మనిషికి ఆహారం ఎంతో ముఖ్యం. దీన్ని సక్రమంగా తీసుకుంటేనే మనుగడ. లేదంటే అనారోగ్యాన్ని కొనితెచ్చున్నట్టే. అయితే... మనుషుల ప్రవర్తనల్లాగే వారి ఆహార విషయంలోనూ వైవిధ్యం ఉంటుంది.
కొంతమంది ఎక్కువగా భుజించొచ్చు. మరికొందరు తక్కువగా తినొచ్చు. కొంతమంది త్వరగా స్థూలకాయులు కావచ్చు. మరికొందరికి ఎంత తిన్నా స్థూలకాయం వారి దరిదాపులకు రాకపోవచ్చు.
కొంతమంది సన్నగా ఉండాలనే భావనతో శరీర అవసరాలకు కూడా సరిపోని స్థాయిలో అతి తక్కువ ఆహా రాన్ని తీసుకుంటారు. ఇలాంటి వారికి వైద్య సహాయం అవసరం కావచ్చు. ఇలాంటి వారు 'అనొరెక్సియా నెర్వోసా' అనే మానసిక వ్యాధితో బాధపడుతున్న వారై ఉండటమే ఇందుకు కారణం. ఇది ఎక్కువగా మహిళల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా యువతలో ఈ సమస్య అధికంగా ఉంటుంది. అనొరెక్సియా నెర్వోసా బారిన పడ్డ వారి మనోస్థితి విలక్షణంగా ఉంటుంది. తమకు స్థూలకాయం వస్తుందనే భయం వీరిని వెంటాడుతూ ఉంటుంది. దీంతో అతి తక్కువ మోతాదులో ఆహారాన్ని తీసుకుంటారు. స్థాయిని మించి వ్యాయామం చేస్తుంటారు. అలాగే ఈ సమస్యకు గురైన మహిళలు రుతుక్రమంలో లోపాన్ని ఎదుర్కొంటారు.
అనొరెక్సియా నెర్వోసా అనే పరిస్థితి యవ్వనంలోకి అడుగుపెట్టిన కొన్నాళ్లకు కనిపిస్తుంది. ఇది సాధారణంగా ఉన్నతాదాయ వర్గాల్లో ఎక్కువగా ఉంటుంది. అమ్మాయిల్లో డైటింగ్ అనేది సర్వసాధారణంగా చూస్తుంటాం. కొంతమంది అమ్మాయిలు త్వరితగతిన బరువు కోల్పోవాలనే ఉద్దేశంతో ఆహారాన్ని తీసుకోవడం మానేస్తారు. తమ వయసు, ఎత్తులతో పోల్చినప్పుడు ఉండాల్సిన స్థాయికంటే తక్కువ బరువు ఉన్నప్పటికీ కొంతమంది అమ్మాయిలు డైటింగ్ చేయడం, తీవ్రస్థాయిలో వ్యాయామం చేయడం చేస్తుంటారు. లేదా డైటింగ్తోపాటు బరువు తగ్గడానికి మందులు వేసుకుంటూ ఉంటారు. వీరిలో ఆహారం పట్ల స్థిరమైన అవాంఛిత ఆలోచనలు (అబ్సెషన్స్) ఉంటాయి. ఇలాంటి వారు ఏదైనా తిన్న తర్వాత బరువు పెరగకూడదనే ఆలోచనతో ఆహారాన్ని వాంతి చేసుకోవడానికి కూడా వెనుకాడరు.
దుష్ఫలితాలు
ఆహారం తీసుకోకపోవడం వల్ల కుద్బాధకు గురవుతారు. ఫలితంగా అనేక శారీరక, మానసిక సమస్యలు ఎదురవుతాయి.
వ్యాకులతకు గురవుతారు. ఏకాగ్రత దెబ్బ తింటుంది. నిద్ర సరిగా పట్టదు.
శరీరంలో పెళసైన ఎముకలు విరిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శారీరక బలహీనతకు లోనవుతారు.
వాంతుల కారణంగా మూర్చ వ్యాధికి గురికావచ్చు. మూత్రపిండాలు దెబ్బ తినొచ్చు. గుండె కొట్టుకోవడంలో లోపాలు సంభవించొచ్చు.
హార్మోన్లలో అసమతుల్యతలు సంభవించి రుతుక్రమంలో మార్పులు రావచ్చు. రుతుక్రమం పూర్తిగా ఆగిపోయే అవకాశాలున్నాయి.
మరేం చేయాలి?
ఈ సమస్య తక్కువ స్థాయిలో ఉన్న వారికి ప్రత్యేక చికిత్స అవసరమవుతుంది. అమ్మాయిలు కొంత బరువు తగ్గిన తర్వాత సరైన పద్ధతిలో సలహాలివ్వడం ద్వారా వారిలో ఉండే అబ్సెషన్ని తొలగించొచ్చు.
వయసు, ఎత్తులకు తగిన బరువు ఉన్నప్పటికీ అమ్మాయిల్లో బరువు తగ్గాలనే ఆలోచన ఇంకా స్థిరంగా ఉండ డైటింగ్, వ్యాయామాలు చేస్తుంటే తప్పని సరిగా వారికి వైద్య సహాయం అవసరమవుతుంది. సకాలంలో చికిత్స చేయకపోతే ప్రాణాపాయం కూడా సంభవించొచ్చు. అనొరెక్సియాను తొలిదశలోనే గుర్తిస్తే పిల్లలను తిరిగి సంపూర్ణ ఆరోగ్యవంతులు కావడానికి ఆస్కారం ఉంది.
Authorization