Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నారదుడు తంబూర దీస్కుండు. టింగ్ టింగ్ మన్నడు. చిర్తలు దీస్కుండు. ఒకపారి గవ్విటిని కొట్టి జూస్కుండు. గీసారి యాడికి బోవాలె. యాడికి బోతె బాగుంటదని జెరసేపు సోంచాయించిండు. యాడికో ఎందుకు ఎప్పటి తీర్గ యాద్గిరి గుట్టకు బోతె బాగుంటదని అనుకున్నడు. అనుకొని నారాయన, నారాయన అన్కుంట చిర్తలు గొట్టుకుంట మొగులు మీదికి ఎల్లిండు. యాద్గిరి గుట్ట దిక్కు గాయిన రాబట్టిండు.
నడిజాము నాత్రి. యాడ సప్పుడు లేదు. అందరు పండుకున్నరు. కొందరు కల్వరిస్తున్నరు. కొందరు కలల బజార్ల దిర్గుతున్నరు. నారదుడు యాద్గిరిగుట్ట మీద దిగిండు. గుడికి తాలం బెట్టి ఉన్నది. నారదుడు మాయమయ్యిండు. గుల్లెకు బోయిండు. నర్సిమ్మసామి ముంగట్కిబోయి-
''నారాయన, నారాయన'' అన్నడు.
''నువ్వా నారదా! యాలగాని యాల వొచ్చిన వేంది?'' అని నర్సిమ్మసామి అడిగిండు.
''దినం పూట మీకు పుర్సత్ ఉండదాయె. గప్పుడొస్తె ఏం పాయిద''
''నివొద్దే గని ఇంతకు ఎందుకొచ్చినవు''
''నేను మాపటీల నాలుగ్గొటంగనే తెలంగాన ఇలాకొలచ్చిన. నాకు సడక్ల మీద ఒక్క తాన గూడ ఒక్క ఆర్టీసి బస్సు గూడ గండ్ల బడలేదు. ఎందుకు గండ్లబడలేదో జెర జెప్తరా?''
''ఆర్టీసీ జీతగాల్లందరు హర్తాల్ జేస్తున్నరు నారదా!''
''బస్సులు గండ్లబడలేదు. గని ఎడ్లబండ్లు జట్కలు గండ్లబడ్డయి''
''ఆర్డినరీ బస్సులొంతుకు ఎడ్లబండ్లు ఎక్స్‌ప్రెస్ బస్సులొంతుకు జట్కబండ్లు నడిపిస్తున్నరు. కొన్ని కాన్గి బస్సులను గూడ నడిపిస్తున్నరు. దినం కూలిమీద కొంతమంది డేవర్లు, కండక్టర్లకు కొల్వులిచ్చి కొన్ని ఆర్టీసీ బస్సులను గూడ నడిపిస్తున్నరు''
''కొత్త డేవర్లు, కండక్టర్లు సక్కగ పని జేస్తున్నరా?''
''కొత్త డేవర్లకు బస్సులు సక్కగ నడ్పశాతగాలేదు. గాల్లు టక్కర్లు జేయబట్టిండ్రు. ఇగ కండక్టర్లు అడ్డగోల్ల బస్సు చార్జిల వసూలు జెయ్యబట్టిండ్రు. దాంతోని జెనం బస్సులు ఎక్కుకుంట ఎడ్లబండ్ల జట్కలల్ల బోబట్టిండ్రు.''
''దస్ర పండ్గ ముంగట బస్సులు నడ్వకుంటె జెనం ఊర్లలల్లకు ఎట్ల బోయిండ్రు''
''ఎడ్ల బండ్లు; జట్కల మీద బోయిండ్రు''
''ఆర్టీసి జీతగాల్లు హర్తాల్‌ను ఆపెతందుకు ముక్యమంత్రి ఏం జెయ్యలేదా?'' అని నారదుడు అడిగిండు.
''కెసిఆర్ ఆర్టీసీ జీతగాల్లతోని మాట్లాడలేదు. మీదికెల్లి మాపటీల లోపల కొల్వుకెక్కని ఆర్టీసి జీతగాల్ల కొల్వులు బోతయని బెదిరిచ్చిండు. కెసిఆర్ బెదిరిచ్చినా ఆర్టీసీ జీతగాల్లు హర్తాల్ ఆపలేదు. డిపోలల్ల గాల్లు వంట వార్పు జేసిండ్రు. ముక్యమంత్రి దిస్టి బొమ్మ దల్గ బెట్టిండ్రు. ర్యాలీలు దీసిండ్రు, దర్నాలు జేసిండ్రు. మోకాల్ల మీద బద్రాచలం రాముని గుడిమెట్లు ఎక్కిండ్రు. మహబూబ్‌నగర్‌ల మంత్రి శ్రీనివాస్ గౌడ్ మోటర్‌ను ఆర్టీసి జీతగాల్లు గెరాయించిండ్రు'' అని నర్సిమ్మ సామి జెప్పిండు.
''ఆర్టీసి హర్తాల్‌కు అపొజిసన్ పార్టీలు మదద్ ఇస్తమని ముందుగాల సిపిఐ జెప్పింది. ఆర్టీసి హర్తాల్ ఆపెతందుకు కెసిఆర్ ఏం జెయ్యక ఊకుండ బట్కె సిపిఐకి మండింది. హుజూర్నగర్ బై ఎలచ్చన్ల టిఆర్ఎస్కు మదద్ ఇచ్చే సవాల్ లేదని సిపిఐ అన్నది. కెసిఆర్ గాయిన పానానికి దొరనని అనుకుంటున్నడు. ఆర్టీసి ఎంప్లాయీస్ గాయిన జీతగాల్లని అనుకుంటున్నడు. ఆర్టీసి జీతగాల్లను డిస్మిస్ జేసిన అని జెప్తున్నడు. గాయిన గిట్లే జేస్తె జెనమంత గల్సి గాయినను డిస్మిస్ జేస్తరు అని సిపిఎం లీడర్లు అనబట్టిండ్రు. తెలంగాన గురించి కొట్టాడ్తున్నప్పుడు ఆర్టీసి జీతగాల్లను కెసిఆర్ ఒక్క తీర్గ తారీఫ్ జేసిండు. గాల్లు కాలుల ముల్లు ఇర్కితె పండ్లతోని దీస్తనని జెప్పిండు. ఇయ్యాల ఆర్టీసిల పని జేసేటి ఆడోల్ల కొంగు బట్టి పోలీసోల్లు గుంజుతుంటె సప్పుడు జేస్తలేడని బిజెపి లీడర్లు అన్నరు. డిపొల ముంగట దర్నలు జేస్తమని జెప్పిండ్రు''
''ఆర్టీసీ హర్తాల్ అయితుంటె కెసిఆర్ ఏం జెయ్యలేదా?''
''కెసిఆర్ అయ్యగార్లను స్వామీజీలను బిల్సిండు. గాల్లకు చెయ్యి సూబెట్టుకున్నడు. శని మీ దిక్కు సక్కగ జూస్తలేడు. శాంతి జేపిచ్చుకోండి. శనికి పూజలు జెయ్యుండ్రి. రాస్ట్రంల ఉన్న అయ్యగార్లకు తలా కిల నువ్వులు ఇయ్యుండ్రి. గట్ల జేస్తిరా అంటె మీకు అంత మంచిగైతది. ఆర్టీసి హర్తాల్ ఆగుతదని అని గాల్లు జెప్పిండ్రు. గాల్లు జెప్పిన తీర్గనే కెసిఆర్ శనికి పూజలు జేసిండు. బస్సులు నడుస్తలేవు. బస్సులొంతుకు రతాలు, పుష్పకవిమానాలు నడిపిస్తె బాగుంటదని కెసిఆర్ అనుకున్నడు. రతాల కొల్వులు లేని సదువుకున్న పోరగాల్లకు రతాలు నడిపిచ్చె కొల్వులు ఇస్తనని జెప్పిండు. రతాల మీద గులాబి జెండలు ఎగిరేస్తమని అన్నడు'' గిట్ల నర్సిమ్మసామి జెప్తుంటె తెల్లారింది. 'యాదాద్రి నాధ నిభయే తప సుప్రభాతం' అన్కుంట అయ్యగార్లు సుప్రభాతం సద్వబట్టిండ్రు.
''మల్ల గలుస్త'' అన్కుంట నారదుడు మాయమై మొగులు మీద్కి బోయిండు.
తోక: - ఒక బస్సుల ఇద్దరు ఆలుమొగలు ఎక్కిండ్రు. మొగని తాన్కి కండక్టరొచ్చిండు.
''ఈడి కెల్లి వరంగల్‌కు బస్ ఛార్జి ఎంత?'' అని మొగడు అడిగిండు,.
''నూర్రూపాలు'' అని కండక్టర్ జెప్పిండు.
''నాకు నూర్రూపాలైతె నా పెండ్లాంకు ఎంత?'' అని గాడు అడిగిండు.
గాడు గట్ల అడ్గంగనే అందరు నవిండ్రు.
''నవ్వకుండ్రి. మొన్న నేను పొలంల కూలి పనికిబోతె ఒకే పనికి నాకు రొండు నూర్ల రూపాలిస్తె నా పెండ్లాకు నూర్రూపాలిచ్చిండ్రు. గదే తీర్గ గీడ గూడ ఉంటదేమోనని అడ్గిన''
- తెలిదేవర భానుమూర్తి.
సెల్: 9959150491