Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నారదుడు తంబూర దీస్కుండు. చిర్తలు దీస్కోని ఒక్కపారి కొట్టి జూస్కుండు. యాడికి బోవాలె. యాడికి బోతె బాగుంటదని సోంచాయించిండు. యాద్గిరి గుట్టకు బోక శానొద్దులైంది. గుట్టకు బోయి నర్సిమ్మ సామి తోని ముచ్చట బెడ్తె బాగుంటది. గాయిన తోని ముచ్చట బెడ్తె తెలంగానల ఏమైతున్నదో ఎర్కైతది అని నారదుడు అనుకున్నడు. అను కోని నారాయన నారాయన అన్కుంట చిర్తలు గొట్టుకుంట మొగులు మీది కెల్లి ఎల్లిండు.
నడిరాత్రి. యాద్గిరి గుట్ట మీద యాడ సప్పుడు లేదు. అందరు పండుకున్నరు. కొందరు కల్వరిస్తున్నరు. కొందరు కలల బజార్ల దిర్గుతున్నరు. నారదుడు గుట్ట మీద దిగిండు. గుడికి తాలమున్నది. నారదుడు మాయమై గుల్లెకు బోయిండు. నర్సిమ్మ సామి ముంగట్కి బోయి-
''నారాయన నారాయన'' అన్నడు
నర్సిమ్మ సామి కండ్లు దెర్సి- ''యాల్ల గాని యాల్ల వొచ్చిన వేంది నారదా'' అని అడిగిండు.
''మీకు పుర్సత్ ఉండేది గిప్పుడే గద సామీ! మీ తోని ముచ్చటబెడ్తె తెలంగానల ఏమైతదో ఎర్కైతది''
''ఇంతకు ముందు టిఆర్ఎస్ల సాప కింది నీల్ల లెక్క అసమ్మతి ఉండేది. గని గిప్పుడు సాప మీది మంట లెక్క మీద్కి వొచ్చింది''
''కెసిఆర్ అంటె గులాబి పార్టి లీడర్లు గజ్జున వొన్కుతరు.
గాయిన కిలాఫ్ ఒక్క మాట గూడ మాట్లాడరు. గాయిన అస్సరు అంటె అదే సహి. దూలా అంటె ఇదే సహి అంటరు గదా. గసువంటి గులాబి పార్టి లీడర్లు కెసిఆర్ కిలాఫ్ మాట్లాడుతున్నరా?''
''ఎట్లెర్కైందేమో గని గాయిన మంత్రి కుర్సి కిందికి నీల్లొస్తున్నయని ఆరోగ్య శాక మంత్రి ఈటల రాజేందర్‌కు ఎర్కైంది. గా నీల్లల్ల మంత్రి కుర్సి మున్గుతదని కొందరన్నరు. ఇగ దాంతోని గాయిన గరమైండు. మంత్రి కుర్సి బగలు బెట్టిన బిచ్చం గాదని గాయిన అన్నడు. జెనం మంత్రిని జేస్తె మంత్రినైన అని జెప్పిండు. గులాబి జెండుకు మేమే ఓనర్లమని జెప్పిండు. ముంగటికెల్లి టిఆర్ఎస్ల ఉన్నమని అన్నడు. నడ్మలొచ్చి మంత్రి గాలేదని అన్నడు. ముంగటికెల్లి తెలంగాన కోసం కొట్లాడి నోల్లను యాదిమర్సి బిటి బ్యాచ్ లీడర్లను తల్కాయ మీద్కి ఎక్కిచ్చుకుంటున్నరని ఈటల అన్నడు''
''రాజేందర్ గిట్లంటె కెసిఆర్ ఏమన లేదా?'' అని నారదుడు అడిగిండు.
''మీదికైతె ఏమనలేదు. నిన్ను నేను మంత్రిని జేస్తె మంత్రి కుర్సి ఎవ్వలు బెట్టిన బిచ్చం గాదని అంటవా? బిడ్డా! మోక జూసి నీ తోక గోస్త అని కెసిఆర్ మనసుల అనుకున్నడు. మొన్న కొత్తగ ఆరుమందిని మంత్రి కుర్సిల మీద గూసుండ బెట్టే ముంగట ఈటలను మంత్రి కుర్సి మీదికెల్లి దించుదామని కెసిఆర్ అనుకున్నడు గని దించెంతుకు మంచి మూర్తం లేకపోయె బట్కె ఊకున్నడు'' అని నర్సిమ్మసామి జెప్పిండు.
''కొత్తగ ఆరుగురు మంత్రులైతె మంత్రి కుర్సిలు దొర్కనోల్లు నారాజ్ గాలేదా?''
''నారా జైండ్రి. అసెంబ్లి; లోక్‌సబ ఎలచ్చన్ల ముంగట మంత్రికుర్సిలు లేకుంటె ఏదన్న ఒక కుర్సి ఇస్తమని కెసిఆర్; కెటిఆర్ శాన మంది టిఆర్ఎస్ లీడర్ల గూసుండ బెడ్తమని ఎమ్మెల్యే టికిట్ రానోల్లను బుద్గ రిచ్చిండ్రు. మొన్న కొత్తగ ఆరుగురిని మంత్రులు జేసే ముంగట ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న తప్పకుంట మంత్రినైతని గాయిన చెంచగాల్లకు జెప్పిండు. అడ్వాన్స్గ గాయినకు గాల్లు పూల బొకేలు ఇచ్చిండ్రు. సన్మానం గుడ్క జేసిండ్రు. కొందరు చెంచగల్లు గాయినొంతుకు తిర్పతికి బోయిండ్రు. గని జోగురామన్నకు మంత్రి కుర్సి దొర్కలేదు. ఇగ దాంతోని గాయిన సెల్ స్విచ్చాఫ్ జేసి అండర్ గ్రౌండ్‌కు బోయిండ్రు. మంత్రి కుర్సి దొర్కక బోయె బట్కె ఇంకొక ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఫారిన్ బోయిండు. మాదిగోల్లకు అన్యాలమైందని ఎమ్మెల్యే టి.రాజయ్య అన్నడు. కెసిఆర్ మాటదప్పిండని నాయిని నర్సిమ్మారెడ్డి మీదికే అన్నడు''
''నాయిని నర్సిమ్మారెడ్డి ఇంకేమన్నడో జెర కుల్లకుల్ల జెప్పు''
''గా అసెంబ్లి ఎలచ్చన్ల ముంగట ఎమ్మెల్యే టికిట్ అడిగితె ఇయ్యలేదు మల్లొక్కసారి ఎమ్మెల్సిని జేసి మంత్రి కుర్సి మీద గూసుండ బెడ్తనని కెసిఆర్ నాకు మాట ఇచ్చిండు. ఇగిస్తడు అగిస్తడని ఎదురు జూసిన. గని కెసిఆర్ మాట దప్పిండు. పార్టిల ఫస్టు సంది ఉన్నోల్లకు మంత్రి కుర్సి ఇయ్యకుంట నిన్నమొన్న వొచ్చినోల్లకు మంత్రి కుర్సి ఇచ్చుడేమన్న బాగుందా? టిఆర్ఎస్ ఓనర్లం మేము. బిటి బ్యాచోల్లందరు కిరాయిదార్లు. గాల్లు ఎప్పుడో అప్పుడు కాలిజేసి బోతరు. యాద్గిర గుట్ట రాతి తంబాల మీద కెసిఆర్ బొమ్మ కారు గుర్తు జెక్కుడు తప్పే అని నాయిని అన్నడు''
''మంత్రి కుర్సి రానోల్లు గరమై అడ్డం దొడ్డం మాట్లాడితె కెసిఆర్ ఊకుండా?''
''గాల్లను బుద్గరియ్యమని కెటిఆర్‌కు జెప్పిండు. మంత్రి కుర్సి దొర్కలేదని నారాజ్ గాకుండ్రి. మూడు నాల్గు నెలలల్ల ముగ్గురు నల్గురు మంత్రులను కుర్సిల మీదికెల్లి దించుతం. గాల్ల జాగల మిమ్ములను మంత్రులను జేస్త మనుకుంట కెటిఆర్ గాల్లను బుద్గరిచ్చిండు. గంత దాంక అసమ్మతి రాగం దీసిన గాల్లు కెటిఆర్ బుద్గరించినంక కెసిఆర్ బజన షురువు జేసిండ్రు''
''టిఆర్ఎస్ల అసమ్మతి లేకుంట బోయిందా?''
''బోలేదు. ఎవ్వలు ఎంత కోషిస్ జేసిన టిఆర్ఎస్ల అసమ్మతి మంటలు సల్లారెటట్లు లేదు. మంత్రులల్ల సగం మంది బంగారు తెలంగాన (బిటి) బ్యాచోల్లే మమ్ములను పక్కకు బెట్టి బిటి బ్యాచోల్లను నెత్తిమీద గూసుండ బెట్టుకుంటరా అని ఉద్యమ తెలంగాన (యుటి) బ్యాచోల్లు మండుతున్నరు. బిటి బ్యాచేందిరో. దాని తోక తింపుడేందిరో అని అడుగుతున్నరు''
''పార్టిల అసమ్మతి బోయెతందుకు కెసిఆర్ ఏం జేద్దామనుకుంటున్నడు?'' అని నారదుడు అడిగిండు.
''అసమ్మతి నివారణ యాగం' జేద్దామను కుంటున్నడు'' అని నర్సిమ్మ సామి జెప్పిండు.
ఇంతల తెట్న తెల్లారింది. నారదుడు మాయమై మొగులు మీదిక్క బోయిండు.
- తెలిదేవర భానుమూర్తి
సెల్: 9959150491