మీ వయసెంత? మీ వయసు కన్నా మీ మెదడు వయసు చిన్నదా.. పెద్దదా? అని ఎవరైనా అడిగితే చివాట్లు పెట్టకండి. 'ఇదేం ప్రశ్న?' అని చీదరించుకోకండి. ఎందుకంటే.. ఇందులో ఒక నిజం దాగి ఉంది. మనిషి వయసుకు, అతడి మెదడు వయసుకు సంబంధమే లేదని ఓ అధ్యయనంలో తేలింది. రెండింటి మధ్య సుమారు పదేండ్ల తేడా ఉంటుందని వెల్లడైంది. శరీరం బరువు పెరిగే కొద్దీ మెదడు వయసు మరింతగా పెరుగుతుందట. మెదడులోని భాగాలను అనుసంధానం చేసే కణజాలం సామర్థ్యంపై ఇది ఆధారపడి ఉంటుందట. శరీర నిర్దిష్ట బరువుకన్నా అధిక బరవు కలిగి ఉన్నవారిలో ఈ కణజాలం తక్కువగా ఉంటుందని పరిశోధకులు వెల్లడించారు. 'న్యూరోబయోలజీ ఫర్ ఏజింగ్' జర్నల్ ఈ విషయాన్ని ప్రచురించింది. అధిక బరువు ఉన్న 40 ఏండ్ల వ్యక్తి మెదడు తనకన్నా పదేండ్లు ఎక్కువ వయసున్నవారి మెదడుతో సమానంగా క్షీణిస్తుందని అధ్యయనంలో వెల్లడైనట్టు పేర్కొంది. అధికబరువున్న వారిలో మెదడులోని కణజాలం తగ్గడమనేది వారు నడి వయసుకు చేరినప్పటి నుంచే మొదలవుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. నడివయసులో అధిక బరువు మెదడుపై మరింత ప్రభావాన్ని చూపుతుందని, మెదడు వయసును పదేండ్లు పెంచుతుందని వెల్లడించారు.