ఇంటి పనులు చేయాల్సిన బాధ్యత మహిళలదే అన్న భావన సమాజంలో ఉండిపోయింది. అందుకే అబ్బాయి, అమ్మాయి ఉన్న ఇంట్లో తల్లిదండ్రులు ఇంటి పనులు అమ్మాయికి, బయటి పనులు అబ్బాయిలకు చెబుతారు. బయటికెళ్లి సంపాదించేది మగవాడు కాబట్టి వంటా వార్పు బాధ్యత ఆడవారిదే అనంటారు చాలామంది భర్తలు. ఒకవేళ భార్య కూడా ఉద్యోగానికి బయటికి వెళ్లినా ఇంటి పనులు మాత్రం ఆమె చేయాల్సిందే అన్న అభిప్రాయంతో ఉంటారు. వంటింటి గడప తొక్కని మగవారు చాలామంది ఉంటారు. ఉద్యోగం చేసినా చేయకపోయినా ఇంటి పనులూ మహిళలకు తప్పవు. ఇద్దరు కలిసి సంపాదించినప్పుడు వంటా వార్పులోనూ పని విభజన జరగాలి కదా..! అనంటే 'ఇలాంటి పనులు పురుషు లెందుకుచేస్తారు..?' అంటూ వాదిస్తారు మగవారు. ఈ వివక్ష ఇప్పటిది కాదు. అనాదిగా వస్తున్నదే. ేఅయితే..ఇంటి పనులంటే నామోషిగా ఫీలయ్యే మగవారికి కనువిప్పు కలిగించే అధ్యయన ఫలితాలు వెలువడ్డాయి. ఇది ఇంటి పనులు చేయని మగవారికో హెచ్చరిక. మగవారు వంటావార్పులో పాలుపంచు కోకపోతే అనేక మానసిక, శారీరక రుగ్మతలు తప్పవట. లండన్ యూనివర్సిటీ కాలేజ్ ఆధ్వర్యంలో చేపట్టిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. 20 వేల మంది స్త్రీపురుషులను పరిశీలించగా కొన్ని అంశాలు వెలుగు చూశాయి. వీరిలో ఇంటి పనులు, తోటపని లాంటి శారీరక శ్రమ చేసే వారు ఆరోగ్యంగా ఉంటున్నట్టు వెల్లడైంది. ఇలాంటి పనులంటే ఇష్టపడని వారు గుండెజబ్బులు, క్యాన్సర్లతోపాటు మానసిక ఒత్తిడి వల్ల వచ్చే గ్లూకోస్ ఇంటాల రేషన్, ఇన్ఫ్లెమేషన్ లాంటి రుగ్మతలకు గురయ్యారని గుర్తించారు. ఇంటి పనులు చేయడం నామోషి కాదు ఆరోగ్యమని మగవారు గుర్తించాలి. మానసికఆందోళనను తగ్గించి ఆరోగ్యంగా ఉంటాలంటే ఇంట్లో పనులు చేయాల్సిందే..! కలిసి పని చేస్తే.. ఆరోగ్యానికి ఎంతో మంచిదని గుర్తుంచుకోవాలి.