- మంజీర పరీవాహక పల్లెల్లో మొదలైన ప్రయత్నాలు
- లెక్కలు వేసుకుంటూ నాయకులను కలుస్తున్న ఔత్సాహికులు
- పలుచోట్ల రంగంలోకి దిగిన పార్టీల ముఖ్యనాయకులు
నవతెలంగాణ-బోధన్
పల్లెల్లో ఎన్నికలు ప్రారంభం కావడంతో ఎన్నికల వేడీ మొదలైంది. బోధన్ మండలంలో సర్పంచ్ రిజర్వేషన్ అధికారికంగా విడుదల కాకముందే పల్లెల్లో ఆశావహులు సర్పంచ్ గిరి కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. వాట్సప్ లలో రిజర్వేషన్ వివరాలు కొంతమంది జోరుగా విడుదల చేయడంతో వాటి ఆధారంగా ఆశా వాహులు పోటీలకు సిద్ధమవుతున్నారు. కొన్ని గ్రామాల్లో కులసంఘాల వారిని కలుస్తూ తమ మనసులోని మాటను వెలిబుచ్చుతున్నారు. ఇదిలా ఉండగా మరికొంత మంది వార్డు సభ్యులుగా పోటీ చేయడానికి కూడా జోరుగా ఉత్సాహం చూపుతున్నారు. పలు పార్టీల నాయకులు సర్పంచ్ అభ్యర్థులు సమర్థులయిన వారిని నిలబెట్టడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. కొంతమంది ఆశావహులు మండలంలోని ముఖ్య నాయకులతో కలుస్తూ తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఓ గ్రామంలో ఓ నాయకుడు సర్పంచ్‌గా బరిలో ఉండడానికి తీవ్రప్రయత్నాలు చేస్తున్నారు. కాని అతనికి అదే గ్రామంలో తీవ్ర వ్యతిరేకత వస్తున్నట్లు సమాచారం. గత నెల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సదరు నాయకుడు అవకతవకలకు పాల్పడినట్లు స్థానిక ఎమ్మెల్యే దష్టికీ వెళ్లినట్లుగా సమాచారం. దాంతో ఎమ్మెల్యే కూడా అతనిపై గుర్రుగా ఉన్నట్లు వినికిడి. ప్రస్తుతం ఆ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ పోటీ చేయడానికీ సిద్ధమయ్యారు.
ఏకగ్రీవం కోసం ప్రయత్నాలు..
బోధన్ మండలంలోని మంజీరా పరివాహక ప్రాంత గ్రామాలైన ఓ రెండు గ్రామాల వారు ఏకగ్రీవ సర్పంచ్ లు కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. గతంలో ఓ గ్రామానికీ ఏకగ్రీవంగా సర్పంచ్‌ను ఎన్నుకున్నారు. ఇదే ఒరవడిని మరోసారి ఏకగ్రీవం చేసుకోవడానికీ పలువురు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా నేడో, రేపో సమావేశం జరుపడానికీ ఔత్సాహికులు ప్రణాళికలు చేస్తున్నారు. కానీ ఏకగ్రీవం కాకుండా మరికొంతమంది బరిలో దిగే సూచనలు కనిపించడంతో ఈ గ్రామానికీ సర్పంచ్ ఎన్నిక ఆసక్తిగా మారింది. ఈ గ్రామంలో ఎస్సీ మహిళగా రిజర్వేషన్ వచ్చినట్లు సమాచారం. అలాగే మేజర్ గ్రామ పంచాయతీ నుంచి విడిపోయి నూతన గ్రామ పంచాయతీగా మారిన మరో గ్రామంలో శనివారం గ్రామస్తులు సమా వేశమై ఏకగ్రీవం కోసం చర్చలు జరిపారు. తానంటే తాను సర్పంచ్‌గా ఉంటానని ఇద్దరు పోటీ పడగా సమావేశం అర్దాంతరంగా ముగిసింది. గ్రామంలో మాజీ ఉపసర్పంచ్ మరో యువకుడి మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ఇలా ఇప్పటికే సర్పంచ్ కోసం గ్రామాల్లో తీవ్రంగా పోటీనెలకొంది.
Authorization