయోగించడం లాంటివి ఆ నియమావళికి విరుద్ధం. ఇతర దేశాల శాంతి సంబంధాలకు గౌరవం ఇవ్వాలి.
చరిత్రలో గతంలో చేసిన విధంగానే వెనిజులా అమెరికాతో అన్ని రకాల సంబధాలనూ కొనసాగిస్తుంది కానీ వాషింగ్టన్లో ఉన్న కొందరు మాపైన యుద్ధానికి సిద్ధమవుతున్నారు. అమెరికా సైన్యంలో పనిచేసే మీ బిడ్డలను అర్థం లేని యుద్ధానికి సిద్ధం చేసి బలిచేయడం కంటే సాటి దేశమైన వెనిజులా ప్రజల సార్వభౌమాధికారాన్ని కాపాడేలా ఉంటే బాగుంటుంది.
అమెరికా ప్రజల లాగానే వెనిజులనీయులమైన మేము కూడా దేశభక్తులమే. మన కోసం మనం పోరాడాలి. కానీ మన మీద మనం పోరాడొద్దు. నేడు వెనిజులా సమైక్యంగా కోరుకునేది ఒక్కటే.. మమ్ముల్ని సామాజిక, ఆర్థిక సంక్షోభాలకు గురి చేసి, ఇక్కడి ద్రవ్య వనరులని ఉక్కిరిబిక్కిరి చేసి, ప్రజలకు ఉచ్చు వేసే విధంగా చేసి, పైగా సైన్యం పేరుతో దాడి చేస్తే అది అతి ప్రమాదకర పరిస్థితులకు దారి తీస్తుంది. అమెరికా సమాజంలోని బుద్ధి జీవులకు మా విజ్ఞప్తి ఏమిటంటే, మీరు కూడా మాకులానే ఇంతకుముందు బాధితులే. మీరు శాంతి కోసం మాతో చేతులు కలపండి. అమెరికా ఖండాల ప్రజలు ఎప్పుడూ చిరంజీవులుగా ఉండాలని కోరుకుంటూ....
(యూఎస్ ఫుడ్ సావర్నిటీ అలయన్స్ ద్వారా హైదరాబాద్ లోని ప్రొగ్రెసివ్ పర్స్పెక్టివ్ పౌర సమాజ సంస్థకు అందిన లేఖ)
-నికోలస్ మదురో, అధ్యక్షుడు, వెనిజులా
అనువాదం: డా. శ్రీరామ్ కన్నెకంటి
సెల్: 9701066993