మన పెద్దవారు మైళ్లకొద్ది అలసట లేకుండ నడిచేవారు. మనం మాత్రం కిలోమీటర్ నడిస్తే చాలు కాళ్ళనొప్పులంటూ ఇబ్బంది పడిపోతుంటాం. ఏ మాత్రం బాధను సహించలేక అయింట్మెంట్లు, ఆయిల్స్ పూసేసి, పెయిన్‌కిల్లర్స్ కూడా వేసుకుంటాం. కాళ్ళ నొప్పి అనేది చాలా సాధారణ సమస్య. ఇది కాలి వేళ్ళు, మోకాలి ప్రాంతం, మడిమ, పాదం వంటి ఏ ప్రాంతంలో అయిన రావచ్చు. పెద్దవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఎక్కువ సమయం పాటూ నడవటం, నిలబడటం, పోషకాలు లోపం, మధుమేహం వంటి వాటి వల్ల కాళ్ళ నొప్పి రావచ్చు. మందులు వేసుకోకుండా కొన్ని రకాల చిట్కాలు పాటిస్తే కాళ్ళనొప్పులు మాయం అవుతాయి.
బెణుకులు, గాయాల వలన కలిగే ఇన్ఫ్లమేషన్లతో వచ్చే కాళ్ళనొప్పులకు వెనిగర్ ఎంతో బాగా పనిచేస్తుంది. ఒక బకెట్ లో వేడినీటిలో రెండు చెంచాల వెనిగర్ కలపాలి. దీనితో పాటుగా కొద్దిగా ఎప్సం సాల్ట్ ను కూడా కలపండి. ఈ మిశ్రమంలో దాదాపు 20 నిమిషాల పాటూ కాళ్ళను నానబెట్టండి. ఇలా చేయటం వలన కాళ్ళ నొప్పుల నుండి ఉపశమనం పొందుతారు. వెనిగర్ కాళ్ళనొప్పులకు ఎంతో ఉపశమనం కలిగిస్తుంది.
కాళ్ళలో కలిగే నొప్పి, గాయం కారణంగా వచ్చే వాపులను తగ్గించే శక్తివంతమైన పద్దతి ఐస్ థెరపీ. చిన్న చిన్న ముక్కలుగా చేసిన ఐస్ ముక్కలను ఒక ప్లాస్టిక్ బ్యాగ్ లో ఉంచి, దానితో నొప్పిగా ఉన్న చోట మెల్లగా మసాజ్ చేయాలి. ఇలా ఐస్ బ్యాగ్ తో పది నిమిషాల కంటే ఎక్కువగా మసాజ్ చేయకూడదు. ఎక్కువ సమయం ఐస్బ్యాగ్తో మసాజ్ చేస్తే చర్మం, రక్త నరాలు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది.
నొప్పులను నయం చేసే గుణం ఎప్సం సాల్ట్ లో ఉంటుంది. కాళ్ళనొప్పులతో బాధపడేవారికి ఇది త్వరిత ఉపశమనం కలిగిస్తుంది. ఒక బకెట్ లో వేడి నీటిని తీసుకొని అందులో రెండు నుండి మూడు చెంచాల ఎప్సం సాల్ట్ ను కలపాలి. ఇందులో పదిహేను నిమిషాల పాటూ కాళ్ళను ఉంచాలి. నొప్పి మాయం అవుతుంది. కాళ్ళను బయటకి తీసిన తర్వాత మాయిశ్చరైజర్ రాయాలి. (ఎప్సం సాల్ట్ కాళ్ళను పొడిగా మారుస్తుంది)
లవంగం నూనె తలనొప్పి, కీళ్ళనొప్పులు, అథ్లెట్ లలో కలిగే కాళ్ళ నొప్పులు, గోళ్లలో కలిగే ఇన్ఫెక్షన్, చిగుళ్లలో కలిగే నొప్పి నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. నొప్పిగా అనిపించిన వెంటనే లవంగాల నూనెను అప్లై చేయటం వలన ఎంతో రిలాక్స్‌గా అనిపిస్తుంది. ఈ నూనెతో మసాజ్ చేయటం వలన రక్త ప్రసరణ సరిగా జరిగి, కండరాలు విశ్రాంతి తీసుకుంటాయి. కాళ్ళనొప్పులు ఎక్కువగా ఉంటే రోజులో రెండు, మూడు సార్లు లవంగం నూనెతో మెల్లగా మసాజ్ చేస్తే త్వరగా తగ్గుతాయి.
Authorization