Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యాసంగి, ఎండలు మండుతున్నయి. ఉడుకు గాలి గొడ్తున్నది. ఇంట్ల గూసున్నా ఉబ్బరిస్తున్నది. పంక దిర్గుతున్నా పాయిదలేకుంట బోయింది. నా మన్మడు ఏడో తరగతిల ఉన్నడు. మన్మరాలు ఆరోతరగతి సద్వుతున్నది. బడికి తాతీల్లు ఇచ్చిండ్రు.
''తాతా! బొంబాయి లేకుంటె మద్రాస్‌కు బోదాం'' అని నా మన్మడు అన్నడు.
''మన ముండేది పట్నంల. పట్నంకెల్లి ఇంకో పట్నం బోవుడెందుకురా?''
''మల్ల యాడ్‌కి బోదాం'' అని మన్మరాలు అడిగింది.
''యాద్గిరి మామ ఉంటున్న పల్లెటూర్కి బోదాం''
''గాడ వరిచెట్లు ఉంటయట గదా''
''వరి చెట్లు గాదు. వరి పొలాలు. గాడ చెట్లుంటయి. బాయిలుంటయి. ఎద్దులుంటయి. బర్లుంటయి. చెర్వుంటది. కుక్కలుంటయి. పందులుంటయి. గాడ్దిలుంటయి. కోల్లుంటయి. కోతులుంటయి. పిట్టలుంటయి. చిల్కలుంటయి. గుడిసెలుంటయి. చెట్లు ఎక్వ ఉండె బట్కె గాడ సల్లగుంటది. గంతే గాదు. గోటీలు; గిల్లిదండ, కబడ్డి; నాల్గు డబ్బాల అసువంటి ఆటులుంటయి. బాగోతాలుంటయి. కోలాటాలుంటయి. పాటలుంటయి. పద్దెంలుంటయి.''
బస్సుల యాద్గిరి మామ తాన్కి బోయినం. గాయిన ఇంటి సుట్టూత చెట్లున్నయి. మామిడి చెట్టు, కొబ్బరిచెట్టు, మారెడుచెట్టు, జాంచెట్టు, దానిమ్మచెట్టు, యాపచెట్టు, అసువంటి చెట్లే గాకుంట పూలచెట్లు గూడ ఉన్నయి. ఒక బర్రె, ఒక ఆవు గూడ ఉన్నది. యాద్గిరి మామకు ఎన్‌పై ఏండ్లు. గాయిన ఎంటికలు తెల్లగ గాలేదు. ఒక్క పన్ను గుడ్క ఊసిపోలేదు. కండ్లకు అద్దాలు రాలేదు. గాయిన గుండుకు గుండుంటడు. జమానల గాయిన ఎమ్మెల్యే. గాయిన దోతి గడ్తడు. నెత్తికి రుమాల్ సుట్టుకుంటడు. గాయిన తాన్కి ఊరోల్లందరు వొస్తుంటరు. గాయిన మాట ఇంటరు.
బువ్వ దిన్నంక నా మన్మడు; మన్మరాలు; పక్కింటి పిల్లలతోని ఆడుకునేతందుకు బోయిండ్రు. నేను; మామ యాప చెట్టు నీడల గూసున్నం.
''మల్ల మోదీ ప్రతాని అయితడా మామా''
''అయ్యెటట్లు గొడ్తలేదురా''
''ఎందుకంటవు''
''కొట్లాడ శాతగానోడు. తిట్టుకుంట గూసుంటడు. ఓడిపోతమని ఎర్కుంటె బట్కె బత్కిన్నోల్లనే గాకుంట సచ్చిపోయిన లీడర్లను గూడ మోదీ దిడ్తున్నడు'' అన్కుంట మా మామ ఏమో జెప్పబోతుంటె-
''ఆకర్కి మోదీ ప్రతాని కుర్సి కోసం పీన్గ మీది ప్యాలాలు ఏరుకుంటున్నడంటవు''
''అవ్, నీతి లేనోలల్ల రాజీవ్ గాంది నంబర్ వన్ గాయిన సాఫ్ సీదా మన్సి గాదు. బోఫోర్స్ కుంబకోనంల కోట్ల రూపాలు తిన్నడు. గా మచ్చతోనే గాయిన సచ్చిపోయిండు అని మోదీ'' అన్నడు.
''మోదీ గట్లంటె రాహుల్, ప్రియాంక గాంది ఊకున్నరా?
''బోఫోర్స్ కుంబకోనంతోని రాజీవ్గాందికి ఎసువంటి సంబందం లేదని ఆదాలత్ జెప్పింది. మా నాయిన అవినీతి మచ్చతోని సావలేదు. ఎల్టిటిఈ మానవ బాంబు పటాయిస్తె సచ్చిపోయి షహీదయ్యిండు. రాఫెల్ కుంబకోనం తోని మీకు సంబందం లేదని ఏ అదాలత్ అయిన జెప్పిందా అని రాహుల్, ప్రియాంక అడిగిండ్రు''
''గాల్లు గట్లడ్గంగనే కల్లు దాగిన కోతి లెక్క ప్రతాని చెంగడ బింగడ ఎగిరుంటడు.''
''చిన్నగంటవా కల్లు దాగిన కోతి ఇంగలం మీది కెల్లి నడ్సిన తీర్గ ఎగిరిండు. గాయిన తాన మస్తు అబద్దాలున్నయి. ఒకటెన్క ఒకటి జెప్తున్నడు. కాంగ్రెస్ సర్కార్ ఉండంగ ఐఎన్ఎస్ విరాట్ నౌకల పెండ్లాం; సుట్టాలను దీస్కోని రాజీవ్ గాంది తప్రికి బోయిండు. విరాట్ ఏమన్న సొంత ట్యాక్సీనా? అని మోదీ అడిగిండి. ఎటూ సుద్రాయించక అబద్దాల మీద అబద్దాలు జెప్తె మల్ల బిజెపి సర్కారొస్తదనుకుంటుండు''
''గిది గూడ అబద్దమేనా మామా!''
''ఐఎన్ఎస్ విరాట్ల సొంత పని మీద రాజీవ్ తప్రికి బోలేదు. సర్కార్ పనిమీదనే లచ్చదీవులకు బోయిండని విరాట్ల పని జేసి వజీప దీస్కున్న ఆర్మీ ఆప్సర్లు జెప్పిండ్రు. పుల్వామం షహీదైన జవాన్ల పేరు మీద ఓట్లేయ్యుండ్రి. బాల్ కోట మీద గాలిమోటర్ల తోని హమ్ల జేపిచ్చి పాకిస్తాన్‌కు బుద్ది జెప్పినోల్లకు ఓట్లేయుండ్రి. మమ్ములను గెలిపిస్తే దేసం బద్రంగ ఉంటది అని మోదీ జెప్పబట్టిండు. యోగి ఆదిత్యనాత్ అయితె బారత పౌజును మోదీ జీకి సేన అని అనబట్టిండు''
''మోదీ ఇంక అబద్దాలేమన్న జెప్పిండా''
''ప్రతాని ఎలచ్చన్లు ప్రచారం జేస్కుంట ఆంద్రప్రదేస్ను రొండు పచ్చలు జేసి కాంగ్రెస్ తలెంగాన ఇచ్చింది. గిప్పలు ఆంద్రోల్లు; తెలంగానోల్లు మొకాలు గుడ్క జూస్కుంట లేరు అని అన్నడు. నిజాన్కి ఒక్క ఓటుకు రొండు రాస్ట్రాలు అని బిజెపి అన్నది. బిజెపి మదద్ లేకుంటె తెలంగాన వొచ్చేది గాదు. పెద్దమ్మనే గాదు గీ చన్నమ్మను యాదికుంచుకోండ్రి అని తెలంగాన వొచ్చిన కొత్తల సుష్మాస్వరాజ్ అననే అన్నది''
''అబద్దాలు జేప్పకుంట ఐదేండ్లల్ల జెనం గురించి బిజెపి సర్కార్ ఏం జేసిందో జెప్పచ్చు గద మామా''
''ఐదేండ్లల్ల మోదీ రొండే రొండు జేసిండు. పెద్ద నోట్లు బంద్ జేసుడు. జీఎస్టి బెట్టుడు. పస్టు దానితోని శానమంది కొల్వులు బోయినయి. రొండో దానితోని చిన్న యాపారులు దెబ్బతిన్నరు. గందుకే గిప్పుడు చిన్న పోరగాల్లు 'మోదీ మోదీ ఎస్ పాపా! ఎనీ డెవలప్మెంట్ నో పాపా' అని రైమ్స్ సద్వుతున్నరు.
''స్వచ్ఛ భారత్; శ్రేష్ట బారత్, మేకిన్ ఇండియా; మేడిన్ ఇండియా మన్‌కీ బాత్ అని మోదీ అంటున్నడు. గదా మామా!''
''గవన్ని గారడి ఆటలురా. గవ్విటితోని జెనంకు ఏమన్న పాయిత ఉన్నదా? చండీగడ్ కెల్లి బిజెపి ఎంపి కిరణ్ కేర్ పోటీ జేస్తున్నది. గామె మొగడు సిన్మ యాక్టర్ అనుపం కేర్.
గాయిన బిజెపికి ఓటు ఎయ్యుమని ప్రచారం జెయ్యబట్టిండు. ఒగడు బిజెపి ఎలచ్చన్లు మ్యానిఫెస్టోను గాయినకు ఇచ్చిండు. గీ మ్యానిఫెస్టోల జెప్పిన ఎన్ని పనులను బిజెపి జేసిందో ముందుగాల జెప్పు అని గాడు అన్నడు. ఇగ దాంతోని అనుపం కేర్ ఎడ్డి మొకమేస్కునున్నడని వేరే జెప్పాల్నా''
''ఎలచ్చన్ల గెల్సెతందుకు బిజెపి ఇంకే జేస్తున్నదే''
''ఉత్తర్ ప్రదేస్ల మోదీ ఫోట్వ బెట్టి యాగం జేస్తున్నరు. దేవుని అవుతారాలు పది. పదకొండో అవుతారమే మోదీ బాబా సిద్దార్తుడు పెండ్లాంను ఇడ్సి బెట్టి తపస్సు జేసి బుద్దుడయ్యిండు. మోదీ జెనంకు సేవ జేసి మోదీ బాబా అయ్యిండు. ప్రతాని కుర్సి మీద గూసోని జెనంకు వొరాలిచ్చిండు. అన్కుంట యోగి ఆదిత్యనాత్ మోదీ పురానం జెప్పబట్టిండు. ద్రోనుని తాన బానాలు ఇప్పుడు నేర్సుకున్న అర్జునుడు గురువు మీదికే బానాలు ఇడ్సిండు. గదే తీర్గ రాజకీయ పాటాలు జెప్పిన గురువు అద్వానికే మోది పంగనామాలు బెట్టిండు. ఛారు దాగుదాం పారా'' అన్కుంట మా యాద్గిరి మామ ముచ్చట్లు బంద్ జేసిండు.
తోక: - మా పటీల మా సోపతోల్లు చౌరస్తల ఉన్న పాన్ డబ్బ కాడ జమైతరు. సిగిలేట్లు దాక్కుంట పాన్లు దినుకుంట ముచ్కట బెడ్తుంటరు.
''మోహిని అమృతం బంచుతుండగా దేవతలు ఒక దిక్కు రాచ్చసులు ఒక దిక్కు గూసున్నరు. అమృతం కోసం రాహువు కేతువు ఏసాలు బద్లాయించి దేవతల పక్క పంటి గూపసుంటె గుర్తు బట్టి ఇష్ను మూర్తి గాల్ల మీద్కి చెక్రం కండ్వలు బద్లాయించిన హరిప్రయి, రేగా కాంతారావు పంచాయితి ఎలచ్చన్ల ప్రచారం జేసెతందుకు బోతె కాంగ్రెస్ దిక్కు కెల్లి ఎమ్మెల్యే సీటుకు పోటీజేస్తే మిమ్ములను గెలిపిస్తె గోడ దుంకి టిఆర్ఎస్లకు ఎంద్కుబోయిండ్రని జెనం దేవుల్లు గట్టిన అడిగిండ్రు. ఏం జెప్పాల్నో సమజ్ గాక గాల్లు ఎన్కకు మల్లిండ్రు.
- తెలిదేవర భానుమూర్తి
సెల్: 9959150491