వ్యాయామంతో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అందరికీ తెలిసిందే. ఇప్పటికే అనేక అధ్యయనాల్లో ఇది తేలింది. అయితే... వ్యాయామంతో ఆరోగ్యమే కాదు, ముప్పు కూడా ఉందంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ సదరన్ మెడికల్ సెంటర్ పరిశోధకులు. గుండె జబ్బులను నివారించడానికి వ్యాయామం మంచి సాధనమైనప్పటికీ వృద్ధాప్యంలో ఇది హృద్రోగాలకు దారి తీయొచ్చని హెచ్చరిస్తున్నారు. 65 ఏండ్ల లోపు వయసు ఉన్నవారు వారానికి నాలుగైదు సార్లు వ్యాయామాలు పాటిస్తే గుండె సామర్థ్యం పెరుగుతుందని గత అధ్యయనాలు చెప్పాయని, తమ పరిశోధనలో మాత్రం ఫలితాలు మరోలా వచ్చాయని పేర్కొన్నారు. వృద్ధాప్యంలో క్రమం తప్పకుండా కఠోర వ్యాయామాలు చేస్తే హానికరమని, వారానికి రెండు మూడుసార్లు మాత్రమే తేలికపాటి వ్యాయామాలు చేయాలని సూచిస్తున్నారు. కండరాలు గట్టిగా ఉండగా వ్యాయామాలు చేస్తే శరీరంపై అధిక ఒత్తిడి పడి గుండె గదులు రక్తంతో నిండవని అంటున్నారు. పర్యావసానంగా రక్తం తిరగి ఊపిరితిత్తులోకి వస్తుందని, ఇది గుండె వైఫల్యానికి దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు.