Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కైలాసంల ఉన్న గన్పతికి ఒక్కపారి తెలంగానకు పోవాలనిపిచ్చింది. పట్నం బోయి గాడ జెనం ఎట్ల పూజలు జేస్తున్నరో ఎర్కజేస్కోవాలనిపిచ్చింది. అనిపియ్యంగనే గాయిన ఎల్కను బిల్సిండు. పనేం లేకుండ బట్కె మంచిగ పండుకున్న ఎల్క నిద్రలేసి గన్పతి కాడికొచ్చింది.
''ఎందుకు బిల్సిండ్రు దేవా!'' అని అడిగింది.
''ఒక్కపారి పట్నం బోయొద్దాం'' అని గన్పతి అన్నడు
''మంచిది పోదాం పాండ్రి''
గనేశ్ మా రాజ్ ఎల్క మీద గూసుండు. ఎల్క మొగులు మీదికెల్లి ఎల్లింది.
పొద్ద టీల ఎల్క పట్నం దిగింది. సక్కగ కైరతాబాద్ బోయింది. గాడ పెద్ద గన్పతి బొమ్మ గండ్ల బడ్డది. గా దాన్ని జూసి ఎల్క నారాజైంది.
''మొకమెందుకు మూడ్సుకున్నావ్?'' అని ఎల్కను గన్పతి అడిగిండు.
''మీ బొమ్మను పెద్దగ బెట్టిండ్రు. గని నా బొమ్మను బెట్టిండ్రా?'' అని ఎల్క అడిగింది.
''నీ బొమ్మను బెట్టకపోతే ఏంది?'' పట్నం ఏ ఇంట్ల జూసినా మీరే నాయె'' అని గన్పతి అన్నడు.
''గోదాములల్ల ఉన్న బియ్యం బస్తలు వేరే రాస్ట్రాలకమ్ముకుంటున్నరు. ఎల్కలు బియ్యం దిన్నయని పూజూల్గ మమ్ముల బద్నాం జేస్తున్నరు''
''బియ్యం మీకొక లెక్కనా?ఎన్కటికి మీ ఎల్కలు ఇనుమునే దిన్నయి -
ఎన్కటికి ఇద్దరు దోస్తులుండెటోల్లు. గాల్లు యాపారం జేసెటోల్లు కరీదులకు ఒక సావుకార్కి వేరే దేసం బోయెటి పని బడ్డది. గాయిన దోస్తు తాన్కి వొచ్చిండు. యాపారం మీద నేను మన పక్క దేసంకు బోతున్న. నేను వొచ్చెదాంక నా తాన ఉన్న వెయ్యి టన్నులు ఇన్మును, నీ తాన ఉంచుత అని అన్నడు. చెప్పిన తీర్గనే ఇనుమును దోస్తు తాన ఉంచి పక్క దేసం బోయిండు. నెల దినాలైనంక వొచ్చి నా ఇనుము నాకియ్యి అని దోస్తుతోని అన్నడు. గప్పుడు గాయిన దోస్తు ఏడ్సుకుంట నువ్వు నా తాన దాసి పెట్టిన ఇన్మును ఎల్కలు దిన్నయని జెప్పిండు''
''ఎల్కలు యాడనన్న ఇనుము దింటయా? గాడు జెప్పినయన్ని అవద్దాలు''
అవద్దమో నిజమో నాకేమొర్క. నాకు ఎర్కున్న కత నీకు జెప్పిన''
''గీ నడ్మ గుడ్క మమ్ములను బద్నాం జేసిండ్రు. జార్కండ్ల కోనార్ నది మీద 42ఏండ్ల కిందట ఒక ప్రాజెక్టును షురువు జేసిండ్రు. మొన్ననే గా ప్రాజెక్టు పూర్తి అయ్యింది. గా దాని కింద కాలువ గట్టిండ్రు. రిబ్బిన్ కత్తిరిచ్చి జార్కండ్ ముక్యమంత్రి రగువర దాస్ గా కాల్వను షురు జేసిండ్రు. గాయిన షురువు జేసిన 24 గంటల లోపటే కాల్వకు గండిబడ్డది. 35 వూర్లల్ల పంట పొలాలు మున్గిపోయినయి. ఎల్కలు పొక్కలు బెట్టబట్కె కాల్వకు గండి బడ్డదని ఆఫ్సర్‌లు జెప్పిండ్రు'' అని గన్పతి ఎల్క అన్నది.
''గీడికి వొస్తుండగా ఇద్దరు మాట్లాడుకుంటుంటె ఇన్న. గాల్ల మాటలతోని మీ ఎల్కలకు నా మీద సుత కోపమున్నట్లు ఎర్కైంది'' అని గన్పతి అన్నడు.
''మీరే మిన్నరో ముందు గాల జెప్పుండ్రి''
''మల్కాజ్‌గిరిల ఒక అపార్టు మెంట్ల వినాయకుని మండపం బెట్టిండ్రు. వినాయకుని ముంగట నూనె దీపం బెట్టిండ్రు. పూజలు; పిల్లలు డాన్సులు అయినంక ఎక్కడోల్లక్కడికి బోయిండ్రు. నడి జాం నాత్రి ఎల్కలు చెంగడబింగడ ఎగ్ర బట్కె దీపం కింద బడ్డది. మండపంల ఏసిన తివాసి గాలింది. మంటలు లేసినయి. అపార్టుమెంట్ దెబ్బదిన్నది అని గాల్లు మాట్లాడుకుంటుంటె ఇన్న''
గన్పతి గట్ల జెప్పంగనే ఎల్కకు తిక్కలేసి ఉర్కింది. గది యాడ కింద బడేస్తదోనని గన్పతి బుగులు బడ్డడు.
''జెర మెల్లగ బో'' అని ఎల్కతోని అన్నడు.
''మీ బొమ్మను బెట్టి పూజలు జేస్తె జెనంకు పాయిదేమున్నది?'' అని ఎల్క అడిగింది.
''దేసం మొత్తం మీద వినాయక చవ్తి జేసెతందుకు 80 వేల కోట్ల రూపాయల కర్సు జేస్తున్నరు. నా పేరు జెప్పి చంద వసూలు జేస్తరు. దాంతోని అందరి తానికి రూపాలు బోతున్నయి. నా బొమ్మలు జేసెటోల్లు గాల్లకు మదర్ జేసెటోల్లు బత్కుతున్నరు. నా బొమ్మలు జేసెతందుకు బంకమన్ను సప్లై జేసెటోల్లు వినాయక చవ్తి జేసెబట్కె పైసలు కమాయిస్తున్నరు. బొంగు; తాటాకులతోని పందిరి ఏసెటోల్లకు పని దొర్కుతున్నది. నాకు పూజలు జేపిచ్చేటి అయ్యగార్లకు రూపాలిస్తున్నరు. నన్ను బాజబజంత్రిలతోని గొంచబోయి చెర్ల ఏస్తరు. ఇగ దాంతోని బాజజంత్రోల్లకు పని దొర్కుతున్నది. లారీలకు; ఆటోలకు గిరాకి దొర్కుతున్నది. నా పేరు మీద అన్నదానాలు జేస్తున్నరు. ఇగ దాంతోని బీదొల్లకు బువ్వ దొర్కుతున్నది. నా బొమ్మ బెట్టి పూజలు జేస్తున్న జెనంకు గిన్ని పాయిదలున్నయి'' అని గన్పతి జెప్పిండు.
జెర దూరం బోంగనే గన్పతి; ఎల్కలకు గులాబి రంగు జెండ గండ్లబడ్డయి.
''గులాబి జెండకు నా అసుంటోల్లే అస్లి ఓనర్లు అని మంత్రి ఈటల రాజేందర్ అన్నడు. లే కెసిఆర్ ఒక్కడే అస్లి ఓనర్ అని ఇంకోమంత్రి ఎర్రబెల్లిదయాకర్‌రావు అన్నడు. నా మంటపంకు గులాబి జెండాలు బెట్టిన గన్పతికి మేమే ఓనర్లమని టిఆర్ఎస్ లీడర్లు అంటరేమో! యాద్గిరి గుట్టల పాత గుడి జాగల షాన్ దార్గ కొత్త గుడి గడ్తున్నరు. ఒక తంబం మీద కెసిఆర్ బొమ్మను జెక్కిండ్రు. ఇగ గుట్ట గుడికి ఓనర్ నేనేనని కెసిఆర్ అంటడేమో!'' అని గన్పతి అన్నడు.
చౌరస్త వొచ్చింది. గాడ ట్రాఫిక్ పోలీస్ ఉన్నడు. ఎల్క సిగల్ లైన్ జంప్ జేసింది. ట్రాఫిక్ పోలీస్ రుకాయించిండు.
''డ్రైవింగ్ లైసెన్స్ సూబెట్టు'' అని గన్పతిని అడిగిండు
''లేదు'' అని గన్పతి అన్నడు.
''డ్రైవింగ్ లైసెన్స్ లేనందుకు 25,000 రూపాలు; సిగ్నల్ జంప్ జేసినందుకు 10,000 రూపాలు, హెల్మెట్ బెట్టనందుకు 5000 రూపాలు జుర్మాన కింద గట్టు''
''నేను గన్పతిని. గిది నా ఎల్క''
''గన్పతి మాస్క్ బెట్టుకోని; నీ స్కూటర్‌కు ఎల్క మాస్క్ బెట్టి గన్పతిని అంటె నమ్మెతందుకు అవుల గాన్నను కుంటున్నవా'' అని ట్రాఫిక్ పోలీస్ అన్నడు.
ఇగ దాంతోని గన్పతి మాయమై కైలాసం బోయిండు.
- తెలిదేవర భానుమూర్తి
సెల్: 9959150491