బిస్కెట్లు తింటే బుర్ర పనిచేయదా? అవుననే అంటున్నాయి కొత్త పరిశోధనలు. అదేపనిగా బిస్కెట్లు, కేకులు తింటే మెమొరీ దెబ్బతినే ప్రమాదముందట! బిస్కెట్లు, కేకుల ప్రాసెసింగ్ సమయంలో బిస్కెట్లు కరకరలాడేందుకు, కేకులకు మంచి ప్లేవర్ రావడానికి వాడే ట్రాన్స్‌ఫ్యాట్స్ అనే కొన్నిరకాల కొవ్వు పదార్థాలే. దీంతోపాటు హైడ్రోజెనేటెడ్ ఆయిల్స్ వాడటం వల్ల ఆరోగ్యంపై చెడుప్రభావం చూపుతుందని సైంటిస్టులు తేల్చారు. ట్రాన్స్‌ఫ్యాట్స్ అధికంగా ఉండే బిస్కెట్లు, కేకులు ఎక్కువగా తినేవారిలో మెమొరీ పవర్ తగ్గి పోయే ప్రమాదముందంటున్నారు శాస్త్రవేత్తలు. బిస్కెట్లు, కేకుల్లో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ ప్రభావం గురించి యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, శాండియాగో స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన శాస్త్రవేత్తలు 45 ఏండ్లలోపు వయసున్న వెయ్యి మందిపై పరిశోధనలు చేశారు. ట్రాన్స్‌ఫ్యాట్స్‌తో కూడిన బిస్కెట్లు, కేకులు అధికంగా తిన్నవారిలో జ్ఞాపకశక్తి తగ్గిపోవడాన్ని గమనించారు. మరికొంతమందిలో అధిక బరువు, గుండె సంబంధిత వ్యాధులు బయటపడ్డాయి. బ్రిటన్‌లో ఈ ఫ్యాట్స్ వాడకాన్ని దాదాపు నిషేధించినంత పని చేశారు.