Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉద్యోగం పురుష లక్షణమని వనిత వంటింట్లో ఉండాలని పురుష ప్రవచనం. ఉద్యోగమంటే ప్రయత్నం, పని కాదు. ప్రయత్నం పురుష గుణమని సనాతన ధర్మసూత్రం. నిజానికి అతివలే అతి ప్రయత్నశీలురు. దేశంలో ఉద్యోగాలు లేవు. ఉన్నవి ఊడుతున్నాయి. పురుషాధిక్య సమాజంలో మగాళ్ళే కొత్త కొలువుల్లో కుదురుతున్నారు. స్త్రీల ఉద్యోగాలు పోయి, ఉత్పత్తికి దూరమవుతున్నారు. శ్రామికశక్తి నుంచి తొలగించబడుతున్నారు. అయితే కుటుంబ పోషణకు బండచాకిరీ చేస్తున్నారు.
నగరాల కంటే గ్రామాల్లో మహిళా శ్రామికులు ఎక్కువ. స్త్రీలు వ్యవసాయంలో ప్రధాన పాత్ర పోషించేవారు. ప్రపంచీకరణ ప్రభావంతో వ్యవసాయం దెబ్బతింది. యాంత్రీకరణతో గ్రామీణ మహిళలు ఉపాధి కోల్పోయారు. గ్రామీణులు పట్టణాలు, నగరాలకు వలసవెళ్లారు. అక్కడా తగినన్ని ఉపాధులు లేవు. బతకటానికి ఇంటి పనివారుగానో, నిర్మాణ కార్మికులుగానో, తోపుడుబండ్ల వ్యాపారులుగానో, ఇల్లిల్లు తిరిగి పండ్లూ కూరగాయలూ అమ్ముకునో, ప్రయివేటు విద్యాలయాల్లో, ఆసుపత్రుల్లో ఆయాలుగానో స్త్రీలు పనిచేస్తున్నారు. అత్యంత అనారోగ్య వాతావరణంలో మురికి గుడిసెల్లో ఇరుక్కుంటారు. నివాస, పనిస్థలాల్లో, ప్రయాణంలో వీళ్ళకు భద్రత లేదు. లింగ వివక్ష, లింగాధార హింస ఎక్కువ. లైంగిక దాడులకు గురవుతున్నారు. ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాల్లో కూడా వీరికి రక్షణ లేదు. పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉపాధులు కోల్పోయారు. 2005 - 12 మధ్యలో భారత్లో 2 కోట్లమంది స్త్రీలను ఉద్యోగాల నుంచి తొలగించారని ప్రపంచ బ్యాంకు నివేదించింది. ఇది శ్రీలంక జనాభాతో సమానం. 2012కు మన దేశంలో 27శాతం మహిళలు ఉద్యోగాల్లోనో, ఉద్యోగాలు కోరుతూనో ఉన్నారు. పురుషుల్లో 79శాతం ఉద్యోగాలు చేస్తున్నారు. 2015-16కు శ్రామికశక్తిలో మహిళల శాతం24కు పడిపోయింది. భారత్ మహిళా శ్రామికశక్తిలో 131 దేశాల్లో 120వ స్థానంలో, 8 దక్షిణాసియా దేశాల్లో పాకిస్థాన్, అఫ్ఘనిస్థాన్లకు ముందు 6వ స్థానంలో ఉంది. గర్భధారణ సమయంలో కష్టాలకోర్చి ఉద్యోగాలు చేస్తారు. అమెరికా పాశ్చాత్య దేశాల్లోమన తల్లిదండ్రులో, అత్తమామలో పిల్లలను పెంచుతారు. ఐరోపా దేశాల్లో ఇంటి పనుల్లో, పిల్లల పెంపకంలో జీవిత సహచరులు సహకరిస్తారు. మన దేశంలో పిల్లల పెంపకంలో మగాళ్లు భార్యలకు సాయపడరు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రసూతి, ఆర్జిత సెలవులు వాడుకోవచ్చు. ప్రసూతి తర్వాత ప్రయివేటు సంస్థలు ఉద్యోగమివ్వవు. ఈ తల్లులు ఇంకో ఉద్యోగం వెతుక్కోవాలి. ఉద్యోగం దొరికినా పదోన్నతులు తక్కువ. లేదా స్వయం ఉపాధి ఏర్పరచుకోవాలి. భార్యా భర్తలు ఒకే రకం ఉద్యోగాల్లో ఉన్నా మగాళ్ళే పదోన్నతులు పొందుతారు. కుటుంబ బాధ్యతల కోసం భార్యలు పదోన్నతి వదులుకొని ఉన్న ఉద్యోగానికి పరిమితమవ్వాలి. స్త్రీలు నైపుణ్యతలు సాధించలేరని, యాంత్రికీకరణను అందుకోలేరని సాకులు చెపుతారు. పరిపాలన, దౌత్య, ఆర్థిక, నిఘా, విద్య, వైద్య, శాస్త్రవిజ్ణాన, పరిశోధన, అంతరిక్ష రంగాల్లో మహిళలు మగాళ్ల కంటే సామర్థ్యంతో ప్రగతి సాధించినా వారిని గుర్తించరు. ఫలితంగా స్త్రీలు అధికారిక ఉద్యోగాలకు దూరమై అనధికార ఉపాధుల్లో ఇరుక్కుపోతున్నారు. ''2017లో భారత్లో పురుషులు స్త్రీల కంటే 15శాతం ఎక్కువ జీతాలు పొందారు. 2018లో ఈ ఆధిక్యత 19శాతానికి పెరిగింది'' అని డచ్ పరిశోధక సంస్థ 'వేజ్ ఇండికేషన్ ఫౌండేషన్' సర్వేలో తేలింది. లింగభేదంతో జీతభత్యాల వ్యత్యాసాలు ఎక్కువున్న దేశాల్లో భారత్ చివరిదని అంతర్జాతీయ కార్మిక సంస్థ తెలిపింది. మన స్థూల జాతీయోత్పత్తిలో మహిళల ఆర్థిక సహకారం 17శాతం. ఇది ప్రపంచ స్థూల జాతీయోత్పత్తిలో మహిళల వాటాలో సగం.
పుత్రుడు పున్నామ నరకం నుంచి రక్షిస్తాడన్న మూఢనమ్మకముంది. పిండదశలోనే అనధికార లింగనిర్ధారణతో ఆడపిల్లల హత్య చేస్తున్నారు. ఈ దుశ్చర్యల నుంచి తప్పించుకొని పుట్టిన అవాంఛిత బాలికలు 2.1 కోట్లున్నారని అంచనా. అధ్వాన్నమైన లింగ నిష్పత్తి 6.30కోట్ల మంది ఆడవాళ్లు అదృశ్యం కావటానికి కారణమైంది. ప్రభుత్వ, ప్రయివేటు సంస్థల్లో 26వారాల నిర్బంధ ప్రసూతి సెలవు స్త్రీలను నిరుద్యోగాలపాలు చేసింది. ప్రసూతి సెలవులు ఇవ్వవలసి వస్తుందని కొన్ని ప్రయివేటు సంస్థలు వివాహిత వనితలకు ఉద్యోగాలు ఇవ్వవు. 50మంది మహిళా ఉద్యోగులున్న కార్యాలయాల్లో శిశుసంరక్షణ కేంద్రాలుండాలి. తల్లులకు ఉద్యోగాలివ్వనేల? శిశుసంరక్షణ కేంద్రాల ఖర్చులేల? అని ప్రయివేట్ల ఆలోచన. గర్భాశయ శస్త్రచికిత్స చేయించుకున్నట్టు వైద్య ధృవపత్రం ఇచ్చిన స్త్రీలకే కొందరు పనులిస్తారు. రుతుస్రావ దినాల్లో మహిళలు సరిగా పనిచేయరని వారి అభిప్రాయం. ఆడవారి సంతానోత్పత్తి వయసు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యుల సంఖ్య, ప్రయాణంచేసే శక్తి, ఆరోగ్యాల మీద వారి ఉపాధి లభ్యత ఆధారపడి ఉంటుంది. కూతుర్ల తల్లుల కంటే కొడుకుల అమ్మలకు కొందరు ప్రాధాన్యతనిస్తున్నారు. 90శాతం ప్రపంచదేశాల్లో లింగాధారిత చట్ట పరిమితులున్నాయి. కొన్ని దేశాల్లో మహిళలకు పరిమిత ఆస్తి హక్కు ఉంది. భార్యలు ఉద్యోగాలు చేయకుండా భర్తలు ఆపవచ్చు. కుటుంబ సంబంధాలు, చదువు, ఆర్థిక అధికారాల్లోనూ ప్రభుత్వ వత్తిళ్ళున్నాయి. నార్వే, స్వీడెన్ లాంటి స్కాండినేవియన్ దేశాల్లో శిశుసంరక్షణ, తల్లిదండ్రులిద్దరికీ జీతంతో కూడిన ప్రసూతి సెలవులు ఉంటాయి. ఇద్దరూ ఉద్యోగం చేస్తారు. దేశాభివృద్ధికి తోడ్పడతారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) మహిళా సాధికారత పథకాలకు సహాయం చేస్తుంది. ఐఎంఎఫ్ కార్యక్రమాలతో ఈజిప్టు, జోర్డాన్ దేశాలు మహిళల ఆర్థిక, సామాజిక సాధికారత సాధించాయి. తన పథకాలతో మహిళ సాధికారత, సామాజిక మార్పు సాధించమని ఐఎంఎఫ్ సభ్య దేశాలకు సూచించింది.
సామాజిక ప్రగతిలో బాలికల, మహిళల పాత్ర ప్రధానం. మహిళా సాధికారతకు పేదరిక నిర్మూలనకు దగ్గరి సంబంధముంది. మహిళలు సంపాదనలో అధిక భాగం పిల్లలు, కుటుంబ సభ్యుల కోసం ఖర్చుపెడతారు. ''భారత మహిళలకు వారి అవసరాలు తీర్చే నైపుణ్యతా శిక్షణ ఇస్తున్నాము. గత 15ఏండ్లలో స్వయం సహాయక బృందాల మహిళల సహాయం కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు 300కోట్ల డాలర్ల (రూ.21,000 కోట్ల) సహాయం అందించాం.'' అని ప్రపంచ బ్యాంకు దక్షిణాసియా విభాగ మాజీ ఉపాధ్యక్షురాలు అనెట్ అన్నారు. భారత జనాభాలో మహిళలు 48శాతం. జనాభా ప్రాతిపదికన వారు ఆర్థిక ప్రగతి పొందలేదు. ఐదేండ్ల లోపు ఆడపిల్లలు ఏడాదికి 2,39,000 మంది చనిపోతున్నారు. 'కూతురును చదివించు, కూతురును కాపాడు', 'సుకన్యా సమృద్ధి యోజన' వంటి ప్రభుత్వ పథకాలు ప్రయోజనకరంగా అమలు కాలేదు. భారత పురుషుల అక్షరాస్యత 80శాతం. మహిళల అక్షరాస్యత 65శాతం. పాలక పార్టీలకు మహిళల అక్షరాస్యత, ఉపాధి కల్పనపై రాజకీయ సంకల్పం లేదు. మహిళలకు రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వలేదు. 2019 ఎన్నికల్లో పశ్చిమ బంగలో మమతా బెనర్జీ, ఒడిశాలో నవీన్ పట్నాయక్ మహిళలకు ఎక్కువ స్థానాలు కేటాయించారు. గెలిస్తే మహిళలకు ఉద్యోగాల్లో 33శాతం రిజర్వేషన్లు కల్పిస్తానంది కాంగ్రెస్. ఏ పార్టీ కూడా ఎన్నికల ప్రణాళిక, ప్రచారాల్లో మహిళా ఉపాధిని ప్రస్తావించలేదు. చట్టసభల్లో మహిళల రిజర్వేషన్ కల్పిస్తే కానీ వారి సమస్యలు పరిష్కరించబడవు. స్త్రీల పట్ల మూఢవిశ్వాసాలు పోవాలి. మహిళల చదువు, ఉపాధులతో అసమానతలు తగ్గుతాయి. స్థూల జాతీయోత్పత్తి పెరుగుతుంది. స్థిరఅభివృద్ధితో సమగ్ర సామాజిక ప్రగతి సాధ్యమౌతుంది.
స్త్రీలు భావి పౌరులకు తొలి గురువులు. వీరి ఆర్థిక స్వయంప్రతిపత్తి పిల్లల పురోగతికి దోహదపడుతుంది. వారిని ఉపాధుల నుంచి, ఉత్పత్తి నుంచి బహిష్కరిస్తే సమాజం తిరోగమిస్తుంది. నేటి సగసమాజం, రేపటి సంపూర్ణసమాజం వ్యర్థమవుతుంది. స్త్రీవివక్ష, స్త్రీశక్తి దుర్వినియోగాలకు కాలంచెల్లింది. మహిళాభివృద్ధి, సాధికారతల సమయమిది.
- సంగిరెడ్డి వాణి
సెల్: 9441002288