Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పదినెలలు కూడా నిండని పసికందుపై అత్యా చారానికి పాల్పడి ఆపై హతమార్చిన మానవ మృగానికి వరంగల్ కోర్టు మరణదండన విధించడం ఈ మధ్య కాలంలో అత్యాచార ఘటనలలో వెలువడిన తీర్పులలో కఠినమైనదే. ఈ తీర్పు బాధిత కుటుంబానికి కొంత మానసిక ఉపశమనం కలిగించి ఉండవచ్చు. ఆ కుటుంబసభ్యులతో పాటు ప్రజలందరూ నేరస్థుడికి తీవ్రమైన శిక్ష పడాల్సిందేనని పట్టుబట్టారు. వీరికి మహిళా సంఘాలు, ప్రజాసంఘాలు మద్దతు పలకడం కేసుదర్యాప్తు వేగవంతం చేయడానికి ఎంతో దోహదపడింది.
సాధారణంగా ఈ తరహా దాడులకు గురయిన బాధితులు అసహాయ స్థితిలో ఉంటారు. వారి ముందు కన్పించేది ఒక్కటే.. తమకు జరిగిన అన్యాయానికి ఎంతో కొంత ఉపశమనం కోరుకోవడం. అందులో భాగంగా నేరస్తునికి కఠినశిక్ష పడాలని కోరుకుంటారు. మరో దారుణ సంఘటన 'నిర్భయ'పై లైంగిక దాడికి చెప్పుకోలేని రీతిలో దాడికి గురైన ఆ యువతి మరణించడం దేశం మొత్తాన్ని కలవరపెట్టింది. అది జరిగిన కొన్ని గంటల తర్వాత ఆ యువతి తల్లి ఈ దేశంలో ఇదే చివరి ఘటన కావాలనీ, నాలాంటి దుస్థితి ఏ తల్లికీ రాకూడదని కోరుకుంది. కొన్ని రోజుల పాటు పోరాడి నిర్భయ చట్టం సాధించుకున్నాం. దానితో ఇక స్త్రీలపై దాడి చేయాలనే ఆలోచన రావాలంటేనే కామాంధులకు వెన్నులో వణుకు పుడుతుంద నుకున్నాం.
చిన్నపిల్లపై విపరీతంగా పెరిగిపోతున్న దాడులను ఎలాగైనా అడ్డుకోవాలన్న తపనతో మొన్నటికి మొన్న మునుపటి పోక్సో చట్టానికి సవరణలు కూడా చేసుకున్నాం. దానిద్వారా శిక్షా స్థాయిలను కూడా పెంచుకున్నాం. దాని ద్వారా చిన్నపిల్లపై లైంగిక దాడి చేస్తే జీవిత ఖైదు, మరణ శిక్షలు సైతం అమలు చేయాలని నిర్ణయించాం. అయినా ఫలితాలు కనిపించట్లేదు సరికదా కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. శిక్షలు వీరిలో కించిత్ భయాన్ని కూడా కల్పించలేకపోతున్నాయి.
దారి తప్పిన వారిని శిక్షించడం కొనసాగుతూనే వ్యక్తిని లైంగికంగా ప్రేరేపించే అంశాల పట్ల ప్రాథమికంగా ఒక అవగాహనకు రావాలి. ఒక్కో అంశాన్ని సుదీర్ఘంగా పరిశీలించి అర్థం చేసుకోవాలి. మచ్చుకు కొన్ని బూతు కామెడీ షోలు, సినిమాలు, ఇంటర్నెట్లో నీలి చిత్రాలు, అశ్లీల సాహిత్యం, అపరిమిత డేటా సౌకర్యాలు, మద్యం, అక్రమ లైంగిక సంబంధాలకు చెందిన కథలు మొదలైనవి. వీటిలో కొన్ని పూర్తిగా ప్రభుత్వం కట్టడి చేయాలి. కానీ అది జరగట్లేదు. మరికొన్నేమో స్నేహితులు, తల్లి దండ్రులు, సమాజం ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ, సూచనలిస్తూ జీవితం పట్ల సదవగాహన కల్పించే ప్రయత్నాలు చేయాలి. ఎవరికి వారు తాము ఆలోచిస్తున్నది సరైనదా కాదా అని స్వీయ విమర్శ చేసుకుని చెడు తలంపులకు దూరంగా ఉండేలా స్వీయ నియంత్రణ చేసుకోవాలి.
లైంగిక ఘటనల్ని పరిశీలిస్తే వయస్సుతో నిమిత్తం లేకుండా మైనారిటితీరని అబ్బాయిలు మొదలుకుని పెద్దమనుషుల వరకూ విచక్షణా రహితంగా వ్యవహరిస్తున్నారు. మధ్య తరగతి ఆడపిల్ల అన్యాయానికి గురైతే దాని పర్యవసానం ఎలా ఉంటుందో దృశ్యం సినిమా కండ్లకు కట్టింది. ఆ చిత్రంలో తప్పు చేసిన వాడు పోలీసు అధికారి కొడుకు అని తెల్సి కూడా ప్రతీకారం తీర్చుకోవడానికి సదరు కుటుంబం వెనకాడలేదు. సాంకేతికంగా ఎలాంటి ఆనవాళ్ళు దొరకకుండా చివరికి నిర్దోషులుగా బయటపడుతుందా కుటుంబం. కానీ అది సినిమా అనేది మనం గుర్తుంచుకోవాలి. వాస్తవ జీవితానికి దానిని అన్వయించలేం. నేరాన్ని నేరంతో సరిచేయలేం, సరిచేయకూడదు. అలా చేస్తే మన జీవితంలో కూడా ప్రశాంతత కోల్పోతాం.
దారి తప్పిన వాడిని ఒక కేస్ స్టడీగా ఎందుకు తీసుకోవడం లేదో, అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద ఎందుకు దృష్టి సారించడం లేదో దర్యాప్తు సంస్థలకే తెలియాలి. ప్రభుత్వం ఇలాంటి ప్రాథమిక విషయాలపై దృష్టి పెట్టకపోవడం బాధాకరం. పౌరులుగా మనం కోరుకునేది ఒక్కటే. సమాజంలో తీవ్ర అలజడి కలిగించే ఘటనలు రోజురోజుకీ పెరుగుతున్న దరిమిలా, ప్రభుత్వాలు తక్షణమే లైంగిక విషయాల మీద తగు అవగాహన కార్యక్రమాలు విరివిగా రూపకల్పన చేయాలి. స్మార్ట్ ఫోన్ లేని కుటుంబం లేదు. కాబట్టి సామాజిక మాధ్యమాల ద్వారా వాటికి విస్తత ప్రచారం కల్పించాలి.
పెరుగుతున్న లైంగిక దాడులు, నేరాలు తగ్గాలంటే మన దృష్టి, కేవలం చట్టాలు చేయడం మీదనే కాకుండా ఆ నేరతాలుకు భావాలు శాశ్వతంగా మనుసులోకి రాకుండా చేయాలి. మనలో ఉన్న వికృత ఆలోచనల్ని సమాధి చేయాలి. అవగాహన కార్యక్రమాల ద్వారా విషయాన్ని అర్థవంతంగా చెప్పగలగాలి. ఇది ఇల్లు, పాఠశాల నుంచే మొదలుకావాలి. 'సత్ప్రవర్తనకు మించిన ఆభరణం మనిషికి ఇంకోటి ఉండద'నే సూక్తిని గుర్తుచేయాలి.
- ఎస్. రవికుమార్
సెల్: 7893903740