Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వెనిజులాలో నికొలస్ మదురోను అంగీకరించం, ఈ విషయంలో వెనక్కు పోయేదీ లేదు, ప్రజాస్వామ్యం మినహా సోషలిజాన్ని మనం అంగీకరించేదీలేదు, మిలిటరీ జోక్యం సహా అన్ని అవకాశాలనూ పరిశీలిస్తున్నాం, మదురో క్యూబా తొత్తు అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిప్పులు చెరుగుతూ పిడుగులు కురిపించాడని ఒక పత్రిక సోమవారంనాటి ఆయన ప్రసంగాన్ని వర్ణించింది. అమెరికాలోని ఫ్లోరిడాలో స్ధిరపడిన వెనిజులా సంతతి, వలస పౌరులనుద్దేశించి ట్రంప్ మాట్లాడారు. మదురోను వదలివేసి పార్లమెంట్ నేత జువాన్ గువైడోకు మద్దతివ్వాలని పౌరులు, మిలిటరీని కోరాడు. అక్కడ సోషలిస్టు ప్రభుత్వం వున్న కారణంగానే పదిలక్షల శాతం ద్రవ్యోల్బణం, ఆకలి తాండవిస్తున్నదని, ప్రపంచంలో అత్యధిక చమురు నిల్వలున్న దేశం దారిద్య్రంలో చిక్కుకున్నదని, కొలంబియా ద్వారా పంపదలచిన ఆహార సాయాన్ని మిలిటరీ అడ్డుకుంటున్నదని ఆరోపించారు. ఫ్లోరిడాలోని మియామీ అంతర్జాతీయ విశ్వవిద్యాలయంలో భార్య, కుమార్తె సహా పాల్గొన్న సభలో మదురో ప్రభుత్వంపై బెదిరింపులు, సోషలిస్టు వ్యతిరేక చిందులు వేస్తూ ట్రంప్ ఊగిపోయాడు. సోషలిజానికి వ్యతిరేకత ప్రకటించిన ప్రతి ఒక్కరికీ తాము ఘనస్వాగతం పలుకుతామన్నాడు. ఇందులో అమెరికా యువతలో పెరుగుతున్న సోషలిస్టు భావాల వ్యాప్తిని అరికట్టేందుకు వెనిజులాను బలిచేయాలన్న కుట్ర కోణాన్ని తోసిపుచ్చలేం.
జనవరి 23న గువైడో వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకున్నప్పటి నుంచి చట్టబద్దంగా ఎన్నికైన అధ్యక్షుడు నికోలస్ మదురోను అధ్యక్షుడిగా గుర్తించేందుకు నిరాకరించటమే గాక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు అమెరికా చేయని ప్రయత్నం లేదు. సాయం ముసుగులో మదురో వ్యతిరేకులకు ఆయుధాలను చేరవేస్తున్న వాహనాలను కొలంబియా సరిహద్దులో వెనిజులా మిలిటరీ పట్టుకున్న విషయం తెలిసినదే. రోనాల్డ్ రీగన్ 37ఏండ్ల క్రితం మార్క్సిజం, లెనినిజం చరిత్ర బూడిదకుప్పలో కలసినట్టు నోరుపారవేసుకున్నాడు. ఇప్పుడు ట్రంప్ ఫిబ్రవరి 5న అనూహ్యంగా అమెరికన్ పార్లమెంట్ ఉభయసభలనుద్దేశించి చేసిన ప్రసంగంలో వెనెజులా పరిణామాలను ప్రస్తావించి సోషలిజంపై దండెత్తి అమెరికాలో అనుమతించేది లేదన్నాడు. పదమూడు రోజుల తరువాత మరోసారి మియామీలో అదేపని చేశాడు. గత నెలరోజుల్లో అమెరికా-వెనిజులా పరిణామాలను చూసినట్టయితే ట్రంప్ స్వయంగా చెప్పినట్టు మిలిటరీ జోక్యానికి ఆఖరి అస్త్రంగా తగిన అవకాశం, సాకుకోసం అమెరికా చూస్తున్నది.
ఐక్యరాజ్యసమితిలోని భద్రతా మండలిని వినియోగించుకొని అమెరికన్లు గనుక వెనిజులాపై సైనిక చర్యకు ఉపక్రమిస్తే శాశ్వత సభ్యరాజ్యాలైన చైనా, రష్యా వీటో ఆయుధాన్ని ప్రయోగిస్తాయి. మదురో ప్రభుత్వాన్ని అమెరికాతో అంటకాగి కొన్ని మినహా ఆ రెండు దేశాలతో పాటు మన దేశంతో సహా అన్నీ గుర్తించాయి. ప్రపంచ రాజకీయాలు, ఆర్థిక పరిణామాలు ఇందుకు దోహదం చేస్తున్నాయి. రష్యన్ క్షిపణులు, ఎయిర్ క్రాఫ్ట్, ఇతర ఆయుధాలను కొనుగోలు చేసి దానికి బదులుగా చౌకధరకు వెనెజులా చమురు సరఫరా చేస్తోంది. అమెరికా బెదిరింపులను సహించేది లేదంటూ రష్యాతో కలసి సైనిక విన్యాసాలు చేస్తోంది. అవసరమైతే తమ జెట్ బాంబర్లు, యుద్ధనావలు బాసటగా నిలుస్తాయంటూ ఇటీవలి కాలంలో తరచుగా వెనిజులా తీరాలు, విమానాశ్రయాలకు రష్యా నౌకలు, జెట్లు వచ్చి ఆగివెళుతున్నాయి. గత పదేండ్లలో చైనా 70బిలియన్ డాలర్ల మేరకు వివిధ వెనిజులాలో పెట్టుబడులు పెట్టింది. లాటిన్ అమెరికాలో ప్రధాన రాజకీయ మద్దతుదారుగా క్యూబా ఉంది. అమెరికా కుట్రలను ఎదుర్కోవటంలో, చిత్తు చేయటంలో ఎంతో అనుభవం గడించిన క్యూబన్లు భద్రతా, మిలిటరీ సలహాదారులను సరఫరా చేయటమే గాక తమకు అందిన సమాచారాన్ని మదురో సర్కార్‌కు అందిస్తోంది. తన వద్ద వున్న వైద్యులు, నర్సులు, ఇంజనీర్లవంటి నిపుణులను పదిహేను వేల మందిని పంపింది. దీనికి ప్రతిగా చౌకధరలకు వెనిజులా చమురు సరఫరా చేస్తోంది.
చమురు విక్రయాలను అడ్డుకొంటూ అనేక సమస్యలను సృష్టిస్తున్న అమెరికా చర్యల కారణంగా వెనిజులాలో అనేక వస్తువులకు కొరత ఏర్పడింది. దీన్ని సాకుగా చూపి సోషలిస్టు మదురో పాలన కారణంగానే ఇలాంటి పరిస్థితి అంటూ సోషలిజానికి లంకెపెట్టి ఒక పథకం ప్రకారం పెద్ద ఎత్తున సోషలిస్టు వ్యతిరేక ప్రచారానికి ట్రంప్ శ్రీకారం చుట్టాడు. అప్పటి నుంచి అమెరికా మీడియాలో సోషలిజం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సహజంగానే వక్రీకరణలు చోటు చేసుకుంటాయని వేరే చెప్పనవసరం లేదు. అమెరికా జనానికి ఇప్పటి వరకు అక్కడి మీడియా ద్వారా సోషలిజం గురించి వక్రీకరణలు, వైఫల్యం చెందినదిగానే సమాచారాన్ని మెదళ్లకు ఎక్కించారు. ఇప్పుడు సోషలిజం గురించి వివరించటానికి, పెట్టుబడిదారీ విధాన వైఫల్యం గురించి చెప్పేవారికి మీడియాలో కాస్తయినా చోటివ్వకతప్పటం లేదు. అందువలన యువతరంలో సోషలిజం మీద ఆసక్తిని పెంచటానికి ఇది దోహదం చేసే అవకాశం వున్నందున ఇదొక సానుకూల పరిణామంగా చెప్పవచ్చు. మారిన పరిస్థితుల్లో అమెరికాలో పెట్టుబడిదారీ విధాన వైఫల్యం గురించి చర్చ మొదలు కావటం విశేషం. నిజానికి నాలుగైదేండ్ల పెట్టుబడిదారీ వ్యవస్థ చరిత్రలో ఆ వర్గానికి చెందిన వారి నోటే దాని వైఫల్యం గురించి పదే పదే వినిపిస్తోంది. ఈ పూర్వరంగంలో సోషలిజంపై ట్రంప్ దాడి గురించి రాసిన విశ్లేషణలకు పెట్టిన కొన్ని శీర్షికలు ఇలా వున్నాయి. 'సోషలిజంపై ట్రంప్ దాడి పెట్టుబడిదారీ విధానానికి సాయపడదు, చికాగో ట్రిబ్యూన్ - 'భయ పడాలనా? భయపడవద్దనా' డెమోక్రాట్ గజెట్.
చికాగో ట్రిబ్యూన్ విశ్లేషణలో కొన్ని అంశాల సారాంశం ఇలా ఉంది. అమెరికాలో సోషలిజానికి ఎన్నడూ ఆదరణ లేదు. ఇరవయ్యవ శతాబ్దంలో పశ్చిమ దేశాలలో సోషలిస్టు పార్టీలు గణనీయమైన ఆదరణ పొందాయి. ఇక్కడ కొద్ది మందికే పరిమితమైంది.1932లో మహా మాంద్యం సమయంలో సోషలిస్టు పార్టీ అధ్యక్ష అభ్యర్థి ఇక్కడ కేవలం రెండుశాతం ఓట్లు మాత్రమే పొందారు. అయితే ఆలస్యంగా అవకాశాలు మెరుగయ్యాయి. 2016లో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధి ఎన్నికలలో బెర్నీశాండర్స్ 13రాష్ట్రాలు, బృందాలలో మద్దతు సంపాదించారు. గతేడాది అలెగ్జాండ్రియా ఒకాసియో కోర్టెజ్ పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. ఇద్దరూ సోషలిస్టులమనే ముద్రను గర్వంగా తగిలించుకున్నారు. ఇప్పుడు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అనే ప్రముఖ రాజకీయవేత్తనుంచి సోషలిస్టులు ఒక శక్తిని పొందారు. 'మన దేశం సోషలిజాన్ని అనుసరించాలనే కొత్త పిలుపులు మనల్ని మేలుకొల్పాయి. అమెరికా ఎన్నడూ సోషలిస్టు దేశంగా ఉండదని ఈ రాత్రి మన సంకల్పాన్ని పునరుద్ఘాటిస్తున్నా' అని ట్రంప్ చెప్పారు. ఇంతకంటే మెరుగ్గా పెట్టుబడిదారీ విధానాన్ని సమర్ధించేవారు అవసరం. సోషలిజంపై దాడి చేయటం ద్వారా ఓటర్లలో ప్రత్యేకించి యువ ఓటర్లలో ట్రంప్ చిన్నబోయారు. వామపక్షానికి పెద్ద బహుమతి ఇది. పెట్టుబడిదారీ విధాన అభిమానులకు సంకట స్థితి కలిగించుతుంది. డెమోక్రాట్లు ఉదారవాదులుగా మారటానికి వారేమీ కారల్ మార్క్స్ తోవలో నడవటం లేదు. వారిలో కొందరికి ఆర్థికాంశాల గ్రహణశక్తి పట్టుతప్పింది. స్వేచ్ఛామార్కెట్ను సమర్థించే ఆ పార్టీ నేతలు కొన్ని సామాజిక సమస్యలను పరిష్కరించలేకపోవటం కూడా ఒక కారణం. ఆచరణాత్మక పరిష్కారాలకు సిద్ధపడకుండా మితవాదులు మరింత కఠినమైన భావజాలానికి కట్టుబడి ఉండటం కూడా పాక్షికంగా అందుకు తోడ్పడింది. బరాక్ ఒబామా ప్రతిపాదించిన ఆరోగ్య సంరక్షణ పథకానికి ఒక రిపబ్లికన్ కూడా ఓటువేయలేదు. అదొక సోషలిస్టు చర్యగా చూశారు.
భయపడాలనా? భయపడకూడదనా అనే శీర్షికతో డెమోక్రాట్ గజెట్ వ్యాఖ్యలో... మంచి మనుషులు లేదా మంచి భావజాలం మీద బురద చల్లటానికి ప్రత్యేకించి ముద్రలు వేస్తారు. వాటిని తాను ద్వేషిస్తానంటూ రచయిత దానిని ప్రారంభించాడు. ఈ రోజు అమెరికా రాజకీయాల్లో కొంత మంది డెమోక్రాట్లు అవలంభించిన దాని ముద్ర సోషలిజం. ఉదారవాదులను చూసి మితవాదులు భయపడేందుకు అదే పదాన్ని రిపబ్లికన్ పార్టీ ఉపయోగిస్తోందని చెబుతూ మధ్యలో సోషలిజం, కమ్యూనిజం గురించి తన అభిప్రాయాలను వెల్లడించిన తరువాత ముగింపులో చెప్పిన అంశాలు అమెరికా సమాజంలో జరుగుతున్న సోషలిజం-పెట్టుబడిదారీ విధానాల మంచి చెడ్డల మధన పూర్వరంగంలో ఎంతో ముఖ్యమైనవి. వివిధ సర్వేలు తేల్చిన సారం ఏమంటే ఈ భూమ్మీద సంతోషంగా వున్న జనం నివశిస్తున్న దేశాలు ఏవంటే సోషలిస్టు ప్రజాస్వామిక వ్యవస్థలు కలిగినవే. కొన్ని ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలు నాణ్యమైన జీవితానికి అవసరమైన లబ్దికి హామీ ఇచ్చేవి, అంటే అందుబాటులో ఆరోగ్య రక్షణ, వ్యక్తిగతంగా తగినంత సెలవు దొరకటం, అందుబాటులో గృహవసతి, స్వచ్ఛమైన పర్యావరణం వంటివి. అయితే ప్రజాప్రాతినిధ్య ప్రజాస్వామిక వ్యవస్థలలో కోరుకున్నంత వ్యక్తిగత ఆస్థి లేదా సంపదలను ఎంచుకోవటానికి స్వేచ్ఛ ఉంటుంది. ఈ దేశాలు మౌలికంగా పెట్టుబడిదారీ విధానం, సోషలిజంతో మిళితమై ఎంతో ప్రభావంతంగా, ఆకర్షణీయంగా వుంటాయి. మనం సోషలిజం గురించి భయపడనవసరం లేదు. దాని సంకల్పాలతో మానవాళి లబ్ది పొందిందని మనసారా మనం గుర్తించాలి. ఆ తరువాత ఆ భావజాలాన్ని మన స్వంత దేశంలో వృద్ధి పొందించటానికి మనం పూనుకోవాలి.
న్యూయార్క్ టైమ్స్, లాస్ ఏంజల్స్ టైమ్స్, వాషింగ్టన్ పోస్టు వంటి బడా కార్పొరేట్ల పత్రికలూ ఈ చర్చను విస్మరించలేకపోయాయి. స్థలాభావం రీత్యా అన్నింటి సారం అందించటం సాధ్యం కాదు. గత కొద్ది సంవత్సరాలుగా అమెరికాలో జరుగుతున్న సోషలిస్టు మధనం గురించి శత్రువులు ముందే గ్రహించారు. ప్రపంచమంతటా కారల్‌మార్క్సు 200వ జయంతిని జరుపుకుంటున్న సమయంలో ఆయన భావజాలాన్ని అరికట్టే బాధ్యతను తలకెత్తుకున్నామని చెప్పుకొనే అమెరికా సర్కార్ 2018 అక్టోబరు 23న సోషలిజం ఎంత ఖర్చుతో కూడుకున్నదో వివరిస్తూ ఒక పెద్ద పత్రాన్ని విడుదల చేసింది. అమెరికా గనుక సోషలిస్టు విధానాలను అమలు జరిపితే భవిష్యత్‌లో సంభవించబోయే నష్టాలను దానిలో ప్రస్తావించారంటే ఇది సోషలిజాన్ని కోరుకుంటున్న యువతను సూటిగా వ్యతిరేకించకుండా మరోమార్గంలో వారి మెదళ్లను చెడగొట్టే ప్రయత్నం తప్ప వేరు కాదు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపటం ఎలా సాధ్యం కాదో వక్రీకరణలతో సోషలిజం గురించి తెలుసుకోకుండా జనాన్ని నివారించటం కూడా అంతే!
- ఎం. కోటేశ్వరరావు